Suicide Prevention Day 2024 : ప్రేమ సఫలం కాలేదని ఒకరు.. మోసపోయామని మరొకరు.. అప్పుల బాధతో ఇంకొకరు... కుటుంబ తగాదాలతో వేరొకరు.. రకరకాల కారణాలతో చేజేతులా ప్రాణాలు తీసుకుంటున్నారు. కుటుంబాలకు తీరని శోకాన్ని మిగుల్చుతున్నారు. మరి ఇలాంటివాళ్లంతా ఎందుకు ప్రాణాలు తీసుకుంటారు? ఆత్మహత్య ఆలోచనలు వచ్చేవారు ఏం చేయాలి? వాటి నుంచి ఎలా బయటపడాలి? కుటుంబ సభ్యులు వారిని ఎలా గుర్తించాలి? గుర్తించి ఏం చేయాలి? అనే వివరాలు ఇప్పుడు చూద్దాం.
లక్షల్లో ఆత్మహత్యలు
గతేడాది లెక్కల ప్రకారం.. మన దేశంలో సుమారు 1.64 లక్షల మంది వివిధ కారణాలతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరిలో 1.10 లక్షల మంది పురుషులు కాగా 54 వేల మంది మహిళలు ఉన్నారు. అంటే.. ఈ లెక్క ప్రకారం రోజుకు సగటున 450 మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్నమాట! గతంలో 40 సంవత్సరాలు దాటిన వారు కుటుంబ బాధ్యతలతోపాటు వివిధ కారణాలతో ఆత్మహత్యలు చేసుకునే వారు. కానీ.. ప్రస్తుతం యువత, మధ్య తరగతి మహిళలు ఎక్కువగా ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు నేరపరిశోధన పరమైన లెక్కలు చెబుతున్నాయి. రహదారి ప్రమాదాల తరువాత ఆత్మహత్యలతోనే ఎక్కువగా మరణాలు సంభవిస్తున్నట్లు అధికార గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
ఎందుకీ నిర్ణయం తీసుకుంటారు?
జీవితంలో తాము ఒంటరి అని ఫిక్స్ అయినవారు.. సమస్యలు చుట్టుముట్టినప్పుడు మరింతగా కుంగిపోతారట. వాటిని ఎవరితో పంచుకోవాలో తెలియక.. ఎలా గట్టెక్కాలో తెలియక.. ఇక మరణమే మంచిదనే నిర్ణయానికి వస్తారని మానసిక నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు అనుభవిస్తున్న కష్టాల నుంచి బయటపడడానికి.. ఆత్మహత్య మాత్రమే ఏకైక మార్గమని భావిస్తారట.
ఇలాంటి వారిని ఇలా గుర్తించవచ్చు..
- రోజువారీ పనుల్లో అశ్రద్ధ
- కారణం లేకుండానే ఏడవడం
- విపరీతంగా తినటం లేదా అస్సలు తినకపోవటం
- అతినిద్ర లేదా నిద్రలేమి
- ఎప్పుడూ ఒంటరిగా ఉంటారు. చీకట్లో ఉండేందుకు ప్రాధాన్యమిస్తారు.
- కుటుంబ సభ్యులతో కూడా మాట్లాడకుండా ఉంటారు.
- తమకు ఇష్టమైన వస్తువులను ఇతరులకు ఇస్తారు.
- కారణం లేకుండా.. దూరంగా ఉన్నవారిని చూడాలనిపిస్తోందని అంటారు.
- విపరీతమైన భావోద్వేగాలు చూపిస్తారు
- బతకాలని లేదంటూ మాట్లాడుతుంటారు.
కుటుంబ సభ్యులు ఇలా చేయాలి..
- కుటుంబంలోని సభ్యులు ఎవరైనా ఈ పరిస్థితికి ఒక్కరోజులో రాలేరు.
- కొంత కాలం నుంచే మదనపడుతుంటారు కాబట్టి.. వారిని గమనిస్తుండాలి.
- పైన చెప్పిన లక్షణాలు గమనిస్తే.. వారిని ఒంటరిగా వదిలేయకూడదు.
- కిరోసిన్, పురుగు మందులు, తాడు వంటివి దూరంగా ఉంచాలి.
- ఎక్కువ సమయం ఒకే గదిలో ఉండకుండా చూడాలి.
- సాధ్యమైనంత త్వరా మానసిక వైద్యుల వద్దకు తీసుకెళ్లాలి.
"ఆత్మహత్య చేసుకునే వారిని ముందుగానే గుర్తించవచ్చు. పదేపదే నిరాశగా మాట్లాడడం, క్షణికావేశానికి లోనవ్వడం, నేనెందుకు పనికిరానంటూ సంబోధించడం, కుటుంబ సంబరాలు సహా అందరికీ దూరంగా ఉండడం లాంటి లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకూడదు. ఇలాంటి వారికి ధైర్యం చెప్పడం.. సమస్యకు పరిష్కారం ఉందనే నమ్మకం వారిలో కల్పించేలా చర్యలు తీసుకోవాలి. ఈ మధ్య చిన్న పిల్లలు కూడా తీవ్ర ఒత్తిళ్లకు గురవుతున్నారు. తల్లిదండ్రులు పిల్లలతో సమయాన్ని గడపాలి. వాళ్ల సమస్యలను పంచుకునే ప్రయత్నం చేయాలి. చదువులో వెనుకబడ్డారనే ఒత్తిడికి లోను కాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఏదైనా సమస్య కనిపిస్తే మానసిక వైద్యుల్ని సంప్రదించి.. తగిన మందులు, కౌన్సెలింగ్ ఇప్పించాలి. ఆత్మహత్యలను నివారించడాన్ని అందరూ ఒక సామాజిక బాధ్యతగా భావించి.. కృషి చేసినప్పుడే ఆచరణ ద్వారా ఆశయ సాధన సాధ్యపడుతుంది."
- డాక్టర్ కవితాప్రసన్న, మానసిక వైద్యనిపుణురాలు
ఇంత చిన్న లాజిక్ మిస్సయితే ఎలా?
ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవాలనే నిర్ణయం తీసుకోవడానికి కొన్ని వారాలు పడుతుంది. లేదంటే.. కనీసం కొన్ని రోజులు పడుతుంది. ఈ గ్యాప్లో ఎన్నో ఆలోచనలు చేస్తారు. ఈ కష్టాలు ఇక తమను వదిలిపెట్టవని.. ఇందులోంచి తాము బయటపడే అవకాశమే లేదని బలంగా విశ్వసించినవారే ఆత్మహత్యకు పాల్పడతారు. ఇలాంటి ఆలోచనల్లో ఉన్నవారు ఓ చిన్న లాజిక్ మరిచిపోతారు. అదేమంటే.. ఇప్పటి వరకూ మీ జీవితంలో ఎన్నో కష్టాలతో.. ఎన్నోసార్లు ఏడ్చి ఉంటారు. ఇంకెన్నోసార్లు అత్యంత సంతోషంతో నవ్వుకొని ఉంటారు. ఇందులో ఏదీ శాశ్వతం కాలేదు. అవన్నీ దాటుకొనే మీరు ఇక్కడిదాకా వచ్చారు. అదేవిధంగా.. ఈరోజు మీరు అనుభవిస్తున్న కష్టం కూడా శాశ్వతం కాదు. అది కూడా జస్ట్.. ఒక పాసింగ్ క్లౌడ్. తప్పకుండా అదికూడా తొలగిపోతుంది, మళ్లీ మీ జీవితం పూదోటగా మారుతుంది. ఇంత చిన్న లాజిక్ ఎలా మిస్సవుతున్నారు??
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.