How To Reduce Back Pain During Periods : పీరియడ్స్ సమయంలో స్త్రీలలో కడుపు నొప్పి, కడుపు ఉబ్బరంతో పాటు చాలా బలహీనంగా అనిపిస్తుంది. చాలా మందికి ఇదే టైంలో వెన్నుముక అంటే నడుము నొప్పి కూడా వస్తుంటుంది. ఇవన్నీ ప్రతి నెలా అందరు స్త్రీలు అనుభవించే సమస్యలే. కానీ కొందరు ఆడవాళ్లలో మాత్రం నడుము నొప్పి తీవ్రంగా ఉంటుంది. ఆ సమయంలో నొప్పి భరించలేక ఏడ్చే ఆడవారు కూడా ఉంటారు.
అయితే ఇవన్నీ పీరియడ్స్ టైంలో హార్మోన్ల మార్పుల కారణంగానే జరుగుతుంటాయా అంటే కాదని చెబుతున్నాయి కొన్ని అధ్యయనాలు. ఆ సమయంలో వచ్చే విపరీతమైన నడుము నొప్పికి కేవలం అదొక్కటే కారణం కాదట. పీరియడ్స్ సమయంలో తీవ్రమైన వెన్నుముక నొప్పి రావడానికి వేరే కారణాలు కూడా ఉంటాయట. అవేంటో వాటి నుంచి ఎలా ఉపశమనం పొందవచ్చో తెలుసుకుందాం.
1. డిస్మెనోరియా
రుతుస్రావం సమయంలో సాధారణంగా వచ్చే నడుము నొప్పిని డిస్మెనోరియా అంటారు. ఇది ఆ సమయంలో స్త్రీ శరీరంలో జరిగే హార్మోన్ల మార్పుల కారణంగా వస్తుంది. ముఖ్యంగా ఈస్ట్రోజెన్, ప్రొజెస్టెరాన్ ఉత్పత్తులల్లో జరిగే హెచ్చు తగ్గులు వెన్ను నొప్పిని తెచ్చిపెడతాయి. ఇవే కాదు నెలసరి వచ్చినప్పుడు స్త్రీలలో నడుము నొప్పి, పెల్విక్ నొప్పి, పొత్తికడుపు తిమ్మిరి, కాళ్ల నొప్పులు, జీర్ణ సమస్యలు, తలనొప్పితో పాటు అలసట, మూడ్ స్వింగ్స్ వంటి ఇబ్బందులు కూడా కలుగుతాయి.
2. గర్భాశయ సంకోచాలు
పీరియడ్స్ టైంలో కలిగే రక్తస్రావానికి గర్భాశయ కండరాలు సహకరించాల్సి ఉంటుంది. ఇందుకోసం గర్భాశయం తన లోపలి పొరను తొలగించుకుంటుంది. రక్తాన్ని బయటకు పంపించేందుకు గర్భాశయ కండరాలు తీసుకునే ఒత్తిడి కారణంగా వెన్నుముకలో నొప్పి కలుగుతుంది. ఇదే కొందరిలో తీవ్రమైన నొప్పికి కారణం అయే అవకాశాలు ఉన్నాయి.
3. ప్రోస్టాగ్లాండిన్స్
నెలసరి సమయంలో ఆడవారి శరీరంలో విడుదలయ్యే హార్మోన్ల లాంటివే ఈ ప్రోస్టాగ్లాండిన్స్. ఇవి ఎక్కువ మొత్తంలో విడుదలైతే గర్భాశయ సంకోచాలు కలిగి విపరీతమైన వెన్నునొప్పి వస్తుంది. దాంతో పాటు రక్తప్రవాహం తగ్గి రక్తనాళాలు దెబ్బతింటాయి. ప్రోస్టాగ్లాండిన్స్ విడుదల గర్భాశయం చుట్టుపక్కల కండరాలకు ఆక్సిజన్ సరఫరాను కూడా తగ్గిస్తుంది.
4. వాపు
పీరియడ్స్ ఉన్నప్పుడు పెల్విక్ (కటి) ప్రాంతంలో రక్తం, ఇతర కణజాలాలు ఉండటం వల్ల వాపు, చికాకు లాంటి సమస్యలు వస్తాయి. వీటి కారణంగా శరీరంలో కలిగే అసౌకర్య వాతావరణం కూడా వెన్నుముక నొప్పికి కారణమవుతుంది.
5. ఒత్తిడి
మానసిక, శారీరక ఒత్తిడి కూడా శరీరాన్ని అసౌకర్యంగా, బలహీనంగా మార్చుతాయి. చాలా మంది స్త్రీలు పీరియడ్స్ సమయంలో తలనొప్పి, కడుపు నొప్పి, కాళ్ల నొప్పులు లాంటి ఇబ్బందుల వల్ల ఎక్కువ ఒత్తిడికి లోనవుతుంటారు. ఈ కారణంగానే వారిలో నడుము నొప్పి ఎక్కువగా వస్తుండచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి.
నొప్పి నుంచి బయట పడటం ఎలా?
పీరియడ్స్ సమయంలో భరించలేని నొప్పి నుంచి రిలీఫ్ కావాలంటే, హీట్ థెరపీ అంటే వెన్నుముకకు కాపడం పెట్టుకోవాలి. యోగాతో పాటు వెన్నుముకకు సంబంధించిన చిన్నపాటి వ్యాయామాలు, లేదా వాకింగ్ అలవాటు చేసుకోవాలి. సమతుల్య ఆహారం అంటే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, మెగ్నీషియం అధికంగా ఉండే ఆహారాలు తీసుకోవాలి. ఈ టైంలో కాఫీ, టీలు, ఉప్పును కాస్త తగ్గించుకుంటే మరీ మంచిది. ముఖ్యమైన సలహా ఏంటంటే ఒత్తిడి తగ్గించుకోవాలి. ఇందుకోసం ఆలోచనలను తగ్గించుకోవడంతో పాటు మెడిటేషన్ లాంటివి చేయాలి.
పీరియడ్స్ వాయిదా కోసం మందులు వాడుతున్నారా? ఈ విషయాలు తెలుసుకోండి!
పీరియడ్స్ సరిగా రావట్లేదా? ఇవి తింటే చాలు - ప్రాబ్లమ్ క్లియర్!