High Cholesterol Warning Signs: హై కొలెస్ట్రాల్ సమస్య అనేది అనారోగ్యకర అలవాట్ల వల్ల వస్తుంది. ఎక్కువ కొవ్వు ఉన్న ఆహారం తీసుకోవడం, శారీరకశ్రమ లేకపోవడం, స్మోకింగ్, ఆల్కహాల్ వంటివి హై-కొలెస్ట్రాల్ సమస్యకు కారణాలు. ఈ సమస్య గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీస్తుంది. స్ట్రోక్, పెరిఫెరల్ ఆర్టరీ వ్యాధి, అనూరిజమ్స్ వంటి ప్రమాదాలు పెరుగుతాయి. అందుకే.. కొలెస్ట్రాల్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు సూచిస్తుంటారు. అయితే.. బాడీలో కొలెస్ట్రాల్ అధికంగా ఉన్నప్పుడు కొన్ని సంకేతాలు కనిపిస్తాయని.. వాటిని వెంటనే పసిగట్టాలని నిపుణులు సూచిస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో చూద్దాం.
తిమ్మిర్లు: కాళ్లు, పాదాలలో తిమ్మిరి అధిక కొలెస్ట్రాల్ సూచన కావచ్చని నిపుణులు అంటున్నారు. అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ధమనులలో ప్లేక్ ఏర్పడటానికి దారితీస్తాయని.. దీనిని అథెరోస్క్లెరోసిస్ అంటారని నిపుణులు అంటున్నారు. ఈ ప్లేక్ ధమనులను ఇరుకుగా చేసి.. రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుందని అంటున్నారు. కాళ్లు, పాదాలకు రక్త ప్రవాహం తగ్గడం వల్ల తిమ్మిరి, నొప్పి, జలదరింపు వంటి లక్షణాలు కలుగవచ్చని చెబుతున్నారు.
2018లో అమెరికన్ జర్నల్ ఆఫ్ కార్డియాలజీలో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు ఉన్న వ్యక్తులు చేతులు, కాళ్లలో తిమ్మిరిని అనుభవించే అవకాశం 50% ఎక్కువ అని కనుగొన్నారు. పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ లి. మార్టిన్, MD పాల్గొన్నారు.
కళ్లు: అధిక కొలెస్ట్రాల్ వల్ల దెబ్బతినే ప్రాంతం కళ్లు. కొలెస్ట్రాల్ అధికంగా ఉండడం వల్ల శాంథెలస్మాస్ అనే ప్రాబ్లమ్ ఏర్పడుతుంది. అంటే పసుపు రంగులో ఉన్న కొవ్వు నిల్వలు కనురెప్పల్లో వచ్చి చేరుతాయి. కళ్ల కింది చర్మం నారింజ లేదా పసుపురంగులోకి మారుతుంది. లేదా ఆ రంగుల్లో మచ్చలు కనిపిస్తాయి. ఇలా పసుపు, నారింజ, తెలుపు మచ్చలు కనిపిస్తే వైద్య పరిభాషలో దానిని ఆర్కస్ సెనైలిస్ అంటారు. శరీరంలో కొలెస్ట్రాల్ పెరిగిందనడానికి ఇవి సంకేతాలు. ఇవి కనిపిస్తే వైద్యుడిని కచ్చితంగా సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఛాతిలో నొప్పి: మీకు తరచుగా ఛాతి నొప్పి, ఛాతిలో అసౌకర్యంగా ఉంటే తేలికగా తీసుకోవద్దని నిపుణులు అంటున్నారు. ఇది అధిక కొలెస్ట్రాల్‌కు సంకేతమని అంటున్నారు. మీరు సరైన సమయంలో వైద్యుడిని కలవకపోతే... ఈ సమస్య మరింత పెరుగుతుందని చెబుతున్నారు. అలాగే ఊపిరి పీల్చుకోవడంలో కూడా ఇబ్బంది ఉన్నా హై-కొలెస్ట్రాల్ సంకేతమని నిపుణులు అంటున్నారు.
అలసట: బిజీ లైఫ్, వర్క్ ప్రెజర్ వల్ల అలసట తప్పదని అందరికీ తెలిసిన విషయమే. అయితే.. తగినంత విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా మీరు అన్ని సమయాలలో అలసిపోయినట్లు, నీరసంగా ఉన్నట్లు కనిపిస్తే తప్పనిసరిగా డాక్టర్‌ని సంప్రదించాలని అంటున్నారు. కారణం ఇది హై-కొలెస్ట్రాల్‌కు సంకేతమని చెబుతున్నారు.
అజీర్ణం: జీర్ణక్రియకు అవసరమైన రసాలను కాలేయం ఉత్పత్తి చేస్తుంది. అధిక కొలెస్ట్రాల్ కాలేయంలో పేరుకుపోవడం వల్ల కాలేయ పనితీరు దెబ్బతింటుంది. ఇది జీర్ణ కొవ్వుల సామర్థ్యాన్ని తగ్గిస్తుంది. దీని వలన ఉబ్బరం, అజీర్ణం, నొప్పి, పేగులలో మంట వంటి సంకేతాలు కనిపిస్తాయని నిపుణులు అంటున్నారు.
తలనొప్పి: అధిక కొలెస్ట్రాల్ ధమనులలో పేరుకుపోవడం వల్ల అవి ఇరుకుగా మారి మెదడుకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తాయని నిపుణులు అంటున్నారు. ఈ తగ్గిన రక్త ప్రవాహం మెదడులో నొప్పి సంకేతాలను ప్రేరేపిస్తుందని తద్వారా తలనొప్పి, మైగ్రేన్ వంటి సమస్యలకు దారితీస్తుందని అంటున్నారు.
ఏకాగ్రత లేదా జ్ఞాపకశక్తి సమస్యలు: అధిక కొలెస్ట్రాల్ ధమనులలో పేరుకుపోవడం వల్ల అవి ఇరుకుగా మారతాయి. ఇది మెదడుకు రక్త ప్రవాహాన్ని తగ్గిస్తుంది. ఈ తగ్గిన రక్త ప్రవాహం మెదడు కణాలకు ఆక్సిజన్, పోషకాలను అందించడంలో ఇబ్బంది కలిగిస్తుంది. ఇది ఏకాగ్రత, జ్ఞాపకశక్తి, అభిజ్ఞా పనితీరును దెబ్బతీస్తుందని అంటున్నారు.
పురుషులలో అంగస్తంభన: అధిక కొలెస్ట్రాల్ పురుషాంగానికి రక్త ప్రసరణ తగ్గిస్తుందని.. ఇది అంగస్తంభనకు దారితీస్తుందని నిపుణులు అంటున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.