Side Effects Of Nail Polish : చాలా మంది అమ్మాయిలు చేతి గోళ్లు అందంగా కనిపించడానికి వివిధ రకాల నెయిల్ పాలిష్‌లను అప్లై చేసుకుంటారు. ఏదైనా పెళ్లిల్లు, ఫంక్షన్ల వంటి వాటికి వెళ్తే తప్పకుండా డ్రెస్‌కు మ్యాచింగ్ ఉండేలా నెయిల్ పాలిష్‌ను వేసుకుంటుంటారు. అయితే, తరచుగా వివిధ రకాల నెయిల్ పాలిష్‌ను వేసుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కొన్నిసార్లు చర్మ క్యాన్సర్ కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. మీరు కూడా ఎక్కువగా నెయిల్ పాలిష్‌ను వేసుకుంటున్నారా ? అయితే, ఈ స్టోరీ తప్పక చదవండి!
ఇన్ఫెక్షన్లకు దారితీస్తుంది :
నెయిల్ పాలిష్ తయారు చేయడానికి చాలా రకాల రసాయనాలను ఉపయోగిస్తారు. వీటివల్ల గోళ్ల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. అయితే గోరు పగుళ్లు ఏర్పడినప్పుడు, బ్యాక్టీరియా మన శరీరంలోకి చేరి ఇన్ఫెక్షన్లకు దారితీస్తుందని అంటున్నారు.
జెల్ నెయిల్ పాలిష్‌తో ప్రమాదమే!
కొంతమంది గోళ్లు మరింత అందంగా కనిపించడానికి జెల్ నెయిల్ పాలిష్‌లను ఉపయోగిస్తుంటారు. అయితే, జెల్ నెయిల్ పాలిష్‌పై ప్రసరించిన కాంతి యూవీ కిరణాలుగా మారుతుందట. దీనివల్ల చర్మక్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. అలాగే అకాల వృద్ధాప్య ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు పేర్కొన్నారు. అందుకే జెల్ పాలిష్ వేసుకునే ముందు వేళ్లపై సన్‌స్క్రీన్ లోషన్ అప్లై చేయడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.
మీ ముఖం ముద్ద మందారంలా మెరిసిపోవాలంటే - రాత్రి వేళ ఇలా చేయండి! - How to Cleanse Face Every Night
తక్కువ కెమికల్స్ ఉన్నవి అప్లై చేసుకోండి!
రోజూ నెయిల్ పాలిష్ వేసుకునే అలవాటు ఉన్న వారు వీలైనంత వరకు దీనిని తగ్గించుకుంటే మంచిది. ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రేమ నెయిల్ పాలిష్ వేసుకోండి. అలాగే మార్కెట్లో నెయిల్ పాలిష్‌ను కొనుగోలు చేసేటప్పుడు తక్కువ కెమికల్స్ ఉపయోగించి తయారు చేసే నెయిల్ పాలిష్‌లను ఎంపిక చేసుకోండి.
పాలిష్ రిమూవర్‌ను అతిగా వాడకండి!
నెయిల్ పాలిష్ వేసుకున్నప్పుడల్లా దాన్ని తొలగించడానికి పాలిష్ రిమూవర్‌ని ఉపయోగించకూడదు. ఎందుకంటే రిమూవర్‌లో గోళ్లను పొడిబారేలా చేసే రసాయనం ఉంటుంది. కాబట్టి, నెలకు రెండుసార్లకు మించి రిమూవర్ వాడకుండా ఉండటం మంచిది. అలాగే నెయిల్ పాలిష్ వేసుకునేటప్పుడు ఒకే కోట్ కాకుండా, డబుల్ కోటింగ్ వేయడం వల్ల గోళ్లు త్వరగా విరిగిపోకుండా జాగ్రత్తపడచ్చని నిపుణులు చెబుతున్నారు.
- కొంత మందికి గోళ్లు కొరికే అలవాటు ఉంటుంది. అయితే నెయిల్ పాలిష్ ఉన్న వారు గోళ్లు కొరకడం వల్ల వివిధ రసాయనాలు కడుపులోకి చేరే అవకాశం ఉంది. కాబట్టి, ఈ అలవాటును వెంటనే మానుకోవాలి.
- దీర్ఘకాలికంగా నెయిల్ పాలిష్ వాడటం వల్ల గోళ్ల చుట్టూ చర్మం పొడిబారుతుంది. అలాగే అవి బలహీనంగా మారి పగలడం, చిట్లడం వంటి సమస్యలు రావచ్చని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్: షుగర్ పేషెంట్స్ పైనాపిల్ తినొచ్చా? - నిపుణుల సమాధానమిదే! - Pineapple for Sugar Patients