Tamarind Face Pack For Acne and Black Spots : వంటల్లో చింతపండు ఇంపార్టెన్స్ ఏంటో అందరికీ తెలుసు. చింతపండు లేకుంటే కొన్ని వంటలు అసలు చేయనే లేరు. అయితే.. అందాన్ని మెరిపించడంలోనూ చింతపండు అద్భుతంగా పనిచేస్తుందని మాత్రం చాలా తక్కువమందికి తెలుసు. ముఖం మీద మొటిమలు, మచ్చలతో అవస్థలు పడుతున్న వారికి ఇది చక్కటి మెడిసిన్‌గా పనిచేస్తుందని సౌందర్య నిపుణులు చెబుతున్నారు. మరి.. ఇంతకీ చింతపండును ఎలా వాడాలో ఇప్పుడు చూద్దాం.
మొటిమలకు ఇలా చెక్..
మొటిమలతో ఇబ్బందులు పడుతున్న వారు చింతపండుతో మాస్క్ వేసుకుంటే అద్భుతమైన ఫలితాలు చూడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందుకోసం.. ముందుగా పావుకప్పు నీళ్లను వేడి చేసుకోవాలి. అందులో నిమ్మకాయంత సైజు చింతపండు వేసి, కాసేపు నానబెట్టాలి. తర్వాత చింతపండు పిండేసి.. పిప్పి తీసేయాలి. ఇప్పుడు ఇందులోంచి ఒక టేబుల్ స్పూన్ పరిమాణంలో గుజ్జును తీసుకొని.. దానికి స్పూన్ ముల్తానీ మట్టిని యాడ్ చేయాలి. ఈ మిశ్రమానికి కాస్త రోజ్‌వాటర్ యాడ్ చేయాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చక్కగా మిక్స్ చేసి.. ముఖానికి, మెడకు మాస్క్ మాదిరిగా వేసుకోవాలి. ఆ తర్వాత 15 నిమిషాల పాటు ఆరనిచ్చి, చల్లటి నీటితో కడిగేయాలి. మిగిలిన మిశ్రమాన్ని ఫ్రిజ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. ఈ ప్యాక్ తరచూ వేసుకుంటే మొటిమల ఇబ్బంది క్రమంగా తగ్గిపోతుందని నిపుణులు చెబుతున్నారు. అంతేకాదు.. చర్మానికి కూడా కొత్త మెరుపు వస్తుంది.
చర్మ కాంతి కోసం..
చర్మం కాంతివంతంగా మెరవడానికి ఒక టేబుల్ స్పూన్ పరిమాణంలో చింతపండు గుజ్జు తీసుకోండి. దానికి హాఫ్ స్పూన్ పసుపు కలపండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని చర్మానికి అప్లే చేసుకొని 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని వాటర్‌తో క్లీన్ చేసుకోవాలి. ఇలా చేస్తే చర్మం మెరిసిపోతుంది.
సూపర్ బ్లీచ్..
చింతపండును చక్కని బ్లీచ్‌గా కూడా వాడుకోవచ్చు. దీనికోసం.. చింతపండు గుజ్జుకు కాస్త అరటిపండు గుజ్జు యాడ్ చేయండి. తర్వాత కాస్త శనగపిండిని మిక్స్ చేసి పేస్ట్‌లా చేసుకోవాలి. ఈ మిశ్రమాన్ని చర్మానికి చక్కగా పట్టించిన తర్వాత.. ఓ 20 నిమిషాలు ఉంచి గోరువెచ్చని వాటర్‌తో కడిగేసుకోవాలి. ఇది చక్కటి బ్లీచింగ్ ఏజెంట్ గా పనిచేస్తుంది. చర్మాన్ని క్లీన్ చేస్తుంది.
స్క్రబ్ చేసుకోండిలా..
చింతపండును స్క్రబ్ గా వాడుకోవాలంటే.. గుజ్జును కాస్త తీసుకొని, దానికి స్పూన్ నిమ్మరసం, హాఫ్ స్పూన్ బేకింగ్ సోడా, స్పూన్ పంచదార మిక్స్ చేయాలి. ఈ మిశ్రమంతో చర్మాన్ని మృదువుగా మర్దనా చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత వేడినీటితో స్నానం చేయాలి. జిడ్డు చర్మం ఉన్న వారికి, మొటిమలతో ఇబ్బంది పడేవారికి ఇది మంచి మెడిసిన్‌లా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
టోనర్‌గా కూడా..
టోనర్‌గా యూజ్ చేయడానికి.. 2 స్పూన్ల్ చింతపండు రసం తీసుకోవాలి. దానికి 2 చెంచాల టీ డికాషన్ యాడ్ చేయాలి. ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత ఈ మిశ్రమంలో కాటన్ బాల్స్ ముంచి ముఖానికి రాసుకోవాలి. కొద్దిసేపు తర్వాత కూల్ వాటర్‌తో ముఖాన్ని క్లీన్ చేసుకోవాలి. అంతే.. చక్కటి టోనర్‌గా పనిచేస్తుంది.
ప్యాచ్ టెస్ట్ తర్వాతనే..
చింతపండు విషయంలో అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమంటే.. ఏదో ఒక పదార్థంతో మిక్స్ చేసి మాత్రమే వాడాల్సి ఉంటుంది. నేరుగా ముఖానికి, చర్మానికి రాసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా.. చింతపండు రసం కొందరి చర్మానికి సరిపడకపోవచ్చు. కాబట్టి.. దీన్ని వాడాలనుకుంటే ముందుగా ప్యాచ్ టెస్ట్ చేసుకోండి. అలర్జీ వంటివి ఏవీ లేవని నిర్ధారించకున్న తర్వాతనే ఉపయోగించాలని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.