Health Benefits Of Cucumber : సమ్మర్‌లో చాలా మంది కీర దోసకాయ తింటూ ఉంటారు. వీటిని తీసుకోవడం వల్ల బాడీ హైడ్రేట్‌గా ఉండటంతో పాటు ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. మరి.. ఎండాకాలంలో దోసకాయలను తినడం వల్ల మన శరీరంలో ఎటువంటి మార్పులు వస్తాయో మీకు తెలుసా? ఇప్పుడు చూద్దాం.
హైడ్రేట్‌గా ఉండేలా చేస్తుంది :
దోసకాయలను పచ్చిగా లేదా వండుకొని కూడా తినొచ్చు. వీటిని ఎలా తీసుకున్నా కూడా మన శరీరానికి పోషకాలు అందుతాయి. వీటిలో 96 శాతం వరకు నీరు ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. వేసవి కాలంలో దోసకాయ తినడం వల్ల బాడీని హైడ్రేట్‌గా ఉండేలా చూసుకోవచ్చని అంటున్నారు.
ఎముకలు బలంగా :
కీర దోసకాయలో విటమిన్ కె, క్యాల్షియం వంటివి ఎక్కువగా ఉంటాయి. వీటిని తరచూ తీసుకోవడం వల్ల ఎముకలు బలంగా ఉంటాయి. అలాగే ఎముకలు విరిగే ముప్పు తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
జీర్ణక్రియ మెరుగుపడుతుంది :
దోసకాయలో నీటి శాతం, ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను సక్రమంగా జరిగేలా చేస్తాయి. దీనిని తినడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు తగ్గుతాయి. అలాగే మలబద్ధకం సమస్యతో బాధపడేవారి వీటిని డైట్‌లో భాగం చేసుకోవడం వల్ల ప్రయోజనం ఉంటుందని నిపుణులు పేర్కొన్నారు.
బ్రెయిన్ ట్యూమర్ వ్యాధి ఉంటే - ఎలాంటి లక్షణాలు కనిపిస్తాయో తెలుసా ? - Brain Tumor Symptoms
బరువు తగ్గుతారు :
దోసకాయలో క్యాలరీలు, పిండి పదార్థాలు, చక్కెర తక్కువగా ఉంటాయి. ఇవి బరువు తగ్గేలా చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. దోసకాయలో ఉండే పీచు పదార్థం వల్ల కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దీనివల్ల తొందరగా ఆకలి వేయదు. దీంతో బరువు తగ్గే అవకాశం ఉంది. 2007లో 'న్యూట్రిషన్ రీసర్చ్ జర్నల్'లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. దోసకాయ సలాడ్ తినడం వల్ల బరువు తగ్గే అవకాశం ఉందని పరిశోధకులు గుర్తించారు. ఈ పరిశోధనలో టెక్సాస్ A&M యూనివర్సిటీకి చెందిన 'డాక్టర్ డానా డి.జాన్సన్' పాల్గొన్నారు. దోసకాయ సలాడ్ తినడం వల్ల వెయిట్‌లాస్ అయ్యే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో..
మధుమేహం వ్యాధితో బాధపడేవారికి కీర దోసకాయ ఒక మంచి ఆహారం. ఎందుకంటే దోసకాయ గ్లైసిమిక్ ఇండెక్స్ (జీఐ) తక్కువగా ఉంటుంది. అంటే బ్లడ్‌లో గ్లూకోజు నెమ్మదిగా కలిసేలా చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే దోసకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్లు మధుమేహం త్వరగా ముదరకుండా చేస్తాయి. ఇంకా షుగర్ వ్యాధితో ముంచుకొచ్చే దుష్ప్రభావాలను తగ్గిస్తాయని నిపుణులు పేర్కొన్నారు.
క్యాన్సర్ నివారణ :
దోసకాయల్లో కుకుర్‌బిటాసిన్ బి (సీయూబీ) అనే వృక్ష రసాయనం పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్ కణాలను వృద్ధి చెందకుండా నిర్మూలిస్తుందని, దోసకాయను తరచుగా తీసుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని నిపుణులంటున్నారు.
గుండె ఆరోగ్యంగా :
మన శరీరంలో సోడియం ఎక్కువైతే రక్తపోటు పెరుగుతుంది. అయితే, దోసకాయలో ఉండే పొటాషియం సోడియం ప్రభావాన్ని తగ్గిస్తూ రక్తపోటు పెరగకుండా చూస్తుంది. దోసకాయలో ఉండే పోషకాలు రక్తనాళాల్లో కొవ్వు పూడికలు ఏర్పడకుండా కాపాడతాయి. దీనివల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
నిమ్మకాయను కట్ చేసి బెడ్రూమ్లో పెడితే చాలు- అందరికీ డీప్ స్లీప్ పక్కా! - Lemon In Bedroom