Health Benefits Of Soya Beans : మన శరీరం ఆరోగ్యంగా ఉండటంలో గుండెది అత్యంత కీలక పాత్ర. మన శరీరానికి కావాల్సిన రక్తాన్ని పంప్ చేయడంతో పాటు ఎప్పటికప్పుడు మన రక్తాన్ని శుద్ధి చేసే కీలక పనిని గుండె నిర్వర్తిస్తుంది. గుండెను పదిలంగా కాపాడుకునే బాధ్యత మన మీద ఉంది. ఎందుకంటే గుండె ఆరోగ్యంగా ఉంటే మనమూ ఆరోగ్యంగా ఉంటాము. అందుకే ఇప్పుడు చాలామంది గుండె ఆరోగ్యం మీద దృష్టిపెడుతున్నారు. గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఆహారాలతో పాటు వ్యాయామాలు చేస్తున్నారు.అయితే చాలామందికి గుండెను కాపాడే సరైన ఆహారం ఏదనే దానిపై స్పష్టత లేకుండా ఉన్నారు. గుండెకు అవసరమైన పోషకాలను బట్టి ఎలాంటి ఆహారం అయితే సరిపోతుందో తెలుస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఎలాంటి ఆహారాన్ని తీసుకోవాలో ప్రముఖ వైద్యురాలు డా.మధులిక ఆరుట్ల వివరించారు. గుండె ఆరోగ్యాన్ని భద్రంగా చూసుకునే ఆహారం ఏది, దానిని ఎంత మోతాదులో తీసుకోవాలో ఆమె వివరించారు.
గుండెను కాపాడే సోయాబీన్స్
గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఆహార పదార్థాలన్నింటిలో సోయాబీన్స్, సోయాకు సంబంధించిన పలు ఉత్పత్తులు ఉత్తమం అని డా.మధులిక ఆరుట్ల వివరిస్తున్నారు. గుండెను ఆరోగ్యంగా ఉంచేందుకు కావాల్సిన అన్ని రకాల ప్రోటీన్లు, మినరల్స్, మైక్రోన్యూట్రియంట్స్ ఇందులో ఉంటాయని ఆమె చెబుతున్నారు. సోయాబీన్స్‌లో గుండెకు కావాల్సిన ప్రోటీన్లతో పాటు అన్ని రకాల ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ ఉంటాయని అంటున్నారు. అలాగే మైక్రోన్యూట్రియంట్స్ అయిన విటమిన్లు కూడా సోయాబీన్స్ వల్ల శరీరానికి అందుతాయి. ముఖ్యంగా విటమిన్ బి కాంప్లెక్స్ కావాల్సిన మోతాదులో లభిస్తుంది. సాధారణంగా ప్రోటీన్ల కోసం పప్పులు తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తుంటారు. అయితే పప్పుల్లో కన్నా సోయాబీన్స్ ద్వారా ఎక్కువ ప్రోటీన్లు అందుతాయని డా.మధులిక ఆరుట్ల వివరిస్తున్నారు. 100గ్రాముల పప్పులు తీసుకుంటే 20గ్రాముల నుండి 22గ్రాముల ప్రోటీన్లు లభిస్తే, 100గ్రాముల సోయాబీన్స్ తీసుకుంటే దాదాపు 43గ్రాముల ప్రోటీన్లు లభిస్తాయని డా.మధులిక చెబుతున్నారు.
ఎంత మోతాదులో తీసుకోవాలంటే?
సోయా బీన్స్ గుండె ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయని తేలిపోగా ఎంత మోతాదులో తీసుకోవాలనేది తరువాతి ప్రశ్న. దీనికి సమాధానం రోజుకు 25గ్రాముల సోయాబీన్స్, సోయా ఉత్పత్తులు తీసుకుంటే గుండె ఆరోగ్యాన్ని పదిలంగా కాపాడుకోవచ్చు అని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ డా.మధులిక ఆరుట్ల తెలిపారు. ఇలా తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యాన్ని కాపాడే ఫైటోఈస్ట్రోజన్, ఐసోఫ్లేవన్స్, యాంటీఆక్సెంట్స్ శరీరానికి అందుతాయని చెబుతున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ముఖ్య గమనిక :
ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.