Health Benefits Of Having A Dog : "మిమ్మల్ని పెంచే కన్నా కుక్కల్ని పెంచుకోవడం మేలు" అని చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలతో చెప్పే డైలాగ్ ఇది. పిల్లలు ఇల్లంతా చిందరవందర చేసినప్పుడు, తిండి విషయంలో మారాం చేసినప్పుడు, చెప్పిన మాట వినకుండా అల్లరి ఎక్కువ చేసినప్పుడు అమ్మానాన్నలు పిల్లల్ని ఇలా తిడుతుంటారు. ఎందుకంటే కుక్కలు పెట్టింది తిని, విశ్వాసంగా చెప్పిన మాట వింటుంటాయి కనుక.
ఒకప్పుడు ఉమ్మడి కుటుంబాలుండేవి కాబట్టి కేవలం కాపలా కోసమే కుక్కల్ని పెంచుకునే వాళ్లు. కానీ ఇప్పుడలా కాదు కదా, చాలా మంది పప్పీలను తమ ఒంటరితనం నుంచి బయట పడటానికి, పిల్లలు లేని లోటు తీర్చుకోవడానికి పెంచుకుంటున్నారు. ముఖ్యంగా డబ్బున్న వాళ్లు వీటిని ఎక్కువ మొత్తంలోనే పెంచుకుంటున్నారు. పిల్లల కన్నా ఎక్కువ పప్పీలనే చూసుకుంటున్నారు అనడంలోనూ అతిశయోక్తి లేదు. అయితే ఇలా పెంచుకోవడం వల్ల వాటి ఓనర్లకు చాలా రకాల లాభాలు ఉన్నాయట. అవేంటంటే?
ఒంటరితనం తగ్గుతుంది
కేవలం కుక్కలు మాత్రమే అని కాదు. మీరు పెంచుకునే పెంపుడు జంతువు ఏదైనా మీ ఒంటరితనం నుంచి మిమ్మల్ని కాపాడుతుంది. అవి ఎప్పుడూ మీ వెంటే తిరుగుతూ మీ మీద ప్రేమ కురిపిస్తుంటే, మీరు దాంతో చక్కగా ముచ్చటిస్తుంటే మీలో ఒంటరితనం తాలూకా ఒత్తిడి, బాధ, నిరాశ, ఆందోళన మానసిక సమస్యలు రాకుండా ఉంటాయి.
గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది
కుక్కను పెంచుకోవడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటం ఏంటి! అని ఆశ్చర్యపోతున్నారా. అవును, కుక్కల్ని పెంచుకునే వారిలో రక్తపోటు, ఒత్తిడి లాంటి హానికరమైన సమస్యలు దూరంగా ఉంటాయనీ.. ఫలితంగా గుండె సమస్యల ప్రమాదం చాలా వరకూ తగ్గుతుందని చాలా పరిశోధనలు చెబుతున్నాయి.
నొప్పుల నుంచి ఉపశమనం
మీరు నమ్మినా నమ్మకపోయినా కూడా పప్పీని పెంచుకోవడం వల్ల మీరు చాలా రకాల నొప్పుల నుంచి ఉపశమనం పొందుతారట. దాని వెనకాలే ఎప్పుడూ చక చకా తిరుగుతూ, నడుస్తూ, ఆటలాడుతూ యాక్టివ్గా సమయాన్ని గడపడం వల్ల ఎలాంటి నొప్పులు మిమ్మల్ని ఇబ్బంది పెట్టవని పరిశోధనల్లో తేలింది. పైగా శారీరక శ్రమ కారణంగా బలంగా, ఆరోగ్యంగా తయారవడమే కాక, హాయిగా నిద్రపోవడం అలవరుచుకుంటారు.
సామాజిక ప్రయోజనాలు
నిజానికి కుక్కలు చక్కని సొషల్ క్యాటలిస్టులు. అవి వాటిని పెంచుకునే వారు కొత్త మనుషులను కలిసేందుకు, కొత్త స్నేహితులను పొందడానికి, వేరే వాళ్లతో త్వరగా కలిసిపోవడానికి చాలా బాగా దోహదపడతాయి. ఫలితంగా వాటి యజమానుల్లో సామాజిక స్పృహ పెరిగి జీవితంలో అధిక సంతృప్తి కలుగుతుంది.
పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచుతాయి
ఇంట్లో కుక్కలతో కలిసి పెరిగే పిల్లల్లో రోగనిరోధక వ్యవస్థ మెరుగ్గా పనిచేస్తుందని కొన్ని రీసెర్చులు రుజువు చేశాయి. అలాంటి పిల్లలకు భవిష్యత్తులో కూడా ఎలర్జీలు, ఇన్ఫెక్షన్లు లాంటివి ఎక్కువగా రాకుండా ఉంటాయట. అలాగే వారిలో శారీరక శ్రమ పెరిగి బలంగా, ఆరోగ్యంగా తయారవుతారు.