Health Warning Signs If You Are Over 40 Years: యుక్త వయసులో ఉన్నప్పుడు ఎవరమైనా ఆరోగ్యంగా, బలంగా ఉంటాం. కానీ, వయసు పెరిగే కొద్దీ.. పురుషులు, మహిళల్లో ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతాయి. ముఖ్యంగా నలభై ఏళ్లు దాటిన తర్వాత ఆరోగ్యం(Health) విషయంలో జాగ్రత్తగా ఉండడం చాలా అవసరం. ఎందుకంటే ఈ వయసులో శరీరంలో అనేక హార్మోన్ల మార్పులు ప్రారంభమవుతాయి. అలాగే ఈ రోజుల్లో మారిన జీవనశైలి, ఆహారపు అలవాట్లు, ఒత్తిడి, సరైన నిద్ర పోకపోవడం వల్ల చిన్న వయసులోనే వివిధ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. కాబట్టి ఎవరైనా నలభై సంవత్సరాల తర్వాత ఈ లక్షణాలు కనిపిస్తే అలర్ట్ కావాలంటున్నారు ఆరోగ్య నిపుణులు.
ఊహించని బరువు తగ్గడం : మీరు ప్రయత్నించకుండానే బరువు తగ్గితే అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే అది టైప్ 2 డయాబెటిస్‌కు సంకేతం. ఇది 45-64 సంవత్సరాల మధ్య వయసు ఉన్నవారిలో ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంటుంది. అలాగే విపరీతమైన దాహం అనిపించిన అది కూడా డయాబెటిస్ సంకేతం అవ్వొచ్చు.
పొత్తికడుపు ఉబ్బరం : సాధారణంగా అప్పుడప్పుడూ కడుపు నొప్పి రావడం సహజం. కానీ, 40 ఏళ్లు దాటాక పొత్తికడుపులో ఉబ్బరంగా అనిపిస్తే మాత్రం సందేహించాల్సిందే. ఎందుకంటే ఇది అండాశయ క్యాన్సర్ ముందస్తు హెచ్చరిక సంకేతం.
వాసన కోల్పోవడం : మీరు 40 ఏళ్లు దాటిన తర్వాత ఎప్పుడైనా వాసన కోల్పోవడం వంటి లక్షణం అనిపిస్తే అప్రమత్తం కావాలి. లేదంటే అది జ్ఞాపకశక్తిని కోల్పోవడానికి దారితీస్తుంది. అలాగే ఈ లక్షణం అల్జీమర్స్, చిత్తవైకల్యం ప్రారంభ సంకేతమని మీరు గుర్తుంచుకోవాలి.
కంటిచూపు తగ్గడం : వయసు పెరిగే కొద్దీ కంటి చూపు సహజంగానే క్షీణిస్తుంది. అయితే, మీ కళ్లు ఒక్కసారిగా ఆకస్మిక మార్పులకు లోనైతే మాత్రం జాగ్రత్త పడాల్సిందే. ఎందుకంటే అది మెలనోమా ప్రారంభ సంకేతం కావొచ్చు.
వికారం : మీ వయసు నలభై దాటిన తర్వాత అప్పుడప్పుడు వికారంగా అనిపిస్తుందా? అయితే.. దీనికి అనేక కారణాలు ఉండవచ్చు. కానీ, ఇది కడుపు నొప్పి, గుండె జబ్బు తలెత్తే అవకాశం ఉందని చెప్పే హెచ్చరిక సంకేతం. కాబట్టి వికారం తరచుగా అనిపిస్తే అప్రమత్తంగా ఉండాలంటున్నారు నిపుణులు.
బరువు తగ్గాలనుకుంటున్నారా? అయితే వెయిట్ చెక్ చేసుకోవడం తప్పనిసరి!
ఆందోళన : ప్రస్తుత రోజుల్లో వయసుతో సంబంధం లేకుండా చాలా మంది ఏదో ఒక సందర్భంలో ఆందోళనకు గురవుతున్నారు. అయితే.. నలభై ఏళ్ల తర్వాత ఆందోళన మరింత ఎక్కువగా ఉంటే మాత్రం జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే అది పార్కిన్సన్స్ వ్యాధికి దారి తీయవచ్చు.
అలసట : ప్రతి ఒక్కరూ అధికంగా శ్రమించినప్పుడు లేదా తగిన నిద్ర లేనప్పుడు ఆ రోజు త్వరగా అలసటకు గురవుతుంటారు. అయితే.. ఇది వయసు పైబడిన తర్వాత దీర్ఘకాలికంగా మారినట్లయితే వెంటనే వైద్యుడిని సంప్రదించడం ఉత్తమం. ఎందుకంటే ఈ లక్షణం విటమిన్ డి లోపం లేదా గుండె జబ్బులతో కూడా ముడిపడి ఉండవచ్చు.
చేతుల్లో జలదరింపు : ఈ వయసులో మీ చేతులు జలధరింపు లేదా తిమ్మిరిని ఎదుర్కొంటుంటే.. అది కార్పల్ టన్నెల్‌కు సంకేతం కావచ్చు. 40 -70 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న చాలా మంది వ్యక్తుల్లో రోగ నిర్ధారణ ఈ వ్యాధి తేలింది.
గుండెల్లో మంట : అతిగా తినడం వల్ల గుండెల్లో మంట వస్తుంది. ఇది అన్నవాహిక క్యాన్సర్‌కు సంకేతం కావచ్చు. ఈ సమస్య 50 ఏళ్లు దాటిన వారిలో ఎక్కువగా ఉంటుంది.
ఇవేకాకుండా నలభై ఏళ్ల తర్వాత మోకాలి నొప్పి, దగ్గు, ఎర్రటి ముఖం, తల తిరగడం, మతిమరుపు, మూత్రంలో రక్తం, అంగస్తంభన లోపం, రాత్రి చెమటలు, చర్మంపై దద్దుర్లు, పుట్టమచ్చల ఆకారం లేదా రంగులో మార్పులు వంటి లక్షణాలు కనిపించినా జాగ్రత్త పడాల్సిందే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. లేదంటే అవి తీవ్ర ఆరోగ్య సమస్యలకు దారితీసే అవకాశం లేకపోలేదని హెచ్చరిస్తున్నారు.
మీ బాడీలో కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉందా? - ఇలా ఈజీగా తగ్గించుకోండి!
మీ బాడీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా! అయితే అలర్ట్ అవ్వాల్సిందే!