Is it Safe to Head Bath with Hot Water: అందంగా కనిపించాలంటే.. ముఖ వర్ఛస్సుతోపాటు జుట్టు కూడా బాగుండాలి. అప్పుడే ముద్దుగా కనిపిస్తారు. అందుకే.. చాలా మంది జుట్టు సంరక్షణ విషయంలో అనేక జాగ్రత్తలు తీసుకుంటుంటారు. అయితే.. తమకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుంటారు. అలాంటి వాటిల్లో ఒకటి.. వేడినీటితో తలస్నానం చేయడం! మరి.. వేడినీటి స్నానం జుట్టు ఆరోగ్యంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో మీకు తెలుసా? ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
వేడిగా ఉండే నీటితో తలస్నానం చేయడం మంచిది కాదంటున్నారు నిపుణులు. వేడి నీరు జుట్టు కుదుళ్లలో ఉన్న సహజ నూనెలను తొలగిస్తుందని, దీని కారణంగా జుట్టు పొడిబారి పెళుసుగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే.. వేడి నీరు స్కాల్ఫ్ ను పొడిగా చేస్తుందని.. తద్వారా దురద, చుండ్రు వంటి సమస్యలకు దారితీస్తుందని చెబుతున్నారు. అంతే కాకుండా.. జుట్టు మూలాలను కూడా బలహీనపరుస్తుందని.. ఫలితంగా జుట్టు చిట్లిపోయి, రాలిపోతుందని హెచ్చరిస్తున్నారు. కాబట్టి మరీ వేడి నీటితో కాకుండా.. గోరువెచ్చని నీటితో తలస్నానం చేయడం మంచిదని సూచిస్తున్నారు.
2011లో "ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ కాస్మెటిక్ డెర్మటాలజీ"లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. వేడినీటితో తలస్నానం చేయడం వల్ల జుట్టు నుంచి తేమ తొలగిపోతుందని, అలాగే సహజ నూనెలు కూడా తగ్గుతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని బీజింగ్‌లోని చైనా మెడికల్ యూనివర్శిటీ ఆఫ్ పెకింగ్కి చెందిన డాక్టర్ యాంగ్ పాల్గొన్నారు.
తలస్నానం చేసినా కూడా జుట్టు జిడ్డు వదలట్లేదా? - ఈ టిప్స్‌తో కురులు మెరిసిపోతాయి!
వారానికి ఎన్ని సార్లు తలస్నానం చేయాలి: వారంలో ఎన్ని సార్లు తలస్నానం చేయాలి? అనేది అందరికి ఒకేలా ఉండదని, అది వారి వ్యక్తిగత అవసరాలు, జీవన శైలి, జుట్టు రకంపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అమెరికన్ అకాడమీ ఆఫ్ డెర్మటాలజీ (AAD) ప్రకారం.. తల మీద ఉన్న స్కిన్ ఉత్పత్తి చేసే నూనె మొత్తాన్ని బట్టి తలస్నానం చేసే ఫ్రీక్వెన్సీని నిర్ణయించుకోవాలని అంటున్నారు.
- జుట్టు జిడ్డుగా ఉంటే, ప్రతిరోజూ వాష్ చేసుకోవడం మంచిదని సూచిస్తున్నారు. అలా చేయడం ద్వారా వెంట్రుకలు క్లీన్‌గా ఉంటాయని అంటున్నారు.
- ఇక పొడి జుట్టు, సున్నితమైన తల చర్మం ఉన్న ఉన్నవారు హెయిర్ వాష్‌ల మధ్య కొన్ని రోజుల విరామం తీసుకోవడం ఉత్తమమని సూచిస్తున్నారు.
- కొందరికి హెయిర్ అడుగు భాగం జిడ్డుగా, చివర్లు పొడిగా ఉంటాయి. ఇలాంటి జుట్టు ఉన్నవారు బ్యాలెన్స్‌డ్‌గా వ్యవహరించాలి. అందుకోసం ప్రతి రెండు మూడు రోజులకు ఒకసారి హెయిర్ వాష్ చేయాలి.
- ఇక సోరియాసిస్, చుండ్రు వంటి సమస్యలతో బాధపడేవారు డెర్మటాలజిస్ట్‌లను సంప్రదించడం మంచిదని.. వారు సూచించిన ప్రత్యేక షాంపూలతో తలస్నానం చేయడం బెటర్ అంటున్నారు. ఎందుకంటే వారు సూచించిన ప్రొడక్ట్స్ జుట్టు ఆరోగ్యాన్ని కాపాడటంతో పాటు.. కొన్ని రకాల స్కాల్ప్ ప్రాబ్లమ్స్‌కు చెక్ పెడతాయని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఉప్పు నీటితో తలస్నానం చేస్తున్నారా? - తెల్ల వెంట్రుకలను పిలిచినట్టే!
వారంలో ఎన్నిసార్లు తలస్నానం చేయాలి? - మీ జుట్టు రకం ఆధారంగా ఇప్పుడే తెలుసుకోండి!