Is It Safe To Reuse Water Bottles : మానవ మనుగడకు ఆక్సిజన్ తర్వాత అంతటి ప్రధానమైనది నీరు. అందువల్ల ఆరోగ్యంగా ఉండటానికి రోజుకు 3-4 లీటర్ల నీటిని తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. అయితే మనం నీరు తాగటానికి వివిధ రకాల వాటర్ బాటిల్లను ఉపయోగిస్తుంటాం. అయితే పర్యావరణ పరిరక్షణ కోసం ఇటీవలి కాలంలో రీయూజబుల్ వాటర్ బాటిల్స్‌ను ఉపయోగించడం ఎక్కువైంది. కానీ వాటిని సరిగా శుభ్రపర్చకపోతే, అందులో బ్యాక్టీరియా వృద్ధి చెంది అనారోగ్యానికి కారణమవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
అధ్యయనం ఏం చెబుతోంది?
వాటర్ బాటిళ్లపై అమెరికాకు చెందిన వాటర్ ఫిల్టర్ గురు అనే సంస్థ చేసిన అధ్యయనంలో ఆశ్చర్య కరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. సరిగా శుభ్రం చేయని వాటర్ బాటిల్ అడుగు బాగంలో బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు వృద్ధి చెందుతున్నట్లుగా గుర్తించారు. ఇలాంటి బాటిళ్లను వాడితే రోగాల బారిన పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అందువల్ల వాటర్ బాటిళ్లను వాడే విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
వాటర్ బాటిల్స్‌లోకి బ్యాక్టీరియా ఎలా ప్రవేశిస్తుంది?
కలుషితమైన నీరు తాగటం వల్ల ఆరోగ్యానికి ఎంతో ప్రమాదం. మనం నీరు తాగటానికి ఉపయోగించే వాటర్ బాటిల్స్‌లో బ్యాక్టీరియాలు ఏర్పడే అవకాశం అధికంగా ఉంటుంది. ఎందుకంటే బాక్టీరియాలు నీరు నిల్వ ఉన్న చోటే అధికంగా ఏర్పడుతాయి. కానీ మనం తరచుగా వాటర్ బాటిల్స్‌ను శుభ్రపరచటంలో నిర్లక్ష్యం వహిస్తుంటాం. అంతే కాకుండా రకరకాల ప్రదేశాలలో తిరిగి సరిగ్గా చేతులు శుభ్రపరచుకోకుండానే వాటర్ బాటిళ్లతో నీరు తాగుతుంటాం. ఆ సమయంలో మన చేతిపై ఉన్న సూక్ష్మక్రిములు నీటి సీసాలపైకి వెళ్లే అవకాశముంటుంది. అయితే రిఫ్రిజిరేటర్లో ఉన్న వాటర్ బాటిల్స్‌లో బ్యాక్టీరియా చేరే ప్రమాదం కొంత తక్కువగా ఉంటుంది.
బాక్టీరియాల వల్ల కలిగే జబ్బులు
నీటి ద్వారా బాక్టీరియా శరీరంలోకి వెళ్లడం వల్ల డయేరియా, విరేచనాలు లాంటి అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. అంతే కాకుండా చర్మవ్యాధుల బారిన పడే ప్రమాదముంది. రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిలో ఈ ప్రమాదం మరింత అధికంగా ఉంటుంది. అందువల్ల వాటర్ బాటిళ్ల వాడకం విషయంలో కింద తెలిపిన జాగ్రత్తలు పాటిస్తే మంచిది.
ఈ జాగ్రత్తలు పాటిస్తే మేలు
- వాటర్ బాటిళ్లను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
- కనీసం వారానికి రెండు సార్లయినా శుభ్రపరుచుకోవాలి.
- వేడి నీళ్లతో వాటర్ బాటిళ్లను క్లీన్ చేసుకోవాలి.
- వేడి నీరు ఉపయోగిస్తే బాటిల్లోని చాలా వరకు సూక్ష్మజీవులు నశిస్తాయి.
- వాటర్ బాటిల్ బయట, లోపల శుభ్రంగా కడగండి
- బాటిల్ శుభ్రం చేశాక వాటిపై సూర్యరశ్మి పడేట్లుగా ఉంచండి.
- బాటిల్లో తేమ పూర్తిగా ఆరినప్పుడు మాత్రమే ఉపయోగించండి.
- వాటర్ బాటిల్లో కొంత వెనిగర్ వేసి శుభ్రం చేయడం వల్ల సూక్ష్మ జీవులు నశిస్తాయి.
మీరు డైలీ అవకాడో తింటున్నారా? - లేదంటే ఈ బెనిఫిట్స్ మిస్ అయినట్లే!