How Much Sugar in a Day is Healthy : హెల్దీగా ఉండటానికి మనం డైలీ ఎన్ని గ్రాముల చక్కెర తీసుకోవచ్చు అనే అంశంపై.. ఇటీవల ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ICMR), నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ (NIN) సంయుక్తంగా కొన్ని సూచనలు చేశాయి. ఒక వ్యక్తి రోజులో ఎంత చక్కెర తీసుకోవచ్చు? అనే విషయం మనం తీసుకునే కేలరీలపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే.. డైలీ మనం తీసుకునే మొత్తం క్యాలరీల్లో చక్కెర 5 శాతానికి మించకూడదని అంటున్నారు. అలాగే రెండేళ్లలోపు చిన్నపిల్లలకు షుగర్ ఉండే ఆహార పదార్థాలను పెట్టకూడదని ఈ నివేదిక సూచించింది.
సాధారణంగా మనం తినే పండ్లు, కూరగాయాలలో కూడా షుగర్ ఉంటుంది. అయితే, వీటిని నేచురల్ షుగర్స్ అని అంటారు. ఇవి కాకుండా.. మనం టీ, కాఫీలలో కలుపుకునే చక్కెర, కూల్‌డ్రింక్స్, స్వీట్ వంటి వాటిలో ఉండే చక్కెరను యాడెడ్ షుగర్ అంటారు. నేచురల్ షుగర్స్ వల్ల ఆరోగ్యంపై ఎలాంటి ప్రతికూల ప్రభావమూ ఉండదని.. యాడెడ్ షుగర్స్ వల్ల మాత్రం ముప్పు తప్పదని హెచ్చరిస్తున్నారు.
ఎన్ని టీ స్పూన్ల చక్కెర తీసుకోవాలి?
బాడీ మాస్ ఇండెక్స్(BMI) ప్రకారం.. సాధారణ వ్యక్తి రోజుకు ఆరు టీస్పూన్లు అంటే 25 గ్రాముల చక్కెర మాత్రమే తీసుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) సూచిస్తోంది. అమెరికన్ హార్ట్ అసోసియేషన్ మాత్రం మగవారు 37.5 గ్రాములు, ఆడవారు 25 గ్రాముల వరకు షుగర్ తీసుకోవచ్చని చెబుతోంది.
షుగర్ ఎక్కువగా తింటే వచ్చే సమస్యలు ?
- చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
- 2017లో "ది అమెరికన్ జర్నల్ ఆఫ్ న్యూట్రిషన్" జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. చక్కెర ఎక్కువగా తినే వారు బరువు పెరిగే అవకాశం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో హార్వర్డ్ మెడికల్ స్కూల్‌కు చెందిన డాక్టర్ దరియుష్ మొజఫ్ఫారియన్ పాల్గొన్నారు. చక్కెర ఉండే పదార్థాలను ఎక్కువగా తీసుకోవడం వల్ల బరువు పెరుగుతారని ఆయన పేర్కొన్నారు.
- చక్కెర రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను పెంచుతుంది. దీనివల్ల మధుమేహం వచ్చే ప్రమాదం ఉంటుంది.
- చక్కెర అధికంగా తీసుకోవడం వల్ల గుండె జబ్బులు వస్తాయి.
- మహిళలు షుగర్ ఎక్కువగా తీసుకోవడం వల్ల హార్మోన్ల అసమతుల్యతకు దారితీస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల గర్భధారణలోనూ ఇబ్బందులు వస్తాయని, అధిక రక్తపోటు వంటి ఇతర సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుందని పేర్కొన్నారు.
ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్‌ను తీసుకోవద్దు!
కొంత మంది చక్కెరకు బదులుగా ఆర్టిఫిషియల్ స్వీటెనర్స్‌ను వాడుతుంటారు. అయితే, వీటిని అధికంగా వినియోగించవద్దని డబ్ల్యూహెచ్‌వో సూచిస్తోంది. ఎందుకంటే, వీటిని ఉపయోగించడం వల్ల తీపి తినాలనే కోరిక మరింతగా పెరుగుతుందట. కాబట్టి, వీటికి దూరంగా ఉండండి! అలాగే కూల్‌డ్రింక్స్, బిస్కెట్లు, చాక్లెట్లు, ప్రాసెస్‌డ్ ఆహార పదార్థాలను తినడం తగ్గించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.