How To Solve Urine Leakage Problem : మహిళల్లో సాధారణంగానే వయసు పెరుగుతున్న కొద్దీ మూత్రవిసర్జన ఎక్కువవుతుందని, దీనికి అనేక కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. షుగర్ వ్యాధితో బాధపడేవారిలో ఈ సమస్య ఇంకా ఎక్కువగా ఉంటుంది. కొంతమందికి మూత్రం వస్తున్నట్టు అనిపించిన వెంటనే.. వాష్‌రూమ్‌కు పరిగెత్తాల్సి వస్తుంది. కొన్నిసార్లు బాత్రూమ్‌కు వెళ్లేలోపే బట్టల్లోనే పడిపోవచ్చు. ఇలాంటి సమస్యను 'యూరినరీ ఇన్‌కాంటినెన్స్' అంటారు.
మూత్రం లీకవడానికి కారణాలు ఏంటి?
- మూత్రం ఆపలేకపోవడం అనే సమస్య పురుషుల్లో కన్నా మహిళల్లో ఎక్కువగా కనిపిస్తుందట. దీనికి పలు కారణాలున్నాయని నిపుణులు చెబుతున్నారు.
- పునరుత్పత్తి, మూత్ర అవయవాల నిర్మాణం.. కాన్పులు, నెలసరి నిలిచాక హార్మోన్లలో మార్పులు రావడం వంటివి ప్రధాన కారణాలు.
- అలాగే మహిళల్లో మూత్రమార్గం చిన్నగా.. పైగా తిన్నగా ఉంటుంది. దీనివల్ల మూత్రం త్వరగా బయటకు వచ్చే అవకాశముంది.
- వయసు పెరుగుతున్నా కొద్ది కటి, మూత్రాశయ కండరాలు వదులవుతూ వస్తుంటాయి.
- అలాగే కాన్పు సమయంలో జననాంగ మార్గం నుంచి బిడ్డ బయటకు వస్తున్నప్పుడు కటి కండరాలు సాగటం, బలహీనపడటం కూడా ఈ సమస్య పెరిగేలా చేయొచ్చు.
- మూత్రాశయం, గర్భసంచి కిందికి జారటం వల్ల కూడా మూత్రం ఆపుకోలేకపోవడానికి కారణం కావొచ్చు.
- బరువు ఎక్కువగా ఉన్నా కూడా పొట్టలో కొవ్వు ఎక్కువై పోయి మూత్రాశయం మీద బరువు పడుతుంది. దీనివల్ల లీకేజీ సమస్య ఏర్పడుతుందని నిపుణులంటున్నారు.
ఈ సమస్యను ఎలా తగ్గించుకోవాలి ?
ఒత్తిడితో మూత్రం లీకయ్యేవారు.. కటి కండరాలను బలోపేతం చేసే కెగెల్ వ్యాయామాలు చేయడం వల్ల ప్రయోజనం ఉంటుందని డాక్టర్ మణి అక్కినేని చెబుతున్నారు. మూత్రాన్ని పట్టి ఉంచటానికి తోడ్పడుతున్న మజిల్స్‌ను గుర్తించి, వాటిని కనీసం పది సెకండ్ల పాటు బిగుతుగా పట్టి ఉంచాలి. అలాగే మూత్రం పోస్తున్నప్పుడు మధ్యలో కొద్దిసేపు స్టాప్ చేసి.. తర్వాత కొద్దిసేపు యూరిన్ పోసి, మళ్లీ పట్టి ఉంచాలి. ఇలా యూరిన్ విసర్జన పూర్తయ్యేంత వరకు మూడు లేదా నాలుగు సార్లు చేయాలి.
- అలాగే కూర్చొని టీవీ చూస్తున్నప్పుడో, పుస్తకం చదువుతున్నప్పుడో కటి కండరాలను సంకోచింపజేస్తుండాలని సూచిస్తున్నారు. దీనివల్ల అవి బలోపేతమవుతాయి. ఈ టిప్స్ పాటించడం వల్ల చాలామందిలో సమస్య తగ్గుతుంది.
- ఇంకా రోజూ కొద్ది దూరం నడవడం వల్ల కండరాలు దృఢంగా మారి సమస్య తగ్గుతుంది.
NOTE : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మూత్రం బలవంతంగా ఆపుకుంటున్నారా? - ఏం జరుగుతుందో తెలుసా?
పీరియడ్స్ నుంచి మహిళలకు బిగ్ రిలీఫ్.. ఇది ఒక్కటి తెచ్చుకుంటే.. 2,500 ప్యాడ్స్‌తో సమానం!