Stress Relief Techniques in Telugu: మన రోజూవారీ జీవితంలో ఎన్నో సమస్యలు, సవాళ్లను ఎదుర్కొనే క్రమంలో ఒత్తిడి, ఆందోళనలకు గురవుతుంటాం. వీటిని ఎలా నియంత్రించాలంటే చాలా సలహాలే చెబుతారు. కానీ ఒకరికి పనిచేసినవి ఇంకొకరికి పనిచేయకపోవచ్చు. అయితే, ఈ 3-3-3 రూల్ మాత్రం ఎక్కువ మందికి ఉపయోగపడిందని నిపుణులు వెల్లడిస్తున్నారు. 2020లో Journal of Clinical Psychology జర్నల్‌లో ప్రచురితమైన "Grounding techniques for anxiety and stress: A systematic review"లో ఈ విషయం తేలింది. ఈ నేపథ్యంలోనే అసలేంటీ రూల్? ఇది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కువ ఒత్తిడిలో ఉన్నా, ఏదైనా విషయంలో ఆందోళన పడుతున్నా మన చుట్టూ ఉన్న మూడు వస్తువుల్ని తేరిపార చూడాలని నిపుణులు చెబుతున్నారు. నిద్రలో ఉన్నా సరే.. అవేంటో, ఏ రంగో, ఎలా ఉన్నాయో అడిగితే ఠక్కున చెప్పేలా తీక్షణంగా చూడాలని వివరిస్తున్నారు. ఇలా ఒకదానిపైనే దృష్టి కేంద్రీకరించడం వల్ల ఆందోళన నుంచి బయటపడతామని అంటున్నారు.
ఇంకా దీంతో పాటు చుట్టుపక్కల వస్తున్న మూడు శబ్దాలను గమనించాలని నిపుణులు అంటున్నారు. బెల్, సైరన్, ఆఖరికి ఏసీ చేసే సౌండ్ అయినా సరే.. ఏదో ఒక శబ్దాన్ని వినాలని చెబుతున్నారు. అది ఎలా? ఎందుకు వస్తోందో కూడా గమనించాలని వివరిస్తున్నారు.
ఇక చివరగా శరీరంలోని మూడు భాగాలను కదిలించాలని నిపుణులు సూచిస్తున్నారు. భుజాలు, కాలి వేళ్లు, తల లాంటివి ఒకే రిథమ్‌లో తిప్పాలని చెబుతున్నారు. దీనివల్ల వచ్చే కదలికల మీద శ్రద్ధ పెడితే ఏ సమస్యా లేకుండా ఆందోళన నుంచి బయటపడొచ్చని అంటున్నారు.
నివారించుకోవటమెలా?
- మానసిక ప్రశాంతతను పెంచే యోగా, ధ్యానం, ప్రాణాయామం వంటివి చేయాలి.
- శరీర సంరక్షణ మీద దృష్టి పెట్టి.. మంచి ఆహారం తినటం, కంటి నిండా నిద్రపోవడం అలవరుచుకోవాలి.
- ఒత్తిడి లక్షణాలు కనిపించినప్పుడు వ్యాయామం చేయాలని కనీసం కొద్దిసేపు నడిచినా మూడ్ మెరుగవుతుందని నిపుణులు అంటున్నారు.
- మనసుకు ప్రశాంతత, ఆనందం కలిగించేవారితో బాధల్లో తోడుగా ఉండేవారితో, సాయం చేసేవారితో సన్నిహిత సంబంధాలు కలిగుండాలి. కుటుంబసభ్యులు, నమ్మకమైన స్నేహితులు, ఇరుగుపొరుగుతో మనసును బాధిస్తున్న విషయాలను చెప్పుకోవడం వల్ల మనసు తేలికపడి ఒత్తిడి దరిజేరదని వివరిస్తున్నారు.
- ఇంకా ఒత్తిడి నుంచి బయటపడటం లేదని గుర్తిస్తే నిపుణుల సాయం తీసుకోవాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
నడుస్తుంటే తల తిరుగుతుందా? గుండెపై ఒత్తిడి పెరుగుతుందా? ఇలా చేయాలట!
డ్రై ఫ్రూట్స్ నానబెట్టాలా? పచ్చిగా తినాలా? ఎలా తీసుకుంటే మంచిది?