Digestive Tract Problems: ప్రస్తుతం మారిన ఆహారపు అలవాట్లతో అనేక మంది ఛాతీ మంట, దీర్ఘకాల మలబద్ధకం, పేగు పూత.. వంటి జీర్ణకోశ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. అయితే, వీటిల్లో కొన్నింటికి మందులు వేసుకోవాల్సి ఉండగా.. మరికొన్నింటికి శస్త్రచికిత్స అవసరమవుతుంది. కానీ కొన్ని వ్యాధులు మాత్రం జీవనశైలి మార్పులతోనే తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఛాతీలో మంటతో బాధపడేవారు పడుకోవటానికి కనీసం 2-3 గంటల ముందే రాత్రి భోజనం చేస్తే మంచి ఫలితం కనిపిస్తుందని చెబుతున్నారు. ఈ విషయం "Eating Before Bedtime and Gastroesophageal Reflux Disease" (2018) అనే అధ్యయనంలో వెల్లడైంది. Journal of Clinical Gastroenterologyలో ప్రచురితమైన ఈ పరిశోధనలో University of Arizona College of Medicine ప్రొఫెసర్ Dr. Ronnie Fass (MD) పాల్గొన్నారు. ఒకేసారి ఎక్కువగా కాకుండా తక్కువ తక్కువగా ఎక్కువ సార్లు తినటమూ ఉపయోగపడుతుందని వివరించారు.
సరైన వేళకు సరైన పదార్థాలు
పేగుల ఆరోగ్యానికి మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందటానికి సమతులాహారం కీలకమని నిపుణులు చెబుతున్నారు. కూరగాయలు, పండ్లు, నిండు గింజ ధాన్యాలు ఎక్కువగా తినాలని అంటున్నారు. మాంసం, ప్రాసెస్డ్ ఫుడ్స్ తక్కువగా తినటం మంచిదని సూచిస్తున్నారు. ఇంకా క్యాల్షియం, విటమిన్ డి వంటి పోషకాలను అందించే పాలు, మజ్జిగ, పెరుగు వంటివీ మేలు చేస్తాయన్నారు. లాక్టోజ్ పడనివారు మాత్రం పాల పదార్థాలకు దూరంగా ఉండాలని సలహా ఇస్తున్నారు. రోజూ తగినంత పీచు లభించేలా చూసుకోవాలని.. మగవారు రోజుకు 38 గ్రాములు, ఆడవారు 25 గ్రాముల పీచు తినాలని మార్గదర్శకాలు సూచిస్తున్నాయి.
విసర్జన మార్పులపై దృష్టి
మరోవైపు మల విసర్జన తీరుతెన్నులు కూడా ఆరోగ్యం గురించి విలువైన సమాచారాన్ని ఇస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఎప్పుడో అప్పుడు నీళ్ల విరేచనాలు అవటం మామూలే అని.. కానీ తరచూ విరేచనాలు అవుతున్నా, నాలుగైదు రోజుల వరకూ తగ్గకున్నా ఏదో తేడా ఉందని అనుమానించాలంటున్నారు. ముఖ్యంగా మలంలో రక్తం పడటం, రాత్రిపూట విసర్జన కోసం మేల్కోవటం, విరేచనాలతో పాటు బరువు తగ్గటం లాంటివి సిలియక్ డిసీజ్, పేగు పూత, పేగు ఇన్‌ఫెక్షన్ వంటి సమస్యలకు సంకేతాలు కావొచ్చని పేర్కొన్నారు. అలానే విసర్జనలో మార్పులు లేకపోయినా 45 ఏళ్లు దాటాక పెద్దపేగు ముందస్తు పరీక్ష (కొలనోస్కోపీ) అవసరమని సూచిస్తున్నారు. పొగ తాగటం, యాభై ఏళ్లు పైబడటం, ఊబకాయం, ఛాతీలో మంట వంటి ముప్పు కారకాలు గలవారు కూడా అన్నవాహిక క్యాన్సర్ ముందస్తు పరీక్ష చేయించుకోవాల్సి ఉంటుందని సలహా ఇస్తున్నారు.
బద్ధకం వీడాలి
ఇవే కాకుండా శారీరకంగా చురుకుగా ఉండటం కూడా పేగు ఆరోగ్యానికి కీలకమని.. మలబద్ధకం గలవారికిది మరింత ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఎంత ఎక్కువగా శ్రమ చేస్తే అంత ఎక్కువగా పేగులు కదులుతాయని.. ఫలితంగా పెద్ద పేగు ద్వారా ఆహారం త్వరగా ముందుకు కదలటానికి వ్యాయామం తోడ్పడుతుందన్నారు. మల బద్ధకం, కాలేయ కొవ్వు తగ్గటానికే కాకుండా పేగుల్లో సూక్ష్మక్రిముల వైవిధ్యానికీ, మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందటానికీ వ్యాయామం దోహదం చేస్తుందని అనేక అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. రోజుకు అరగంట చొప్పున వారానికి మూడు రోజులు తీవ్ర వ్యాయామం చేయటం మంచిదని నిపుణుల సూచిస్తున్నారు. ఒకవేళ ఇది సాధ్యం కాకపోతే ప్రతిరోజూ అరగంట సేపు నడిచినా మంచిదేనంటున్నారు. వీలైనంత వరకూ రోజులో ఎక్కువసేపు కదిలేలా చూసుకోవటం ముఖ్యమని నిపుణులు పేర్కొన్నారు.
తగినంత నీరు తాగాలి
మన శరీరంలో సగానికి పైగా నీరు ఉంటుంది. చాలా వ్యవస్థలు నీటితోనే ముడిపడి ఉంటాయి. నీరు తగ్గితే జీర్ణక్రియ సరిగా సాగదు కాబట్టి తగినంత నీరు, ద్రవాలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇలా పీచుతో పాటు తగినంత నీరు తీసుకుంటే మరింత మంచి ఫలితం కనిపిస్తున్నట్టు కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అవసరమైన మేరకు నీళ్లు తాగితే పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్ధి చెందుతుందని అంటున్నారు. అలాగే కృత్రిమ తీపి పదార్థాలతో చేసిన పానీయాలకు దూరంగా ఉండాలని.. వీటి వల్ల పేగుల్లో బ్యాక్టీరియా సమతుల్యత దెబ్బతింటోందని అధ్యయనాలు చెబుతున్నాయి. మరీ తీయగా ఉండాలనుకుంటే తేనె వంటి సహజ పదార్థాలు ఎంచుకోవాలని సలహా ఇస్తున్నారు.
మద్యం, నొప్పి మందులు పరిమితంగా వాడాలి
మద్యం, ఎన్‌ఎస్‌ఏఐడీ రకానికి చెందిన నొప్పి మందులు పేగులకు హాని చేస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మద్యం కాలేయానికి హాని తల పెట్టటమే కాకుండా.. నేరుగా జీర్ణాశయం, పేగుల మీదా ప్రభావం చూపుతుందంటున్నారు. అతిగా మద్యం తాగిన మరుసటి రోజు చాలామంది కడుపునొప్పి, విరేచనాలతో బాధపడటం చూస్తూనే ఉంటాం. ఇటీవలి కాలంలో మద్యం అతిగా తాగినవారిలో జీర్ణాశయం ఉబ్బుతున్నట్టు ఎండోస్కోపీ పరీక్షలో కనిపిస్తోందనీ నిపుణులు అంటున్నారు. మద్యం విషయంలో ఆరోగ్యకరమైన పరిమితి అంటూ ఏదీ లేదని.. అసలు దీని జోలికి వెళ్లకపోవటం ఉత్తమమని చెబుతున్నారు. అలాగే తరచు నొప్పి మాత్రలు వేసుకుంటే జీర్ణాశయంలో, పేగుల్లో వాపు పక్రియ ప్రేరేపితమవుతుందని.. పేగుల్లో పుండ్లు పడొచ్చని వివరించారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఎక్కువ సేపు నిలబడుతున్నారా? బీపీ, గుండె జబ్బులు వస్తాయట జాగ్రత్త!!
మూత్రం స్పీడ్‌గా పోస్తున్నారా? అలా చేస్తే బ్లాడర్ పని ఖతం! ఈ టిప్స్ పాటిస్తే మూత్రాశయం హెల్దీ!!