Side Effects Of Afternoon Sleep : చాలా మంది జనాలు మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత కొద్దిసేపు పడుకుంటారు. ఒక అరగంట నుంచి గంట సేపు పడుకోవడం వల్ల అలసట తగ్గుతుందని, మనసు ప్రశాంతంగా ఉంటుందని చెబుతుంటారు. అయితే.. మధ్యాహ్నం భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకోవడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలు వస్తాయని మీకు తెలుసా? అవును.. ఇలా తిన్న తర్వాత వెంటనే పడుకోవడం ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదని నిపుణులు చెబుతున్నారు. అయితే.. మధ్యాహ్నం తిన్న వెంటనే పడుకోవడం వల్ల ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి? ఎంత సేపు పడుకుంటే మంచిది ? అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.
జీర్ణ సమస్యలు :
తిన్న వెంటనే నిద్రపోతే జీర్ణక్రియపై ప్రభావం పడుతుందని నిపుణులంటున్నారు. దీనివల్ల గ్యాస్, అజీర్ణం వంటి జీర్ణసమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. 2017లో 'అలిమెంటరీ ఫార్మకాలజీ అండ్ థెరపిటిక్స్' జర్నల్లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. భోజనం చేసిన తర్వాత వెంటనే పడుకున్న వారిలో గ్యాస్, అజీర్ణం వంటి లక్షణాలు ఎక్కువగా ఉన్నాయని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాలోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ ఫీన్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో పనిచేసే డాక్టర్ డేవిడ్ జె. డంకన్ పాల్గొన్నారు. మధ్యాహ్న భోజనం తర్వాత వెంటనే పడుకోవడం వల్ల గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలు వస్తాయని ఆయన పేర్కొన్నారు.
గుండెల్లో మంట :
మధ్యాహ్న భోజనం తర్వాత వెంటనే పడుకోవడం వల్ల.. కడుపులోని ఆమ్లం ఛాతి వైపు పైకి ఎక్కి గుండెల్లో మంట వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే తిన్న తర్వాత కొద్దిసేపు నడవాలని సూచిస్తున్నారు.
రాత్రిపూట నిద్ర పట్టట్లేదా? పడుకునే ఈ నీటితో స్నానం చేస్తే అంతా సెట్! - Warm Water Shower For Sleep
గురక వస్తుంది :
భోజనం తర్వాత వెంటనే పడుకోవడం వల్ల శ్వాస నాళాలు కుచించుకుపోతాయి. దీని వల్ల గురక సమస్య వస్తుందట.
బరువు పెరుగుతారు :
తిన్న తర్వాత నడవకుండా.. వెంటనే పడుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అలాగే అధిక బరువుతో బాధపడుతున్న వారు ఇలా వెంటనే పడుకోకూడదని సూచిస్తున్నారు.
గుండె జబ్బులు :
తిన్న వెంటనే పడుకోవడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉందని కొన్ని పరిశోధనల్లో వెల్లడైంది. అందుకే తిన్న తర్వాత ఒక పది నిమిషాలు వాకింగ్ చేసి పడుకోవాలని సూచిస్తున్నారు.
మధ్యాహ్నం ఎంతసేపు పడుకోవాలి ?
మధ్యాహ్న సమయంలో ఎక్కువసేపు పడుకోవడం వల్ల రాత్రి తొందరగా నిద్రపట్టదు. దీనివల్ల నైట్ టైమ్ నిద్ర తగ్గిపోతుంది. అయితే, మనిషి ఆరోగ్యంగా ఉండటానికి మధ్యాహ్న భోజనం చేసిన తర్వాత కొద్ది సేపు నడిచి.. ఒక అరగంట నుంచి గంట సేపు పడుకుంటే మంచిదని నిపుణులు పేర్కొన్నారు. ఎక్కువసేపు నిద్రపోవడం మంచిది కాదని అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.