How to Manage Diabetes at Work : ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ మంది ఎదుర్కొంటున్న సమస్య డయాబెటిస్. డయాబెటిస్ బారిన పడుతున్న వారి సంఖ్య అంతకంతకు పెరుగుతోందని అన్ని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. అలాగే మన దేశంలోనూ డయాబెటిస్ ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్న వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. ముఖ్యంగా శారీరక శ్రమ లేని వారికి ఈ సమస్య మరీ ఎక్కువగా ఉంది. చాలామంది ఆఫీస్ వర్క్స్ చేస్తుండటం వల్ల శారీరక శ్రమ లేకపోవడం, ఆహారపు అలవాట్లు, జీవన విధానం లాంటి చాలా అంశాలు డయాబెటిస్ బారిన పడేందుకు కారణం అవుతున్నాయి. అయితే ఆఫీస్‌కు వెళ్లే వారు డయాబెటిస్‌ను సరిగ్గా మెయింటెన్ చెయ్యకపోతే మాత్రం అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. మరి ఇలాంటి వారికి వైద్యులు ఇచ్చే సలహాలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం.
ఆఫీస్‌లో అటు ఇటు నడవడం : డయాబెటిస్తో బాధపడుతున్న వాళ్లు ప్రతి గంటకు ఒకసారి ఆఫీస్‌లో అటుఇటుగా నడవడం మంచిది అని ప్రముఖ ఎండ్రోక్రైనాలజిస్ట్ డా. రవిశంకర్ ఇరుకులపాటి సలహా ఇస్తున్నారు. ఇలా నడవడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ అవుతుందని అంటున్నారు.
సమయానికి ఆహారం తీసుకోండి : ఆఫీస్‌లో పనిలో ఉండటం వల్ల చాలామంది సరైన సమయంలో భోజనం చెయ్యరు. ఎంత పనిలో ఉన్నా సరే సరైన సమయంలో భోజనం చెయ్యడం అనేది ఎంతో ముఖ్యమైనది. అందుకే భోజనాన్ని సమయానికి ముగించేలా ముందే ప్లాన్ చేసుకోవడం మంచిదని వైద్యులు చెబుతున్నారు.
ఇంటి భోజనమే మంచిది : చాలామంది ఆఫీస్‌కు త్వరగా వెళ్లాలనే తొందరలో ఇంటి నుండి ఆహారం తీసుకురావడం మర్చిపోతుంటారు. లేదంటే నిర్లక్ష్యం వహిస్తుంటారు. అలాంటి వాళ్లు క్యాంటీన్లో సహచరులు ఏది తింటే అది తింటూ ఉంటారు. ఇది ఎంతమాత్రం మంచిది కాదు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఇంటి భోజనం తెచ్చుకోవడం ఉత్తమం అని చెబుతున్నారు వైద్యులు. డయాబెటిస్తో బాధపడే వారికి ఏ ఆహారం సెట్ అవుతుందో అలాంటి వాటినే తీసుకోవాలని సూచిస్తున్నారు.
ఇన్సులిన్ : డయాబెటిస్తో బాధపడే వాళ్లు ఇన్సులిన్‌ను సరిగ్గా వాడాలి. ఆఫీస్‌కు వెళ్లే వారు ఆఫీస్‌లో ఫ్రిజ్ ఉంటే అందులో ఇన్సులిన్‌ను పెట్టి, అవసరమైనప్పుడు వినియోగించుకోవాలి. ఫ్రిజ్ లేకపోతే థర్మాస్ ఫ్లాస్క్ లాంటిది తీసుకొని అందులో ఐస్ వేసి, ఇన్సులిన్ పెట్టి వాడుకోవాలి. ఇన్సులిన్‌ను ఎలాపడితే అలా వాడితే మాత్రం పెద్దగా ప్రయోజనం ఉండదు అని వైద్యులు చెబుతున్నారు.
సమాచారాన్ని ఇతరులతో పంచుకోవడం : డయాబెటిస్తో బాధపడుతున్న వాళ్లు తమకు ఉన్న సమస్య గురించి ఆఫీస్‌లో కొంతమందితో పంచుకోవడం ముఖ్యమని వైద్యులు చెబుతున్నారు. అనుకోని సందర్భాల్లో ఈ సమాచారం ఎదుటి వ్యక్తులు సాయం చెయ్యడానికి ఉపయోగపడుతుందని అంటున్నారు.
అందుబాటులో ఆహార పదార్థాలు : డయాబెటిస్తో బాదపడుతున్నప్పుడు కొన్నిసార్లు శరీరంలో ఉన్నట్టుండి షుగర్ లెవల్స్ పడిపోవచ్చు. కాబట్టి చాక్లెట్లు, బిస్కెట్లు అందుబాటులో ఉంచుకోవాలి అని వైద్యులు సలహా ఇస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
కాఫీ Vs టీ- రెండిట్లో ఏది బెస్ట్? మార్నింగ్ లేవగానే తాగితే ఆరోగ్యానికి ప్రమాదమా?