Health Benefits of Ginger Water: నేటి జనరేషన్లో హై-కొలెస్ట్రాల్‌తో ఇబ్బంది పడే వారి సంఖ్య క్రమక్రమంగా పెరుగుతోంది. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. అయితే.. శరీరంలో మంచి కొలెస్ట్రాల్(HDL), చెడు కొలెస్ట్రాల్(LDL) అనే రెండు రకాల కొవ్వు ఉంటుంది. వీటిలో చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే చాలా ప్రమాదం. దీనివల్ల గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడి హార్ట్ ఎటాక్, ఇతర ప్రాణాంతక సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. అందుకే చాలా మంది బాడీలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్(Cholesterol)ను తగ్గించాలని తీవ్ర కసరత్తులు చేస్తుంటారు. అయితే.. ఇలాంటి వారు ఉదయం వేళ ఈ డ్రింక్ తాగితే కొవ్వు ఈజీగా కరిగిపోతుందని చెబుతున్నారు. ఈ వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
శరీరంలోని చెడు కొవ్వు కరిగించుకోవడానికి రోజూ ఉదయం పూట అల్లం వాటర్ తాగడం వల్ల సులభంగా శరీరంలోని కొలెస్ట్రాల్ కరుగుతుందని అంటున్నారు. అల్లంలో ఉండే పోషకాలు శరీరంలో చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతాయని.. ఫలితంగా గుండె జబ్బులు, ఇతర కొలెస్ట్రాల్ సంబంధిత ఆరోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చంటున్నారు.
2018లో జర్నల్ ఆఫ్ ఫంక్షనల్ ఫుడ్స్‌లో ప్రచురితమైన అధ్యయనం ప్రకారం.. 8 వారాల పాటు రోజుకు ఓ గ్లాస్ అల్లం వాటర్ తాగిన వ్యక్తులలో LDL (చెడు) కొలెస్ట్రాల్ స్థాయిలు 6% తగ్గాయని కనుగొన్నారు. అల్లం వాటర్ HDL కొలెస్ట్రాల్, PAI-1 స్థాయిలను పెంచడంలో, ఆక్సిడేటివ్ ఒత్తిడిని తగ్గించడంలో కూడా సహాయపడుతుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఇరాన్‌లోని షిరాజ్ విశ్వవిద్యాలయంలో న్యూట్రిషన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ మొహమ్మద్ నాజర్ పాల్గొన్నారు.
వికారం తగ్గిస్తుంది : కేవలం కొలెస్ట్రాల్ కరగడం మాత్రమే కాకుండా అల్లం వాటర్ తాగడం వల్ల చాలా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. చాలా మంది మార్నింగ్ సిక్ నెస్‌తో ఇబ్బంది పడుతుంటారు. అలాంటి వారు ఉదయం లేవగానే పరగడుపున ఒక కప్పు గోరు వెచ్చని అల్లం వాటర్ తీసుకుంటే మంచి ఫలితం పొందవచ్చంటున్నారు నిపుణులు. అంతే కాదు, మోషన్ సిక్నెస్ లేదా కీమో సంబంధిత ప్రతికూల ప్రభావాలను కలిగి ఉన్నవారికి ఇది సహాయపడుతుందని చెబుతున్నారు. పురాతన కాలం నుంచి మసాలా దినుసులలో ఒకటిగా ఉన్న అల్లం, వికారం వంటి లక్షణాలను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.
కీళ్ల నొప్పులను తగ్గిస్తుంది : మీరు రోజూ పరగడుపున ఒక కప్పు అల్లం వాటర్ తీసుకోవడం కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులను సులభంగా తగ్గించుకోవచ్చు. ఎలాగంటే అల్లం శక్తివంతమైన యాంటీ-ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. దీంతో ఇది కీళ్ల నొప్పులు, కండరాల నొప్పులు, ఆర్థరైటిస్ వంటి వ్యాధులకు చికిత్స చేయడంలో సహాయపడుతుంది.
జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తుంది : NIH ప్రకారం, రోజూ మార్నింగ్ ఒక గ్లాసు అల్లం నీటిని తాగడం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అదే విధంగా గుండెల్లో మంట, వికారం, అజీర్ణం నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇది రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచుతుంది. దీనివల్ల డయాబెటీస్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉంటాయి.
చర్మం ఆరోగ్యంగా: రోజూ అల్లం వాటర్ తాగడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు అంటున్నారు. అల్లంలోని యాంటీ-ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు ముడతలు, మొటిమలు, ఇతర చర్మ సమస్యలకు చికిత్స చేయడంలో సహాయపడతాయని అంటున్నారు.
అల్లం వాటర్ తయారు చేసుకునే విధానం:
- అంగుళం అల్లం ముక్కను శుభ్రంగా కడిగి కచ్చాపచ్చగా దంచుకోవాలి.
- ఇప్పుడు స్టవ్ మీద ఒక బౌల్ పెట్టి అందులో పావు లీటర్ నీటిని మరిగించుకోవాలి.
- మరుగుతున్న నీటిలో దంచిన అల్లం వేసి 5 నిమిషాలు చిన్న మంట మీద ఉంచాలి.
- ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసి నీటిని వడకట్టి, గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆ నీటిలో కాస్తంత నిమ్మరసం, తేనె కలుపుకొని తాగొచ్చు.
- ఇలా ప్రతిరోజు ఉదయాన్నే తాగితే మంచి ఫలితాలు పొందుతారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.