Health Effects of Sleeping With Lights On At Night : మనం ఆరోగ్యంగా ఉండాలంటే సరైన పోషకాహారం తీసుకోవడం ఎంత అవసరమో.. సరైన నిద్ర కూడా అంతే ముఖ్యం. మంచి నిద్ర ఉన్నప్పుడే శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అందుకే రోజూ సగటున 7 నుంచి 8 గంటల నిద్ర ఉండేలా చూసుకోవడం చాలా అవసరం. అయితే, సాధారణంగా మెజార్టీ పీపుల్ రాత్రిపూట లైట్స్ ఆఫ్ చేసి నిద్రిస్తుంటారు. కానీ, కొందరికి మాత్రం నైట్ టైమ్ లైట్స్ ఆన్ చేసి నిద్రపోయే అలవాటు ఉంటుంది. మీరూ ఇలాగే నిద్రపోతున్నారా? అయితే, అలర్ట్ కావాల్సిందే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే లైన్ ఆన్ చేసి నిద్రపోవడం వల్ల ఈ ప్రమాదకరమైన ఆరోగ్య సమస్యను ఎదుర్కోక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఆ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
డైలీ తగినంత నిద్రపోవడమే కాదు.. ఎలా నిద్ర(Sleep) పోతున్నామన్నది కూడా చాలా ముఖ్యమంటున్నారు నిపుణులు. ముఖ్యంగా నైట్ టైమ్ లైట్స్ ఆన్‌లో ఉంచి నిద్రపోవడం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిది కాదని చెబుతున్నారు. ఎందుకంటే.. రాత్రిపూట లైట్స్ ఆన్‌లో ఉంచి నిద్రపోయే వారిపై ఓ పరిశోధన జరపగా అందులో కొన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. అందులో ప్రధానంగా.. రాత్రివేళ లైట్స్ ఆఫ్ చేయకుండా వెలుతురులో నిద్రపోయే వారికి టైప్ 2 డయాబెటిస్ వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుందని రిసెర్చ్‌లో వెల్లడైంది!
2019లో "ప్రొసీడింగ్స్ ఆఫ్ ది నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్" అనే జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. రాత్రిపూట లైట్స్ వెలుతురులో నిద్రించిన వారి సర్కేడియన్ రిథమ్‌లో అంతరాయం కలిగిందని.. ఫలితంగా ఇన్సులిన్ నిరోధకత, రక్తంలో చక్కెర స్థాయిల పెరుగుదలను అనుభవించారని కనుగొన్నారు. ఈ పరిశోధనలో యూఎస్‌లోని నార్త్‌వెస్టర్న్ యూనివర్సిటీ ఫీన్‌బెర్గ్ స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో న్యూరోబయాలజీ ప్రొఫెసర్‌గా పనిచేసే డాక్టర్ ఫ్రాంజ్ జెర్కాక్ పాల్గొన్నారు.
నైట్ టైమ్ కాంతికి గురికావడం వల్ల అంతర్గత శరీర గడియారం అయిన సిర్కాడియన్ రిథమ్‌కు అంతరాయం కలుగుతుందంటున్నారు డాక్టర్ జెర్కాక్. ఇది హార్మోన్ విడుదల, జీవక్రియ, శరీర ఉష్ణోగ్రత నియంత్రణ వంటి ముఖ్యమైన విధులను ప్రభావితం చేస్తుందని చెబుతున్నారు. దీని కారణంగా ఇన్సులిన్, గ్లూకోజ్ మెటబాలిజంలో మార్పులు వస్తాయి. ఆ మార్పులు రక్తంలో చక్కెర స్థాయిలను ప్రభావితం చేసి చివరకు టైప్ 2 డయాబెటిస్‌కి(Diabetes) దారి తీస్తాయని వైద్యులు ఫ్రాంజ్ జెర్కాక్ సూచించారు. కాబట్టి, రాత్రివేళ పడుకునేటప్పుడు లైట్స్ ఆఫ్ చేసి ప్రశాంతమైన చీకటి వాతావరణంలో నిద్రించడం మంచిదని చెబుతున్నారు.
ఇంట్రస్టింగ్ : వయసు ప్రకారం - ఎవరు ఎన్ని గంటలు నిద్రపోవాలో మీకు తెలుసా?
మంచి నిద్రకోసం ఇలా చేయండి :
- నిద్రపోయే సమయానికి గంటా, రెండు గంటల ముందే భోజనం కంప్లీట్ చేయాలి. అలాగే కారం, మసాలాలు ఎక్కువగా ఉండే ఆహారానికి దూరంగా ఉండాలి.
- బెడ్రూమ్లో మసక చీకటి, పడక సౌకర్యంగా ఉండేలా చూసుకోవాలి.
- నిద్రపోవడానికి గంట ముందు సెల్‌ఫోన్లు, టీవీలు, ల్యాప్‌టాప్‌లు కట్టేయాలి. పడకగదిలో ఇలాంటి పరికరాలేవీ లేకుండా జాగ్రత్త పడాలి.
- పడుకోవటానికి ముందు కుటుంబ సభ్యులతో హాయిగా కబుర్లు చెప్పుకోవాలి.
- సాయంత్రం ఒక అరగంట చిన్నపాటి వ్యాయామం చేసిన తర్వాత గోరువెచ్చని నీటితో స్నానం చేసినా మంచి నిద్ర వస్తుంది.
- నిద్రరానప్పుడు మంచం మీద అలాగే దొర్లటం సరికాదు. లేచి కుర్చీలో కూర్చొని చక్కటి సంగీతం వినాలి. ఏదైనా మంచి పుస్తకం చదువుకోవాలి. నిద్ర వస్తున్నప్పుడే పక్క మీదికి వెళ్లి, పడుకోవడం మంచిదంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్: నైట్ సరిపడా నిద్రపోయినా - పగలు మళ్లీ నిద్ర వస్తోందా? - ఈ అనారోగ్య సమస్యలే కారణమట!