Cooking Tips to Get Rid of Pollution in Kitchen : మనం వంటగదిలో ఆహార పదార్థాలను వండేటప్పుడు కొన్ని రకాల వాయువులు, పొగ వెలువడడం చూస్తుంటాం. అవి కొన్నిసార్లు ఇల్లంతా అలుముకొని ఊపిరి పీల్చుకోవడానికి కూడా ఇబ్బందికరంగా మారుతుంటాయి. నిజానికి ప్రస్తుతం చాలా మంది ఈ పొగ, వాయువుల్ని బయటకు పంపించడానికి కిచెన్ చిమ్మీలు, ఎగ్జాస్ట్ ఫ్యాన్స్.. వంటివి కిచెన్లలో ఏర్పాటు చేసుకుంటుంటారు. అయితే, ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలున్నప్పటికీ వీటివల్ల పర్యావరణం కలుషితమవడంతో పాటు మన ఆరోగ్యానికీ ప్రమాదం పొంచి ఉందంటున్నారు నిపుణులు.
అయితే, వంట చేసే క్రమంలో చిన్న చిన్న జాగ్రత్తలు, టిప్స్ పాటించడం ద్వారా ఇలా జరగకుండా చూసుకోవచ్చంటున్నారు. తద్వారా ఇటు వంటగదిలో(Kitchen) కాలుష్యం తగ్గించడంతో పాటు, అటు వాతావరణం పైనా ప్రతికూల ప్రభావం పడకుండా జాగ్రత్త పడొచ్చంటున్నారు. మరోవైపు.. గ్యాస్/శక్తి వృథానూ తగ్గించుకోవచ్చని సూచిస్తున్నారు. ఇంతకీ, ఆ కుకింగ్ టిప్స్ ఏంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
గిన్నెలపై మూత పెట్టండి : కొంతమంది వంట చేసేటప్పుడు గిన్నెలపై మూత పెట్టరు. ఇంకొంతమంది పాత్రలపై ప్లేట్స్ పెట్టినా సగం వరకే ఉంచుతారు. ఇది కూడా వంట ఆలస్యమవడానికి, ఎక్కువ పొగ వెలువడడానికి కారణమవుతుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. మూత పెట్టకుండా వంటలు చేయడం వల్ల 20 శాతం అదనంగా ఇంధనం ఖర్చు అవుతుందని పలు అధ్యయనాల్లో తేలింది.
చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి : కొంతమంది ఓపిక లేకో, సమయం సరిపోకో.. కాయగూరల్ని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని వంట చేసుకుంటుంటారు. ఇది కూడా కిచెన్ వాతావరణం కలుషితమవడానికి ఓ కారణమే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. పెద్ద ముక్కలు ఉడకడానికి ఎక్కువ టైమ్ పడుతుంది. అలాగే.. గ్యాస్ కూడా వృథా! కాబట్టి.. అదే చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వండుకుంటే త్వరగా ఉడకడమే కాకుండా కాలుష్యం తగ్గుతుందంటున్నారు. అంతేకాదు.. కర్రీ టేస్టీగానూ ఉంటుంది. కావాలంటే.. ఓసారి ట్రై చేసి చూడమని నిపుణులు సూచిస్తున్నారు.
వంటగదిలో ఈ పొరపాట్లు చేస్తున్నారా? - పిల్లల అనారోగ్యానికి కారణం ఇవే కావొచ్చు!
పెద్ద పాత్రలు యూజ్ చేయడం : వంటచేసేటప్పుడు కొంతమంది స్టౌపై చిన్న సైజ్ గిన్నెలను యూజ్ చేస్తుంటారు. దీనివల్ల మంట వెలిగించినప్పుడు గ్యాస్.. గిన్నె అడుగు భాగం దాటి పక్కకు రావడం మీరు గమనించే ఉంటారు. ఇలా చిన్న పాత్రలను యూజ్ చేయడం కూడా కిచెన్‌లో కాలుష్యం పెరగడానికి, వంటగ్యాస్ వృథా అవడానికి ఓ కారణమంటున్నారు నిపుణులు. కాబట్టి.. అందుకు బదులుగా పెద్ద పాత్రలు యూజ్ చేయడం, చిన్న పాత్రల కోసం ఇండక్షన్ స్టౌ ఉండే దాన్ని వాడడం మంచి ప్రత్యామ్నాయ మార్గంగా చెప్పుకోవచ్చంటున్నారు. అలాగే కొందరు వండిన ఆహారాన్ని మాటిమాటికీ వేడి చేస్తుంటారు. ఇలా చేయడం ఆరోగ్యకరం కాకపోవడమే కాకుండా గ్యాస్ వృథా, పర్యావరణానికీ నష్టం కలిగిస్తుందంటున్నారు నిపుణులు.
తడిచెత్తను ఇలా చేయండి : వంటగదిలో పేరుకుపోయే తడి చెత్త కూడా వాతావరణ కాలుష్య కారకమే అంటున్నారు నిపుణులు. అయితే, ఈ వృథాతో పాటు కుళ్లిపోయిన కాయగూరలు/పండ్లు, వాడిన కాఫీ/టీ పొడి పిప్పి, కోడిగుడ్డు పెంకులు, టీబ్యాగ్స్.. వంటివన్నీ కలిపి కంపోస్ట్ ఎరువుగా మార్చితే.. అటు కాలుష్యమూ తగ్గుతుంది.. ఇటు దీన్ని ఇంట్లో పెంచుకునే మొక్కలకు ఎరువుగానూ ఉపయోగించవచ్చంటున్నారు.
క్లాత్ బ్యాగ్స్ ఉపయోగించడం : ఎవరి కిచెన్‌లో చూసినా ప్లాస్టిక్ డబ్బాలు, ప్లాస్టిక్ కవర్లే ఎక్కువగా కనిపిస్తుంటాయి. అలాగే.. చాలామంది నిత్యావసరాలు, కాయగూరలు తీసుకురావడానికీ ప్లాస్టిక్ సంచుల్నే యూజ్ చేస్తుంటారు. కానీ, వీటికి బదులుగా క్లాత్ బ్యాగ్స్ ఉపయోగించడం మంచిది అంటున్నారు. అలాగే.. నిత్యావసరాల్ని గాజు/స్టీల్/సిలికాన్‌తో తయారుచేసిన డబ్బాల్లో భద్రపరచుకోవడం.. వంటివీ కిచెన్‌లో కాలుష్యాన్ని తగ్గించుకునేందుకు చక్కటి ప్రత్యామ్నాయ మార్గాలుగా నిపుణులు సూచిస్తున్నారు.
ఈ టిప్స్ పాటిస్తే - స్టెయిన్లెస్ స్టీల్ గృహోపకరణాలకు మెరుపు గ్యారంటీ!