How To Live 100 Years : రోజు రోజుకూ మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు వల్ల.. నూరేళ్ల జీవితంపై మెజారిటీ జనం ఆశలు పెట్టుకోవట్లేదు. అదంతా పురాతన కాలంలో జరిగిఉండొచ్చుగానీ.. ఈ రోజుల్లో అసాధ్యంగా భావిస్తున్నారు. అయితే.. ఇప్పుడు కూడా సాధ్యమే అంటున్నారు నిపుణులు! నిద్రలేచిన తర్వాత ఉదయాన్నే కొన్ని పనులు చేస్తే.. నూరేళ్లు ఆరోగ్యంగా బతకొచ్చని చెబుతున్నారు. మరి.. అవేంటో? ఎలా పాటించాలో ఇప్పుడు తెలుసుకుందాం.
శారీరక శ్రమ..
వందేళ్లు బతకాలంటే.. ఉదయాన్నే శరీరానికి శ్రమపెట్టాలని సూచిస్తున్నారు. ఇందుకోసం కనీసం వాకింగ్ చేయాలని చెబుతున్నారు. ఇంకా వీలైతే తోటపని, ఇళ్లు సర్దడం లాంటివి కూడా చేసుకోవచ్చని చెబుతున్నారు. ప్రస్తుతం వృద్ధాప్యంలో ఉన్నవారిలో కొందరు వందేళ్లకు దగ్గరగా ఉన్నారు. అలాంటి వారు అన్నేళ్లు బతకడానికి కారణం.. వారు క్రమం తప్పకుండా ఫిజికల్ యాక్టివిటీని జీవితంలో భాగం చేసుకోడమేనని చెబుతున్నారు. ఒంట్లోంచి చెమట చిందిస్తే.. శరీరం ఫిట్‌గా ఉండటమే కాకుండా.. గుండె పనితీరు మెరుగుపడుతుందని తెలియజేస్తున్నారు.
పోషకాలు నిండిన బ్రేక్‌ఫాస్ట్..
సెంచరీ స్కోర్ చేయాలంటే కచ్చితంగా పోషకాలు నిండిన బ్రేక్‌ఫాస్ట్‌ను రోజూ తినాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇది రోజంతా శరీరానికి కావాల్సిన శక్తిని అందిస్తుందని అంటున్నారు. అలాగే.. ఉదయాన్నే అల్పాహారం తిన్నవారు చేసే ఏ పని మీదైనా శ్రద్ధ, ఆసక్తితో ఉంటారట. పోషకాలు నిండిన అల్పాహార జాబితాలో ఓట్స్ ఫస్ట్ ప్లేస్‌లో ఉంటాయని.. వీటిని రోజూ తీసుకోవడం మంచి, ఆరోగ్యకరమైన అలవాటని తెలియజేస్తున్నారు.
ఒక కప్పు కాఫీతో..
100 ఏళ్ల జీవితం మన సొంతం కావాలంటే రోజూ ఉదయాన్నే ఒక కప్పు కాఫీ తాగడం ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల మనసు ఉత్తేజకరంగా మారుతుందట. అలాగే కాఫీలో ఉండే కెఫిన్ అనే యాంటీ ఆక్సిడెంట్.. క్యాన్సర్, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షించడంలో సహాయపడుతుందంటున్నారు.
అందరితో మాట కలపడం..
నిత్యం మనం ఏదో ఒక కారణం వల్ల ఒత్తిడికి గురవుతుంటాం. కానీ.. ఈ ఒత్తిడిని తగ్గించుకోవడం వల్లే 100 ఏళ్ల జీవితం సాధ్యమవుతుందని నిపుణులంటున్నారు. అందుకే.. మనకు ఇష్టమైన వ్యక్తులను కలిసి కష్ట సుఖాలను తెలియజేసి.. కొంత సాంత్వన పొందటం ముఖ్యమని చెబుతున్నారు. మనం చూసుకుంటే మన పూర్వీకులు అందరితో కలిసి పోయేలా సంబంధాలను ఏర్పరచుకునేవారని గుర్తు చేస్తున్నారు.
గతంలో అందరూ కలిసి భోజనం చేయడం, ఇరుగు పొరుగు వారితో మాట కలపడం వంటివి చేశారని.. కానీ, నేడు చాలా మంది ఒంటిరి జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారని చెబుతున్నారు. దీనివల్ల ఒత్తిడి, ఆందోళనలు కలిగి మనిషి ఆయుష్షు కరిగిపోతోందని హెచ్చరిస్తున్నారు.
ఇలా చేయండి..
- వీటన్నింటితోపాటు ఆరోగ్యకరంగా వందేళ్లు జీవించాలంటే మంచి జీవనశైలిని అలవాటు చేసుకోవడం ముఖ్యం.
- ఆరోగ్యాన్ని పాడు చేసే ధూమపానం, మద్యపానం వంటి అలవాట్లకు దూరంగా ఉండాలి.
- మానసిక ప్రశాంతత ఉండటం కోసం యోగా, జ్ఞానం వంటి వాటి వైపు మళ్లాలి.
- అలాగే జీవితంలో ప్రతి క్షణాన్నీ ఆస్వాదిస్తూ ముందుకు సాగాలని నిపుణులు చెబుతున్నారు.
టాబ్లెట్స్ మింగడం మీవల్ల కావట్లేదా? - ఈ టిప్స్ పాటిస్తే ప్రాబ్లమ్ క్లియర్!
మీరు తినే నెయ్యి స్వచ్ఛమైనదా? - గుట్టు ఇలా తేల్చేయండి!
థైరాయిడ్‌తో ఇబ్బంది పడుతున్నారా? - ఈ టిప్స్‌తో అదుపులోకి రావడం పక్కా!