Nutritional Deficiency Diseases: శరీరం ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలంటే పౌష్టికాహారం తప్పనిసరి. అందుకు సరైన జీవనశైలితో పాటు విటమిన్లు, ఖనిజాల వంటి పోషక విలువలతో కూడిన ఆహారం తీసుకోవడం ఎంతో ముఖ్యం. పోషకాలు లేని ఆహారం వల్ల అనేక వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా సమతుల ఆహార లోపంతో అనారోగ్యానికి గురై మరణాలు సంభవించిన సంఘటనలు అనేకం ఉన్నాయంటున్నారు. కాబట్టి వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని పోషకాలు కలిగిన ఆహారం తీసుకోవడం ముఖ్యమని సూచిస్తున్నారు. మరి ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి డైట్ తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.
జుట్టు రాలడం: ఐరన్, జింక్, లినోలెయిక్ యాసిడ్, విటమిన్ బి3 లోపం వల్ల జుట్టు రాలుతుందని(National Library of Medicine రిపోర్ట్) వైద్యులు చెబుతున్నారు. ముఖ్యంగా ఐరన్ లోపం వల్ల హిమోగ్లోబిన్ ఉత్పత్తిపై ప్రభావం పడి.. ఫలితంగా ఆక్సిజన్ అందక జుట్టు రాలుతుందని వివరిస్తున్నారు. ఈ సమస్య పరిష్కారానికి ఆకుకూరలు, బీన్స్ లాంటి ఐరన్ ఎక్కువ ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.
రేచీకటి: విటమిన్ ఎ లోపం వల్ల రాత్రి పూట చూపు మందగించి రేచీకటి వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. దీంతో పాటు బిటాట్ స్పాట్స్ పెరిగి.. కళ్లపైన తెలుపు వచ్చే ఛాన్స్ ఉందని వైద్యులు చెబుతున్నారు. అదే కాకుండా రోగ నిరోధక శక్తి పెరుగుదలతో పాటు మెరుగైన కంటిచూపు, చర్మం ఉండేలా విటమిన్ ఏ సహాయ పడుతుందని అంటున్నారు. విటమిన్ ఏ కోసం పాల ఉత్పత్తులు, క్యారెట్, బంగాళదుంపలు, నారింజ పండ్లు తినాలని సూచిస్తున్నారు.
2020లో Journal of Clinical and Experimental Ophthalmologyలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం విటమిన్ ఎ లోపిస్తే రేచీకటి సమస్య ఎదురవుతుందని.. రెటీనా రోడాప్సిన్‌ను పునరుత్పత్తి చేయలేకపోవడమే దీనికి కారణమని కనుగొన్నారు. ఈ పరిశోధనలో AIIMSలోని ఆప్తమాలజీ డిపార్ట్మెంట్లో ప్రొఫెసర్ డాక్టర్ సంజయ్ కుమార్ షా పాల్గొన్నారు.
నోటి పూత: విటమిన్ బి2, ఐరన్ లోపం వల్ల నోటి పూత వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. ఇందుకోసం పాలు, మాంసం, చేపలు, తృణధాన్యాలను అధికంగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
చిగుళ్ల నుంచి రక్తం: విటమిన్ సి లోపించడం వల్ల రోగనిరోధక శక్తి తగ్గుతుందని, చిగుళ్ల నుంచి రక్తస్రావం జరుగుతుందని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య రాకుండా ఉండేందుకు స్ట్రాబెర్రీ, బ్రోకలీ, సిట్రస్ జాతి పండ్లు తీసుకోవాలని సూచిస్తున్నారు.
రెస్ట్‌లెస్ లెగ్ సిండ్రోమ్: రెస్ట్ లెస్ సిండ్రోమ్ అనే వ్యాధి రావడానికి విటమిన్లు, ఖనిజాల లోపం కారణమని వైద్యులు చెబుతున్నారు. అయితే, దీనికి స్పష్టమైన కారణం లేనప్పటికీ మెగ్నిషియం, ఐరన్ లోపం వల్లే ఇలా జరుగుతుందని వివరిస్తున్నారు. గింజలు, తృణధాన్యాలతో పాటు ఐరన్ అధికంగా ఉండే చికెన్ లాంటి బలవర్థక ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.
కాళ్లు, చేతులు తిమ్మిర్లు: చేతులు, కాళ్లలో తిమ్మిర్లు రావడానికి విటమిన్ బి12 లోపమే కారణమని డాక్టర్లు చెబుతున్నారు. డీఎన్ఏ ఉత్పత్తికి, నరాల వ్యవస్థ సక్రమంగా పనిచేయడానికి విటమిన్ బి 12 ఎంతో సహాయపడుతుందట. మాంసం, చేపలు, పౌల్ట్రీ, డెయిరీ ఉత్పత్తులను ఆహారంలో చేర్చుకోవడం వల్ల విటమిన్ బి12 లోపం నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు.
బలహీనత, అలసట: బలహీనత, నిరంతర అలసట అనేవి ఐరన్, విటమిన్ డి, విటమిన్ బి12 లోపాలకు సంకేతమని వైద్యులు చెబుతున్నారు. ఈ సమస్య నుంచి బయటపడేందుకు గుడ్లు, మాంసం, డెయిరీ ఉత్పత్తులు, చేపలను డైట్లో చేర్చుకోవాలని సూచిస్తున్నారు.
బలహీనమైన గోర్లు, జుట్టు: పోషకాహార లోపం వల్ల జుట్టు, గోళ్లు బలహీనంగా మారుతాయని వైద్యులు చెబుతున్నారు. బయోటిన్గా పిలిచే విటమిన్ బి7 లోపం వల్ల ఇలా జరుగుతుందని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించేందుకు ఆకుకూరలు, గుడ్లు, ధాన్యాలు అధికంగా తీసుకోవాలని సూచిస్తున్నారు.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.