Coffee for Non Alcoholic Fatty Liver Disease: మానవ శరీరంలోని అతి ముఖ్యమైన అవయవాల్లో కాలేయం(Liver) కూడా ఒకటి. ఇది మన శరీరంలో అనేక ముఖ్యమైన విధులను నిర్వర్తిస్తుంది. శరీరానికి కావాల్సిన హార్మోన్లను ఉత్పత్తి చేయడం సహా.. దేహంలోని మలినాలను బయటకు పంపేందుకు సహకరిస్తుంది. ఇన్ని విధులను నిర్వర్తిస్తున్న కాలేయం దెబ్బతింటే మన శరీరం తీవ్ర అనారోగ్యానికి గురవుతుంది. కాబట్టి కాలేయానికి హాని కలిగించే ఆహారాన్ని తీసుకోవడం నియంత్రించుకోవాలి.
అయితే.. మారిన జీవన విధానం, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవడం వంటి కారణంగా మనలో చాలా మంది ఫ్యాటీ లివర్ సమస్యతో ఇబ్బందిపడుతున్నారు. ఇందులో.. ఆల్కహాలిక్, నాన్-ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ అంటూ రెండు రకాలు ఉన్నాయి. అయితే.. నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్‌తో భాదపడేవారికి కాఫీ ఉపశమనం కలిగిస్తుందని పలువురు నిపుణులు, పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
2016లో హెపటాలజీ జర్నల్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. రోజుకు రెండు నుంచి మూడు కప్పుల కాఫీ తాగే వ్యక్తులకు నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్(NAFLD) వచ్చే ప్రమాదం 22 శాతం తక్కువగా ఉందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఇటలీలోని మిలాన్‌లోని హెపటాలజీ యూనివర్సిటీ ఆఫ్ మిలాన్‌లోని అసోసియేట్ ప్రొఫెసర్ గియాన్‌ఫ్రాంకో రెవెల్లి పాల్గొన్నారు. కాఫీ తాగడం వల్ల NAFLD సమస్య తగ్గడంతోపాటు కాలేయ పనితీరు కూడా మెరుగుపడుతుందని ఆయన తెలిపారు. అయితే.. కాఫీ మేలు చేసేదే అయినా మితంగా తాగడం మంచిదని చెబుతున్నారు. రోజుకు 2 నుంచి 3 కప్పుల కాఫీ మాత్రమే తీసుకోవాలని సూచిస్తున్నారు.
కాఫీలో.. క్లోరోజెనిక్ యాసిడ్‌తోపాటు పాలీఫినాల్స్, కెఫిన్, మిథైల్క్సాంథైన్, లిపిడ్లు, పొటాషియం, మెగ్నీషియం వంటి పోషకాలు దండిగా ఉన్నాయని చెబుతున్నారు. కాలేయంలో చేరిన కొవ్వును తొలగించడంలో కాఫీ ఎంతో సహాపడుతుందని చెబుతున్నారు.
కాలేయ సమస్యలతో బాధపడే వారు కాఫీతో పాటు సమతుల ఆహారాన్ని తీసుకోవాలని సూచిస్తున్నారు. కాలేయ ఆరోగ్యాన్ని కాపాడడంలో వెల్లుల్లి ఎంతగానో సహాయపడుతుందట. కాలేయాన్ని సంరక్షించే ఎంజైమ్‌లు వెల్లుల్లిలో ఎక్కువగా ఉంటాయి. దీంతో పాటు పచ్చి కూరగాయాలు, ఆకుకూరలను ఎక్కువగా తీసుకోవడం మంచిదని చెబుతున్నారు. ఇవి కాలేయ ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేస్తాయని నిపుణులు అంటున్నారు. అలాగే విటమిన్ - సి అధికంగా ఉండే సిట్రస్ జాతి పండ్లును తినాలని.. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయని సూచిస్తున్నారు. ఈ విధంగా తగిన సమతుల ఆహారాలను తీసుకుంటే.. కాలేయాన్ని కొవ్వు బారి నుంచి రక్షించుకోవచ్చని చెబుతున్నారు.
ఈ ఫుడ్స్ తింటున్నారా? - అయితే మీకు బీపీ గ్యారెంటీ! - Worst Foods For Blood Pressure