How To Overcome Loneliness In Life : పలు రకాల ఇబ్బందులతో కొంత మంది మహిళలు ఒంటరితనాన్ని అనుభవిస్తుంటారు. మానసిక వేదనకు గురవుతుంటారు. ఈ పరిస్థితి లోలోపల వారిని బాగా కుంగదీస్తుంది. అయితే.. ఈ ఒంటరితనం దీర్ఘకాలం కొనసాగితే.. డిప్రెషన్‌లోకి వెళ్లే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి.. ఈ పరిస్థితి నుంచి ఎలా బయటపడాలో ఇప్పుడు తెలుసుకుందాం.
సామాజిక కార్యకలాపాల్లో పాల్గొనండి..
ఇంట్లో ఒంటరిగా కూర్చొని ఉంటే ఎవ్వరికైనా "ఒంటరి" ఆలోచనలు కలుగుతాయి. దీన్ని తొలగించుకోవాలంటే నలుగురితో మాట్లాడాలి. మనకు తెలిసిన విషయాలను ఇతరులతో పంచుకోవాలి. సామాజిక కార్యక్రమాల్లో పాల్గొనాలని నిపుణులు సూచిస్తున్నారు. స్కూళ్లు, కాలేజీల్లో నిర్వహించే ప్రోగ్రామ్స్‌లో పాల్గొనడం ద్వారా మానసిక సాంత్వన కలుగుతుందని అంటున్నారు.
క్లబ్‌లలో చేరండి..
నేడు కొంత మంది మహిళలు కలిసి క్లబ్‌లను ఏర్పరచుకుంటున్నారు. ఇందులో పాల్గొనడం ద్వారా.. కొత్త వారు పరిచయం అవుతారు. అందులో మీకు నచ్చిన వారితో స్నేహం చేయండి. మీ ఆలోచలను, భావాలను వారితో పంచుకోండి.
కొత్త పనులు నేర్చుకోండి..
ఇంట్లో ఖాళీగా ఒక్కరే ఉంటే బోర్ కొడుతుంది. అలాంటప్పుడు ఏదైనా కొత్త విషయాలను నేర్చుకోవడంపై దృష్టి సారించండి. కుట్లు, అల్లికలు, పెయింటింగ్ వంటి వాటిని అభిరుచిగా మార్చుకోండి. లేదంటే ఏదైనా జాబ్‌లో చేరండి. దీనివల్ల మనసు పనిమీదకు మళ్లుతుంది. ఒంటరిగా ఉన్నామనే భావన దూరమవుతుంది.
పెంపుడు జంతువులతో..
మీకు కుక్కలు, పిల్లులు వంటి పెట్స్‌ను పెంచుకోవడంపై ఆసక్తి ఉంటే.. వాటిని పెంచుకోండి. వాటితో గడపడం ద్వారా చాలా త్వరగా మానసిక ఆందోళన తగ్గుతుంది. వాటితో సాయంత్రం వాకింగ్‌కు వెళ్తే ప్రశాంతంగా ఉంటుంది.
సెమినార్‌లు, వర్క్‌షాప్‌లు..
ఒంటరిగా ఫీల్ అయ్యే వారు బయటకు వచ్చి కొన్ని సెమినార్‌లు, వర్క్‌షాప్‌లలో పాల్గొనండి. వీటివల్ల నలుగురితో కలిసి మాట్లాడటం, కలవడం అలవాటవుతుంది. ఇవి మీ మానసిక పరివర్తనను మార్చడంలో ఎంతగానో సహాయపడుతుందని నిపుణులంటున్నారు.
మంచి ఆహారం..
వేళకు సరైన ఆహారం తీసుకోకుండా అశ్రద్ధగా ఉంటే కూడా ఆందోళనలు, ఒత్తిడి కలుగుతాయి. కాబట్టి, రోజూ సమతుల ఆహారానికి తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. తాజా పండ్లు, కూరగాయలను ఆహారంలో భాగం చేసుకోవాలి. మంచి ఫుడ్ తినడం వల్లనే కొన్ని రకాల మానసిక సమస్యలను దూరం చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
సోషల్ మీడియాను ఉపయోగించండి..
ఇంటర్నెట్ వచ్చాక ప్రపంచం మొత్తం మీ చేతిలోకి వచ్చింది. ఇందులో మీ పాత పరిచయస్తులు, స్నేహితులు, బంధువులతో కనెక్ట్ అవ్వండి. అలాగే వారితో వీడియోకాల్, ఆడియో కాల్‌లలో మాట్లాడండి. దీనివల్ల మీకంటూ కొందరు ఉన్నారనే భావన కలుగుతుంది. మీకు ఏదైనా తీవ్రమైన బాధ ఉంటే వారితో పంచుకోండి. దీనివల్ల కొంత వరకు ఉపశమనం కలగవచ్చు.
మానసిక నిపుణుడిని కలవండి..
ఇన్ని చేసినా.. డిప్రెషన్, ఒంటరిననే ఫీలింగ్స్ తగ్గకపోతే.. వెంటనే మానసిక నిపుణులను కలిసి కౌన్సెలింగ్ తీసుకోండి. వారు మీ సమస్యకు గల కారణాన్ని కనుగొని పరిష్కార మార్గం సూచిస్తారు.
మహిళలు, ఈ సమస్యలను నిర్లక్ష్యం చేస్తున్నారా? ముప్పు తప్పదంటున్న నిపుణులు!
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తే - మీకు షుగర్ వ్యాధి రాబోతున్నట్టే!