Health Benefits Of Clove Oil : దంత ఆరోగ్యం విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తారు. ఉదయం నిద్ర లేచాక పళ్లు తోముకోవటంతోనే సరిపుచ్చుతుంటారు. దీంతో చాలా మంది రకరకాల దంత సమస్యలను ఎదుర్కొంటుంటారు. అందులో ప్రధానంగా చెప్పుకోవాల్సింది.. పంటి నొప్పి. దంతాల ఇన్ఫెక్షన్లు, పుచ్చిపోవడం, కొత్త దంతాలు రావడం, చిగుళ్లు ఉబ్బడం, దంతాల్లో పగుళ్లు, చిగుళ్ల వ్యాధి వల్ల పంటి నొప్పి వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఈ సమస్య తలెత్తినప్పుడు ఎదుర్కొనే బాధ వర్ణనాతీతం.
కంటికి కనిపించకుండా మనల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తుంది పంటి నొప్పి(Toothache). ఈ సమస్య తలెత్తినప్పుడు.. ఏ పనీ సక్రమంగా చేయలేం. ఏమీ తినలేం. ఏదైనా తాగడానికీ ఇబ్బంది పడాల్సి వస్తుంది. ఇది ఒక్కసారి మొదలైందంటే.. అంత సులభంగా తగ్గదు. అలాగే.. రాత్రి నిద్రపోవడం కూడా కష్టం అవుతుంది. మరి మీరు కూడా ఇలాంటి సమస్యను ఎదుర్కొంటున్నట్లయితే ఇప్పుడు చెప్పబోయే ఈ హోమ్ రెమిడీతో పంటి నొప్పికి ఈజీగా చెక్ పెట్టొచ్చంటున్నారు నిపుణులు. ఇంతకీ, ఏంటీ ఆ హోమ్ రెమిడీ? దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
పంటినొప్పికి మీ వంటింట్లో లభించే లవంగాలు దివ్య ఔషధంగా పనిచేస్తాయని చెబుతున్నారు నిపుణులు. అందుకే.. వాటితో తయారుచేసుకునే నూనె పంటినొప్పి సమస్యను తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంటున్నారు. ముఖ్యంగా లవంగాల నూనెలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఈ నూనెలో పుష్కలంగా ఉంటాయి. కాబట్టి లవంగం నూనె దంత ఆరోగ్యాన్ని మెరుగుపర్చడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు.
ముఖ్యంగా .. పంటినొప్పితో బాధపడే వారు దంత చిగుళ్ల దగ్గర లవంగం ఆయిల్‌ను రాసుకుంటే పంటి నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుందని చెబుతున్నారు. అలాగే.. దంతక్షయం సమస్య కూడా ఉండదంటున్నారు. ఎందుకంటే.. దీనిలో ఉండే యూజినాల్.. ప్రభావిత ప్రాంతాలకు రిలీఫ్ కలిగించడమే కాకుండా ఇన్ఫెక్షన్లు, బ్యాక్టీరియా పెరుగుదలను అడ్డుకుంటుందంటున్నారు. అంతేకాదు.. లవంగం నూనెలో ఉండే క్రిమిసంహారక గుణాలు దంతనొప్పి, చిగుళ్లలో పుండ్లు, నోటిపూత వంటి సమస్యలకు మంచి సహజనివారణిగా పనిచేస్తుందని చెబుతున్నారు నిపుణులు.
2017లో "Complementary Therapies in Medicine" జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. లవంగం నూనె పంటినొప్పికి సమర్థవంతమైన చికిత్సగా పనిచేస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఇరాన్‌లోని షాహిద్ బెహెష్టి యూనివర్శిటీ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌కు చెందిన ప్రముఖ డెంటిస్ట్ డాక్టర్ M. రెజా ఫరాహానీ పాల్గొన్నారు. లవంగం నూనెలో ఉండే యాంటీబాక్టీరియల్ లక్షణాలు పంటినొప్పిని తగ్గించడంలో చాలా బాగా సహాయపడతాయని ఆయన పేర్కొన్నారు.
దంతాలు ఆరోగ్యంగా ఉండాలంటే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి!
లవంగం నూనెను ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే? : మీకు అవసరమైన మొత్తంలో లవంగాలను తీసుకుని వాటిని మెత్తగా దంచుకుని ఒక గాజు పాత్రలో వేసుకోవాలి. ఆపై అవి మునిగేంత వరకు ఆలివ్ ఆయిల్ పోసి మూత పెట్టుకోవాలి. ఆపై దానిని ఒక వారం రోజులు నేరుగా సూర్యకాంతి పండేలా ఎండలో ఉంచుకోవాలి. అనంతరం దానిని వడకట్టి మరో పాత్రలో పోసుకోవాలి.
ఎలా ఉపయోగించాలంటే ?: పంటి నొప్పి ఉన్న ప్రదేశంలో దూదిని లవంగం నూనెలో ముంచి రాయడం ద్వారా నొప్పి నుంచి మంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
దంతాలు దెబ్బతిన్న తర్వాత బాధపడితే నో యూజ్ - బ్రష్ చేయడం ఎలాగో ఇప్పుడే తెలుసుకోండి!