Mouth Bad Smell Spice Remedy : నోటి దుర్వాసన సమస్యతో బాధపడేవారు ఎవరికీ చెప్పుకోలేక తమలో తామే మదనపడుతూ ఉంటారు. నోటి నుంచి వచ్చే దుర్వాసనను హాలిటోసిస్ అని కూడా అంటారు. దీన్ని తగ్గించుకోవడానికి కొందరు ఆస్పత్రుల చుట్టూ తిరుగుతుంటారు. కానీ మన ఇంట్లో ఉండే ఓ చిన్న మసాలా దినుసుతో ఈ సమస్యకు పరిష్కారం చూపవచ్చు. ఆ దినుసే లవంగం. దీన్ని తీసుకోవడం వల్ల దుర్వాసనతో పాటు దంత సంబంధ ఇతర సమస్యలకు కూడా చెక్ పెట్టొచ్చు.
లవంగం సాధారణంగా భారతీయ గృహాల్లో ఎప్పుడూ ఉండే మసాలా దినుసు. వంటల్లో దీన్ని విరివిగా ఉపయోగిస్తారు. ఇందులో చాలా ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ఇది నోటి దుర్వాసన, పంటి నొప్పికి విరుగుడుగా పనిచేస్తుంది. అంతేకాదు ఆల్కహాల్ తాగాలన్న కోరికను అదుపు చేస్తుంది. లవంగంతో తయారు చేసే నూనెల్లో అపారమైన ప్రయోజనాలున్నాయని ఇటు వైద్యపరంగా, అటు శాస్త్రీయంగా గుర్తించారు.
లవంగాలను దశాబ్దాలుగా వివిధ రకాల మందులు, పోషకాహారంలో ఉపయోగిస్తున్నారు. ఇది సహజ మత్తుమందుగానూ పనిచేస్తుంది. ఇందులోని యూజీనాల్ అనే సహజ సమ్మేళనం యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటుంది. అది నోటి దుర్వాసనకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడుతుంది.
వాడేటప్పుడు జాగ్రత్త!
"లవంగాన్ని నమలడం లేదా మౌత్ వాష్‌లో లవంగం నూనెను ఉపయోగించడం వల్ల తాజా శ్వాసను పొంది, దుర్వాసన కలిగించే బ్యాక్టీరియాను నాశనం చేయవచ్చు. పైగా ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాల కారణంగా పంటి నొప్పులు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. లవంగం నూనెను నేరుగా ప్రభావిత ప్రాంతంలో రాయటం వల్ల చిగుళ్లు, దంతాల్లో ఉన్న నొప్పి, వాపు తగ్గుతుంది. అయినప్పటికీ, లవంగాన్ని అధిక మోతాదులో ఉపయోగించినప్పుడు చర్మం, శ్లేష్మ పొరలకు చికాకు కలిగించవచ్చు కాబట్టి జాగ్రత్తగా వాడాలి" అని డాక్టర్ ఎలీన్ కాండీ తెలిపారు. ఈమె సర్ హెచ్ఎన్ రిలయన్స్ ఫౌండేషన్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ సెంటర్లో న్యూట్రిషన్, డయాబెటిక్స్ విభాగాధిపతిగా పనిచేస్తున్నారు.
- నొప్పి ఉపశమనం: ఇది అనాల్జేసిక్ (నొప్పి నివారిణి) లక్షణాలను కలిగి ఉన్నట్లు తేలింది.
- యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్స్ : ఇది శరీరంలో వాపును తగ్గించడంలో సహాయపడుతుంది.
- యాంటీఆక్సిడెంట్ రియాక్షన్ : ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే ఆక్సీకరణ నష్టం నుంచి శరీరాన్ని రక్షించడంలో తోడ్పడుతుంది.
- యాంటీమైక్రోబయల్ యాక్టివిటీ: ఇది బ్యాక్టీరియా, వైరస్లు, శిలీంధ్రాల పెరుగుదలను చంపడం లేదా నిరోధిస్తుంది.
- జీర్ణక్రియ : ఇది జీర్ణక్రియను మెరుగుపర్చుతుందని తేలింది. వికారం, వాంతుల లక్షణాలను తగ్గించడంలో దోహదం చేస్తుంది.
చక్కెర, ఆల్కహాల్, సిగరెట్ తాగాలనే కోరికలు తగ్గడానికి లవంగం సాయపడుతుంది. దీనికి శాస్త్రీయ ఆధారాలు ఉన్నాయి. ఒక లవంగాన్ని నమలడం లేదా మసాజ్‌లో కొద్ది మొత్తంలో లవంగం నూనెను ఉపయోగించడం వల్ల ఆ కోరికలను తగ్గించుకోవచ్చు. కాకపోతే లవంగాన్ని మితంగా తీసుకోవాలి. ఇందులోని యూజెనాల్ అధిక స్థాయిలో వినియోగించడం వల్ల విషపూరితం అయ్యే ఛాన్సుంది. అలాగే లవంగం తిన్న తర్వాత దద్దుర్లు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా వాపు వంటి లక్షణాలను కనిపిస్తే వెంటనే వైద్యుల్ని సంప్రదించాలి.