How Much Weight Loss Per Week : ప్రస్తుత కాలంలో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది జనాలు అధిక బరువుతో బాధపడుతున్నారు. ఇలా అనారోగ్యకరమైన బరువు పెరగాడానికి మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఎక్కువసేపు కూర్చుని పనిచేయడం, వ్యాయామానికి దూరంగా ఉండటం ప్రధాన కారణాలని నిపుణులు చెబుతున్నారు. అయితే.. చాలా కాలం పాటు బరువు పెరిగిన వారు.. ఉన్నట్టుండి ఆ భారం దించేసుకోవాలని ప్రయత్నిస్తుంటారు. ఇందుకోసం కఠినమైన వ్యాయామాలు చేస్తూ.. డైట్ పాటిస్తుంటారు.
అయితే.. ఇష్టమొచ్చినట్టు వర్కౌట్స్ చేసి, డైట్ పాటించి బరువు తగ్గితే ఆరోగ్యానికి ముప్పు కలుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాదు.. భారత వైద్య పరిశోధనా మండలి (ICMR) కూడా కొన్ని కీలక సిఫార్సులు చేసింది. ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం.
సమతుల ఆహారం :
బరువు తగ్గాలనుకునే వారు తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పులు ఉండేలా చూసుకోవాలి. వీటిని తీసుకోవడం వల్ల ఆకలి తగ్గి, శరీరానికి అవసరమైన పోషకాలు అందుతాయి. ఇలా సమతుల ఆహారం తీసుకుంటూనే వివిధ రకాల వ్యాయామాలను చేయాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే వీరు అధిక బరువు ఉన్నప్పటికీ కనీస శరీర అవసరాల కోసం 1000 కిలో క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవాలని, దీనివల్ల వ్యాయామం చేసేటప్పుడు నీరసంగా అనిపించదని అంటున్నారు. ఇంకా విటమిన్లు, మినరల్స్ వంటివి ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలని సూచిస్తున్నారు.
అర కేజీ తగ్గడం సురక్షితం!
వెయిట్‌లాస్ కోసం ప్రయత్నించేవారు వారానికి 0.5 కిలోల బరువు తగ్గడం సురక్షితమని నిపుణులు పేర్కొన్నారు. దీనివల్ల కండరాలకు ఎలాంటి నష్టమూ కలగదని.. అలాగే శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా సర్దుబాటు అవుతుందని అంటున్నారు. 2016లో 'PLOS One' జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. వారానికి అర కిలో బరువు తగ్గిన వ్యక్తులు గుండె జబ్బులు, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్‌కు గురయ్యే ప్రమాదం తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో అమెరికాలోని 'హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్'కు చెందిన 'డాక్టర్ ఫ్రాంక్ హు' (Dr. Frank Hu) పాల్గొన్నారు. వారానికి అర కేజీ బరువు తగ్గడం వల్ల గుండె జబ్బులు ప్రమాదం, స్ట్రోక్, టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశం తక్కువగా ఉందని ఆయన పేర్కొన్నారు.
వెయిట్ లాస్ అవ్వడానికి ఐసీఎంఆర్ నిర్దేశించిన మార్గదర్శకాలు సరైనవే కానీ, ఇవి ఒక్కో వ్యక్తికి ఒక్కోవిధంగా మారొచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి, బరువు తగ్గాలనుకునే వారు డైటీషియన్ లేదా వైద్య నిపుణుల సలహాలు తీసుకోవడం మంచిదని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
బెల్లీ ప్యాట్ తగ్గాలా? ఇష్టమైన ఫుడ్ తింటూనే ఈ టిప్స్ పాటిస్తే చాలు! - Ayurvedic Tips for Belly Fat
ఈ యోగాసనాలతో ముఖంపై కొవ్వు ఇట్టే కరిగిపోతుంది! ఓసారి ట్రై చేయండి!! - Yoga Asanas To Lose Face Fat