Piles In Women Causes : పైల్స్.. ఇవి వచ్చినప్పుడు బాధితులు పడే బాధ అంతా ఇంతా కాదు. ముఖ్యంగా మల విసర్జన టైమ్‌లో రక్తం చుక్కలుగా పడటం.. మలద్వారం వద్ద నొప్పి, మంట తీవ్రంగా వేధిస్తాయి. ముళ్ల మీద కూర్చున్నట్టే అనిపిస్తూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తాయి. అయితే.. ఇది ప్రాణాలపైకి తీసుకొచ్చే సమస్య కాకపోయినా ప్రత్యక్ష నరకాన్ని చూపిస్తోంది. ఈ సమస్యను మగవారు మాత్రమే కాదు.. ఆడవారు ఎదుర్కొంటుంటారు. అయితే, మహిళల్లో పైల్స్(Piles) సమస్య ఎందుకొస్తుంది? అందుకు కారణాలేంటి? దీని నుంచి ఎలా బయటపడాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పైల్స్ ఎందుకొస్తాయంటే..?
మొలలు అనేవి ఉబ్బిన రక్తనాళాలు. ఏదైనా ఒత్తిడి పెరిగినప్పుడు, లేదా రక్తప్రసరణకు ఆటంకం కలిగినప్పుడు రక్తనాళాల్లో వాపు ఏర్పడవచ్చు. మలద్వారం వద్ద ఈ వాపు ఏర్పడినప్పుడు దాన్నే ‘పైల్స్’ అంటారని చెబుతున్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ చంద్రశేఖర్ పులి.
మహిళల్లో మొలలు రావడానికి కారణాలివే..!
- మహిళలలో ముఖ్యంగా పైల్స్ గర్భవతిగా ఉన్నప్పుడు మొదలై తర్వాత క్రమంగా పెరుగుతూ వస్తాయి. ఎందుకంటే.. ప్రెగ్నెన్నీ టైమ్‌లో పొట్టలో ఒత్తిడి ఎక్కువవడం వల్ల రక్తనాళాలపై స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది. ఆ కారణంగా మొలలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
- అలాగే మలబద్ధకం ఉన్నా.. మల విసర్జన సమయంలో ఎక్కువగా ఒత్తిడి ఉపయోగించినా, బరువు ఎక్కువగా ఉన్నా పైల్స్ రావడానికి కారణాలవుతాయంటున్నారు డాక్టర్ చంద్రశేఖర్.
- అదేవిధంగా ఎక్కువ సేపు ఒకేచోట కూర్చొని పనిచేయడం వల్ల మొలలు వస్తాయట. మానసిక ఒత్తిడి కూడా మహిళల్లో పైల్స్ రావడానికి కారణమవుతుందంటున్నారు.
- అలాగే.. వయసు పైబడిన వారిలో, టాయిలెట్లో ఎక్కువ సేపు కూర్చున్న కూడా ఇవి వచ్చే ఛాన్స్ ఉందంటున్నారు డాక్టర్ చంద్రశేఖర్ పులి.
- కాబట్టి.. పైల్స్ వచ్చాక ఇబ్బందిపడే కంటే అవి ప్రారంభ దశలో ఉన్నప్పుడే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిదంటున్నారు. అదేవిధంగా ముందుగా పైల్స్ వస్తున్నట్టు తెలుసుకుంటే సర్జరీ లేకుండా లేజర్ చికిత్సతో సరి చేయడానికి వీలుంది. తొందరగా నయం కావడానికీ అవకాశం ఉంటుందని సూచిస్తున్నారు.
టాయ్లెట్లో ఫోన్ వాడుతున్నారా? మీకు పైల్స్ వస్తాయ్!
ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే?
- పైల్స్ ప్రారంభ దశలో ఉన్నప్పుడు మహిళలు మలబద్ధకం తలెత్తకుండా ఉండడానికి నీరు ఎక్కువగా తాగడంతో పాటు కొన్ని ఆహార నియమాలు పాటించాలి.
- ముఖ్యంగా ఫైబర్, పీచు అధికంగా ఉండే ఆహార పదార్థాలు డైట్లో ఉండేలా చూసుకోవాలి. అదేవిధంగా పొట్టుతో ఉండే గింజధాన్యాలను ఆహరంలో భాగం చేసుకోవాలి.
- అలాగే వేడి చేసే పదార్థాలకు దూరంగా ఉండాలని, ముఖ్యంగా కారం, మసాలా, పచ్చళ్లు, ఊరగాయలు, వేపుళ్లు, దుంప కూరలు, కెఫెన్కు దూరంగా ఉండాలి.
- స్టూల్ సాఫ్ట్‌నర్స్ వాడడం, రక్తనాళాల్లో వాపు తగ్గడానికి ఆ భాగంలో ఆయింట్‌మెంట్స్ వాడడం.. వంటివి చేస్తే కొంత రిలీఫ్ కలుగుతుంది.
- అదేవిధంగా మల విసర్జనకు గట్టిగా ముక్కకూడదు. రోజుల తరబడి మలబద్దకం బాధిస్తే నిర్లక్ష్యం చేయొద్దు.
- ఏదేమైనా- సమస్య తీవ్రతను బట్టి అశ్రద్ధ చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించడం బెటర్. అలాగే సొంత వైద్యానికి కూడా దూరంగా ఉండాలని సూచిస్తున్నారు ప్రముఖ గ్యాస్ట్రో ఎంటరాలజిస్టు డాక్టర్ చంద్రశేఖర్ పులి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ డైట్‌ను కాస్త మార్చితే పైల్స్ నుంచి ఉపశమనం! ఏం చేయాలంటే?