Nasal Polyps Symptoms And Treatment : జలుబు చేసినపుడు ముక్కు బిగుసుకొని పోయినట్లు అనిపిస్తుండటం. కొన్ని సార్లు జలుబు లేకపోయినా ముక్కులో శ్వాసకు అడ్డు ఉన్నట్లుగా ఉండటం. శ్వాస తీసుకోవడం కష్టంగా మారటం లాంటి సమస్యలకు ముక్కులో కండ పెరగడమే అంటున్నారు ప్రముఖ వైద్యులు, ఈఎన్‌టీ సర్జన్ జానకి రామిరెడ్డి. ముక్కులో ద్రాక్ష గుత్తుల్లా కండ పెరిగిపోయి శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయంటున్నారు. వీటిని నాసల్ పాలిప్స్ అంటారని ఆయన చెబుతున్నారు. ముక్కులో కండ పెరగడానికి కారణాలు, పరిష్కార మార్గాలను గురించి జానకి రామిరెడ్డి గారు ఏం చెప్పారో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కండలు ఎందుకు పెరుగుతాయి! : ఫంగల్, వైరల్, బ్యాక్టీరియా ఇన్‌ఫెక్షన్ లాంటివి సోకినప్పుడు ముక్కులోపలి పొర వాపు వస్తుంది. తద్వారా పాలిప్స్ ఏర్పడుతాయి. ఎక్కువ కాలం జలుబుతో ఇంది పడుతున్నప్పుడు ఇలాంటి సమస్యలు వస్తాయంటున్నారు జానకి రామిరెడ్డి. ఆస్తమా, హైఫీవర్ ఉన్నా ముక్కులో కండలు పెరుగే అవకాశాలు ఉన్నాయంటున్నారు.
ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయి : ముక్కులో గడ్డలు రావడం వల్ల ఎక్కువగా తుమ్ములు రావడం, వాసన పసిగట్టే సామర్థ్యం తగ్గిపోవడం, ముక్కులో దురదగా ఉండటం, మంటగా ఉంటం, ముఖం లేదా నుదురు భాగంలో నొప్పి, కళ్లలో దురద, తలనొప్పి లాంటి లక్షాణాలు కనిపిస్తాయని డాక్టర్ జానకి రామిరెడ్డి తెలిపారు.
నోటిద్వారా శ్వాస : ముక్కు కారడం, ముక్కు మూసుకుపోవడం ద్వారా శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బంది కలగుతుంది. అందుకే చాలా మంది నోటిద్వారా శ్వాస తీసుకోవడానికి ప్రయత్నిస్తుంటారు. ఈ సమస్య వల్ల రాత్రిళ్లు నిద్రలో కొంత సమయం ఊపిరి ఆడకపోవడం వల్ల నిద్రసరిగా పట్టకపోవడం స్పష్టంగా తెలుస్తోందని చెబుతున్నారు. ఇలాంటి సమస్యలు గమనిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఎప్పుడు చికిత్స అవసరం : ''పాలిప్స్ వ్యాధితో ముక్కులో కండ పెరుగుతుంది. కొన్ని రకాల కణతులు కూడా ముక్కులో తయారవుతాయి. గ్రేడ్-4 పాలిప్స్ వస్తే మాత్రం శస్త్రచికిత్స చేయించుకోవాలి. గ్రేడు 2,3 పాలిప్స్ వస్తే మందులతో తగ్గించడానికి వీలుంది. కొన్నిసార్లు ఆపరేషన్ కూడా అవసరం రావొచ్చు. 2-3 శాతం రోగుల్లో మాత్రమే పాలిప్స్ మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ప్రతీ సీజన్లలోనూ అలర్జీలు ఉన్నపుడే పాలిప్స్ రావడానికి ఎక్కవగా అవకాశం ఉంటుంది. పాలిప్స్‌ను సైనస్ సర్జరీతో చిన్న ముక్కలు చేసి తొలగించవచ్చు. గాలి ఆడేలా కండలను తొలగిస్తారు. ఆ తర్వాత కొన్ని చిన్నచిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఇబ్బందులను అధిగమించే అవకాశం ఉంటుంది. మాస్కులను తప్పనిసరిగా వాడాలి. నిర్లక్ష్యం చేస్తే ముక్కులో కండ మళ్లీ మళ్లీ వచ్చే ప్రమాదం ఉంది.'' అని ఈఎన్‌టీ సర్జన్ జానకి రామిరెడ్డి ఈటీవీ భారత్‌తో తెలిపారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మనుకా తేనెతో రొమ్ముక్యాన్సర్ చికిత్స- ఎలాంటి ఫలితాలు వచ్చాయంటే..! - Manuka Honey Health Benefits