Chapati Vs Rice Which One is Better For Health : ఆరోగ్యంగా ఉండాలంటే.. తినే ఆహారం విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే.. బరువు పెరగడం మొదలు.. ఎన్నో రకాల అనారోగ్యాలు దాడిచేసే అవకాశం ఉంటుంది. ఈ క్రమంలోనే.. కొంతమంది బరువు పెరుగుతామనో లేదంటే మరో కారణం చేతనో అన్నం బదులుగా చపాతీలు తింటున్నారు. అన్నం కంటే గోధుమలతో చేసిన చపాతీ తినడం ఆరోగ్యానికి మంచిదని కూడా భావిస్తుంటారు. మరి.. నిజంగా చపాతీలు ఆరోగ్యానికి మేలు చేస్తాయా? అసలు అన్నం, చపాతీలలో(Roti) ఆరోగ్యానికి ఏది మంచిది? దీనిపై ఆరోగ్య నిపుణులు ఏమంటున్నారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సాధారణంగా.. చపాతీలతో పోల్చితే అన్నంలో పిండి పదార్థాలు అధిక మొత్తంలో ఉంటాయి. ఫలితంగా అన్నం తినడం వల్ల తొందరగా కడుపు నిండిన భావన కలుగుతుంది. అలాగే, చపాతీలతో పోల్చుకుంటే అన్నం చాలా వేగంగా జీర్ణమవుతుందని సూచిస్తున్నారు నిపుణులు. అదే.. చపాతీలు తినడం వల్ల ఎక్కువసేపు ఆకలి వేయకుండా ఉంటుందంటున్నారు. రైస్‌తో పోలిస్తే పొటాషియం, భాస్వరం వంటి ఖనిజాలు, ఫైబర్ చపాతీలలో ఎక్కువగా ఉండడమే అందుకు కారణమని చెబుతున్నారు.
కొందరికి ప్రాబ్లమ్..
అయితే.. చపాతీల్లోని గ్లూటెన్ కొంతమందికి సరిపడదని చెబుతున్నారు. దీనివల్ల సరిగ్గా అరగక జీర్ణ సంబంధిత సమస్యలు వస్తుంటాయని చెబుతున్నారు. అలాంటి వారు తృణ ధాన్యాలతో చేసిన రోటీలు తీసుకోవడం మంచిది అంటున్నారు. వాటిల్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుందని, ఆరోగ్యానికి చాలా మంచిదని సూచిస్తున్నారు.
వారికి చపాతీ బెటర్ ఆప్షన్ : అన్నంతో పోల్చుకుంటే చపాతీల్లో తక్కువ క్యాలరీలు ఉంటాయంటున్నారు నిపుణులు. కాబట్టి, తక్కువ క్యాలరీలు తీసుకోవాలనుకునే వారికి చపాతీ మంచి ఆప్షన్ అని సూచిస్తున్నారు. అలాగే, మధుమేహం ఉన్నవారికి అన్నం కంటే చపాతీలు ఎక్కువ మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. గోధమ పిండితో చేసిన రోటీల్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉంటాయి. ఫలితంగా.. ఇవి తిన్న వెంటనే రక్తంలో కలిసి పోకుండా బ్లడ్ షుగర్ స్థాయిలను స్థిరంగా ఉంచుతాయని చెబుతున్నారు.
2019లో "న్యూట్రిషన్, మెటబాలిజం ఎండ్ కార్డియోవాస్క్యులర్ డిసీజ్" జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. షుగర్ వ్యాధితో బాధపడేవారు అన్నం తినడం కంటే చపాతీలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయులు అదుపులో ఉంటాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన డాక్టర్ జి. శ్రీనివాస రావు పాల్గొన్నారు. డయాబెటిస్ ఉన్నవారికి అన్నం కంటే.. చపాతీలు తినడం ద్వారా బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంచుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
బరువు తగ్గడానికి రొట్టె తింటున్నారా?
ఇకపోతే.. అన్నం తినే వారు తక్కువ రైస్‌లో ఎక్కువ మొత్తంలో కూరలు కలుపుకోవడం మంచిది అంటున్నారు. అలా తినడం వల్ల విటమిన్లు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లతో కూడిన సమతుల ఆహారం అందుతుందని చెబుతున్నారు. అలాగే.. చపాతీలు తినలేని వారు, జీర్ణ సమస్యతో బాధపడుతున్న వారు తక్కువ పాలిష్ పట్టిన రైస్‌ను తక్కువ మోతాదులో తీసుకోవడం బెటర్ అని సూచిస్తున్నారు నిపుణులు.
ఏది ఆరోగ్యానికి మంచిదంటే?
చివరగా.. అన్నం, చపాతీలలో ఏది ఆరోగ్యానికి మంచిదంటే.. ఈ రెండింటిలో పోషక విలువలో పెద్దగా తేడా లేదని చెబుతున్నారు నిపుణులు. ఆరోగ్య పరంగా చూస్తే ఇవి రెండు సమాన కేలరీలు కలిగి ఉంటాయని చెబుతున్నారు. అయితే.. డయాబెటిస్ ఉన్న వారు, బరువు తగ్గాలనుకునేవారు చపాతీవైపు మొగ్గు చూపవచ్చని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
చపాతీలు మృదువుగా రావాలా? - పిండిలో ఇవి కలిపితే చాలు - భలే స్మూత్‌గా వస్తాయి!