Bladder Health Tips: శరీరంలో ఉండే మలినాలను మూత్రం రూపంలో మూత్రాశయం (బ్లాడర్) బయటకు విసర్జింస్తుంటుంది. రక్తంలోని మలినాలను, శరీరానికి ఎక్కువైన నీటిని మూత్ర పిండాలు వడపోసి మూత్రాశయంలోకి చేరుస్తాయి. ఆ తర్వాత విసర్జనకు సమయం కాగానే మూత్రాన్ని బయటకు పంపిస్తుంది. ఇలాంటి ముఖ్యమైన బ్లాడర్‌లో తలెత్తే సమస్యల వల్ల అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. కొందరిలో అయితే.. దగ్గినా, తుమ్మినా సరే మూత్రం బయటకు వెళ్లిపోతుంది. ఇంకా చాలా మందికి తెలియకుండానే మూత్రం విసర్జన అయిపోతుంది. దీంతో చాలా మంది ఇబ్బందులు పడుతుంటారు. ఈ నేపథ్యంలోనే ఈ సూచనలు పాటిస్తే మూత్రాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని అంటున్నారు నిపుణులు.(రిపోర్ట్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవద్దు!
ప్రతీ 3-4 గంటలకు ఒకసారి తప్పనిసరిగా మూత్రవిసర్జన చేయాలని నిపుణులు చెబుతున్నారు. మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకోవడం వల్ల మూత్రాశయ కండరాలు బలహీనపడడమే కాకుండా ఇన్ఫెక్షన్ కూడా వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
మూత్రం పోసేటప్పుడు రిలాక్స్‌గా ఉండండి
మూత్రాశయాన్ని ఖాళీ చేసే సమయంలో రిలాక్స్‌గా ఉండాలని సలహా ఇస్తున్నారు. బ్లాడర్ కండరాలను రిలాక్స్ చేయడం వల్ల సులభంగా మూత్ర విసర్జన జరిగి ఒత్తిడి పడదని చెబుతున్నారు. ఇందుకు టాయిలెట్లో కూర్చుని పోయడం చక్కటి ఆప్షన్ అని సూచిస్తున్నారు.
వేగంగా మూత్రాన్ని పోయకండి
కొందరు వేగంగా మూత్రాన్ని పోసేస్తుంటారు. ఇలా చేయడం వల్ల మూత్రాశయంలో కొంత మూత్రం మిగిలిపోయే ప్రమాదం ఉంటుందని.. ఫలితంగా అనేక ఇన్ఫెక్షన్లకు దారి తీస్తుందని హెచ్చరిస్తున్నారు.
టాయిలెట్ వెళ్లాక క్లీన్ చేసుకోవాలి
మహిళలు అయితే మూత్ర విసర్జన తర్వాత తప్పనిసరిగా శుభ్రం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు.
శృంగారం చేసిన తర్వాత మూత్రం పోయాలట
శృంగారం చేసిన తర్వాత బ్యాక్టీరియా శరీరంలోకి ప్రవేశించి ఇన్ఫెక్షన్ సోకే అవకాశాలు ఉంటాయని నిపుణులు అంటున్నారు. కాబట్టి మహిళలు, పురుషులు శృంగారం తర్వాత తప్పనిసరిగా మూత్ర విసర్జన చేయాలని సూచిస్తున్నారు. ఫలితంగా బ్యాక్టీరియా బయటకు వెళ్లిపోతుందని చెబుతున్నారు.
వ్యాయామంతో మూత్రాశయం ఆరోగ్యం
పెల్విక్ ఫ్లోర్ ఎక్సర్‌సైజులతో మూత్రాశయ ఆరోగ్యం మెరుగు పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇవి మూత్రాశయ కండరాలను దృఢంగా చేసి.. దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు అకస్మాత్తుగా మూత్రం లీక్ కాకుండా చేస్తుందని వివరించారు. ఇదే కాకుండా మూత్రాశయ కండరాలు బలంగా మారి ఇన్ఫెక్షన్లు రాకుండా కాపాడుతాయన్నారు.
కాటన్ అండర్ వేర్లు వాడాలి
మనం ఉపయోగించే అండర్ వేర్లు కచ్చితంగా వదులుగా, కాటన్ దుస్తులు అయ్యేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. బిగుతుగా, నైలాన్‌తో తయారయ్యే అండర్ వేర్ల వల్ల తడిగా మారి బ్యాక్టీరియాను పెరిగేలా చేస్తుందని అంటున్నారు. అందుకే కాటన్ అండర్ వేర్లు వదులుగా ఉండేలా వేసుకోవాలని సలహా ఇస్తున్నారు.
అధిక బరువుతో లీకేజీ
అధిక బరువుతో బాధపడుతున్నవారిలోనూ మూత్రం లీక్ అయ్యే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అందుకే హెల్దీ ఫుడ్స్ తీసుకుని బరువు తగ్గేలా చూసుకోవాలని సలహ ఇస్తున్నారు.
ఇవి తినకూడదు
సోడాలు, కృత్రిమ స్వీటనర్స్, స్పైసీ ఫుడ్, జ్యూసులు లాంటివి తీసుకోవడం వల్ల మూత్రాశయం సమస్య పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి డైట్‌ను మార్చుకోవడం వల్ల మూత్రాశయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని అంటున్నారు.
ద్రవాలు ఎక్కువగా తీసుకోవాలి
మానవ శరీరంలో సగానికి పైగా నీరు ఉంటుంది. ఒక వ్యక్తి బరువు, చేసే పనులు, నివసించే ప్రదేశాన్ని బట్టి రోజుకు ఎంత నీరు తాగాలో లెక్కిస్తారు. ఇది ఎలా ఉన్నా.. సాధారణంగా శరీరానికి అవసమైన మేర ద్రవాలు సేవించి కొన్ని గంటల వ్యవధిలోనే మూత్ర విసర్జన చేయాలని చెబుతున్నారు. కొందరు తక్కువ నీటిని సేవించి మూత్రానికి తక్కువగా వెళ్తుంటారు. ఇలా చేయడం వల్ల కిడ్నీ వైఫల్యం, గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆల్కహాల్, కెఫిన్‌ను తగ్గించండి
చాలా మంది ఆల్కహాల్, కెఫిన్‌ను ఎక్కువగా తాగుతుంటారు. దీని వల్ల మూత్రాశయ సమస్యలు ఎక్కువయ్యే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.
మలబద్ధకంతో సమస్య
మలబద్ధకం సమస్య వల్ల కూడా మూత్రాశయం అనారోగ్యం పాలయ్యే అవకాశం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఇందుకోసమే అధికంగా ఫైబర్ ఉండే పదార్థాలు తింటూ, ఎక్కువ నీటిని తాగాలని సూచిస్తున్నారు.
ధూమపానం ఆపేయాలి
పొగ తాగేవారిలో మూత్రాశయ సమస్యలు అధికంగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పొగ తాగేవారిలో బ్లాడర్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఎక్కువని.. అందుకే స్మోకింగ్ ఆపేయాలని సూచిస్తున్నారు.
మందులతోనూ జాగ్రత్త
కొందరు వాడే మందుల వల్ల కూడా మూత్రం లీక్ అయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. మందులు తీసుకోవడం వల్ల నరాలు రిలాక్స్ అయ్యి నిద్రగా అనిపిస్తుందని.. ఫలితంగా మూత్రం వచ్చినట్లుగా తెలియక లీక్ అవుతుందని అంటున్నారు.
మూత్రాశయం అనారోగ్యం వల్ల తలెత్తే సమస్యలు
- మూత్రం లీకేజీ లేదా మూత్రాన్ని ఆపుకోలేకపోవడం
- అకస్మాత్తుగా, తరచుగా మూత్రం రావడం
- మూత్రంలో రక్తం పడడం
- మూత్రం పోసే సమయంలో నొప్పి
- మూత్రం పోసేటప్పడు మొదట్లో రాకపోవడం
- మూత్రం మొత్తాన్ని పోయలేకపోవడం
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
జస్ట్ 5 నిమిషాలు ఇలా చేస్తే హై బీపీ పరార్! ఎలానో తెలిస్తే షాక్ అవుతారు!!
మీకు పగటి పూట నిద్ర వస్తుందా? ఈ వ్యాధి వస్తుందని సిగ్నల్ వచ్చినట్లే జాగ్రత్త!