Microplastics Found In Salt And Sugar Brands : ప్రస్తుత రోజుల్లో ప్రజల ఆరోగ్యం కన్నా వ్యాపారం గురించి ఆలోచించే వాళ్లే ఎక్కువ. లాభాల కోసం అన్ని ఆహర పదార్థాల్లోనూ రకరకాల హానికరమైన పదార్థాలను కలిపి తయారు చేస్తున్నారు. చాల మందికి తెలియని విషయం ఏంటంటే బియ్యం, పప్పులు, నూనెలు, చక్కెరలు అన్నీ కల్తీయే!. చక్కెరలో కల్తీ చేస్తున్నారని చాలాసార్లు వింటూనే ఉన్నాం. ఇండియాలోని చాలా మేజర్ బ్రాండ్ల విషయాల్లో ఇది బయటపడింది కూడా. కానీ ఇది ఇప్పుడు ఉప్పు వరకూ చేరుకుందంటే మీరు నమ్ముతారా?
మన కంటికి కనపడని మైక్రో ప్లాస్టిక్స్‌ను మనమే కొనుగోలు చేసి వంటగదిలో దాచుకుంటున్నాం. అన్ని ఆహార పదార్థాల్లోనూ వేసుకుని తింటున్నాం. చిన్నవే కదా అని లైట్ తీసుకుంటే కొద్దికొద్దిగా శరీరంలో తిష్టవేస్తాయి. అలా పేరుకుపోయిన మైక్రో ప్లాస్టిక్స్ దీర్ఘకాలికంగా ప్రమాదకరంగా మారతాయి. ఇవి మానవ శరీరంతో పాటు వాతావరణాన్ని కూడా కలుషితం చేస్తాయి. వాస్తవానికి ఉప్పు, పంచదారతో పాటుగా ఇవి పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, క్లీనింగ్ ఏజెంట్లలో కూడా కనిపించాయని స్టడీలో స్పష్టమైంది.
'మైక్రోప్లాస్టిక్స్ ఇన్ సాల్ట్ అండ్ షుగర్' అనే పేరిట జరిగిన స్టడీలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. ఇండియాలో అమ్ముడయ్యే ఉప్పు, చక్కెరల్లో ఇవి ఉన్నాయట. టాప్ బ్రాండ్లలో కూడా కొన్నింటిలో ఇవి కనిపించాయని స్టడీ వెల్లడించింది. కళ్లు ఉప్పు, మెత్తని ఉప్పు, సముద్రపు ఉప్పు, రాతి ఉప్పు ఇలా అన్నింటిలోనూ మైక్రోప్లాస్టిక్స్ కనిపించాయి. కేవలం ఉప్పులో మాత్రమే కాదు చక్కెరలోనూ ఇదే సమస్య. ఆన్ లైన్, లోకల్ మార్కెట్లలో ఎక్కడైనా ఇదే కల్తీ కనిపించిందట. అవి ఫైబర్స్, పెల్లెట్స్, ఫ్రాగ్మెంట్స్లలో ఏదో ఒక రూపంలో కలిసి ఉంటున్నాయట. సైజులో 0.1మిల్లీ మీటర్ నుంచి 5మిల్లీ మీటర్ వరకూ ఉండే వీటిని కంటితో చూసి కనిపెట్టడం చాలా కష్టం.
మైక్రో ప్లాస్టిక్ వల్ల కలిగే దుష్ఫలితాలు:
హార్మోన్లపై దుష్ప్రభావం : ఈ మైక్రోప్లాస్టిక్‌లు శరీరంలో ఈస్ట్రోజన్ లేదా టెస్టోస్టిరాన్ మాదిరిగా పనిచేస్తాయి. ఫలితంగా సహజమైన విధులైన పునరుత్పత్తికి ఆటంకం కలిగించి సంతానలేమికి దారి తీస్తాయి.
క్రోనిక్ జబ్బులు : వీటిని ఎక్కువ కాలం తీసుకోవడం వల్ల టైప్ 2 డయాబెటిస్, గుండె జబ్బులు వచ్చే ప్రమాదముంది. మైక్రోప్లాస్టిక్స్ నుంచి వెలువడే కెమికల్స్ అయిన డయాక్సిన్లు, ప్లాలేట్స్ శరీరానికి వేడి కలిగిస్తాయి. ఇన్సులిన్ ఉత్పత్తిని ఆకట్టుకుని, ఒబెసిటీకి కారణమవుతాయి. అలా పలు ప్రమాదకరమైన జబ్బులకు దారితీస్తాయి.
రోగ నిరోధక శక్తి నాశనం : పేగులకు సమస్యను తెచ్చిపెడతాయి ఈ మైక్రోప్లాస్టిక్స్. శరీరంలో చెడు బ్యాక్టీరియాను పెంచి ఇమ్యూనిటీని బలహీనపరుస్తాయి. పేగులలో ఉండే ఆరోగ్యకరమైన రోగ నిరోధక కణాలను తొలగించి మనిషి ఆరోగ్యాన్ని ప్రమాదంలోకి నెట్టేస్తాయి.
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.