Signs Of Testicular Cancer : క్యాన్సర్ చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఇందులో అత్యంత డేంజరస్ క్యాన్సర్లలో వృషణాల క్యాన్సర్ (టెస్టిక్యులర్ క్యాన్సర్) ఒకటి. పురుషుల ప్రాణాలు బలిగొనే ఈ క్యాన్సర్ ను ముందుగా గుర్తించి చికిత్స తీసుకుంటేనే ప్రాణాపాయం తప్పుతుందని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఈ టెస్టిక్యులర్ క్యాన్సర్ లక్షణాలు ఎలా ఉంటాయి? అన్నది ఇప్పుడు చూద్దాం.
పురుషుల వృషణ తిత్తిలో అండాకారంలో రెండు వృషణాలుంటాయి. వీటిని వైద్య పరిబాషలో 'టెస్టికల్స్' అని అంటారు. ఈ వృషణాలు వీర్య కణాలను ఉత్పత్తి చేస్తాయి. అలాగే టెస్టోస్టిరాన్ అనే హార్మోన్‌ను కూడా తయారు చేస్తాయి. వీటిల్లోని కణాలు అసాధారణంగా పెరిగిపోవడం వల్ల టెస్టిక్యులర్ క్యాన్సర్ వస్తుందని నిపుణులు చెబుతున్నారు.
ఈ క్యాన్సర్ ఎందుకు వస్తుంది?
వంశపారంపర్యంగా టెస్టిక్యులర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులంటున్నారు. అలాగే పుట్టుకతోనే వృషణాల్లో లోపం ఉన్నవారు కూడా ఈ క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.
అలర్ట్: ఈ ఫుడ్స్ తింటున్నారా? మీ కోపం ఓ రేంజ్లో పెరగడం ఖాయం! - Anger Increasing Foods
లక్షణాలు ఎలా ఉంటాయి?
- వృషణాల్లో గడ్డలాగా ఉంటుంది. ఇలా ఉంటే దాదాపు వృషణాల క్యాన్సర్ ఉన్నట్లు భావించాలి. వైద్యులు అల్ట్రాసౌండ్ పరీక్ష చేసి ఈ వ్యాధిని నిర్ధారిస్తారు.
- టెస్టికల్‌లో ఏదో ముద్ద ఉన్నట్లు ఉంటుంది. కానీ, నొప్పి ఉండదు! అయితే, కొంతమందిలో నొప్పి, వాపు రెండూ ఉంటాయి.
- వృషణం ఒక దానికంటే ఒకటి పెద్దగా లేదా చిన్నగా కనిపించవచ్చు.
- వెన్ను నొప్పి ఇబ్బంది పెడుతుంది. 2018లో "యూరోపియన్ జర్నల్ ఆఫ్ అరోలోజీ" జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. వృషణ క్యాన్సర్ ఉన్న పురుషులలో వెన్నునొప్పి సమస్య ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో ఇటలీలోని యూనివర్సిటీ ఆఫ్ పిసాలో యూరాలజీ విభాగానికి చెందిన డాక్టర్ అలెస్సాండ్రో పెల్లిజెట్టి పాల్గొన్నారు. వృషణాల క్యాన్సర్‌తో బాధపడేవారిలో వెన్నునొప్పి సమస్య వేధిస్తుందని ఆయన పేర్కొన్నారు.
- కాళ్లలో నొప్పి లేదా వాపు రావడం
- అలసటగా ఉండటం
- పొత్తికడుపులో నొప్పి
- ఆకలి లేకపోవడం
- బరువు తగ్గడం వంటి వివిధ లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు పేర్కొన్నారు.
- అయితే.. వయసుతో సంబంధం లేకుండా ఈ లక్షణాలు కనిపించిన వారు నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించి పరీక్షలు చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
డైలీ ఒక అరటి పండు తినాలంటున్న నిపుణులు - ఎందుకో తెలుసా? - Benefits Of Eating Banana