Gastric Problem Solution In Telugu : ఈ కాలంలో చాలా మంది అజీర్తితో బాధపడుతున్నారు. ఒకప్పుడు ఈ సమస్యతో వృద్ధులు ఇబ్బంది పడేవారు. కానీ ఇప్పుడు వయసులో సంబంధం లేకుండా అనేక మందిలో ఈ సమస్యలు తలెత్తుతున్నాయి. మారిన జీవన శైలి, ఆహారపు అలవాట్లు, ఇతర కారణాల వల్ల చాలా మంది ఇబ్బందులు పడుతున్నారు. అసలీ ఉదర సంబంధ సమస్యలు ఎందుకు వస్తాయి? వీటి లక్షణాలేంటి ? ఎలా పరిష్కరించుకోవాలి? ఈ స్టోరీలో తెలుసుకుందాం.
సమయానికి భోజనం చేయకపోవడం
మనం సరైన సమయానికి ఆహారం తిననప్పుడు, కరెక్ట్ టైమ్‌కు నిద్రపోకపోతే అజీర్తి సమస్యలు తలెత్తుతాయి. అంతేకాకుండా ఏవైనా త్వరగా జీర్ణంకాని ఆహారం తీసుకుంటే అంటే స్పైసీగా ఉండేవి లేదా ఆయిల్ ఫుడ్, జంక్ ఫుడ్లు ఎక్కువగా తీసుకున్నా ఉదర సంబంధమైన సమస్యలు వస్తాయి. మానవ పేగు కండరంతో ఉండే గొట్టం. వివిధ రకాల ఒత్తిడుల వల్ల కూడా పేగుల మీద ప్రభావం పడుతుంది. అలాగే మనం తీసుకునే ఆహారాన్ని జాగ్రత్తగా గమనించాలి. ఏ రకమైన పదార్థాలు తినటం వల్ల సమస్య ఉత్పన్నమవుతుంది? ఇవన్నీ గమనిస్తే ముందే జాగ్రత్త పడవచ్చు. పేగుల్లో మంచి బ్యాక్టీరియాను పెంచడానికి కూడా మందులు ఉంటాయి. ఇవన్నీ పాటించిన తర్వాతా ఈ సమస్య కొనసాగితే గ్యాస్ట్రో ఎంటరాలజీస్ట్ను సంప్రదించాలి.
ఈ లక్షణాలు కనిపిస్తే వెంటనే డాక్టర్‌ను కలవండి
'పొట్ట ఉబ్బరం వల్ల వాంతులు కావడం, ఆకలి లేకపోవడం, బరువు తగ్గడం, మోషన్స్‌లో బ్లడ్ వస్తున్నా నిర్లక్ష్యం వహించకుండా వైద్యుల్ని సంప్రదించాలి. ఎందుకంటే ఇది కేవలం అజీర్తి సమస్యే కాకపోవచ్చు. అల్సర్, ఇతర ఏ కారణాల వల్లనైనా లేదంటే గడ్డల వల్ల కూడా ఇలా జరగొచ్చు. ఈ లక్షణాలు గమనిస్తే వీలైనంత త్వరగా డాక్టర్ దగ్గరికి వెళ్లి చూపించుకోవడం ఉత్తమం. డైట్ పాటించడం, వ్యాయామం చేయడం చాలా ముఖ్యం. రోజూ వ్యాయామం చేయాలి. వీటితో పాటు సమతుల్య ఆహారం తీసుకోవాలి. జంక్ ఫుడ్ ఎప్పుడో ఒకప్పుడు తినొచ్చు. ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.' అని గాస్ట్రో ఎంటరాలజిస్ట్ డా.నవీన్ పోలవరపు సూచించారు.
'ఆసిడ్ రిఫ్లెక్ష్ కూడా కారణం కావచ్చు'
పొట్టలో తయారయ్యే ఆమ్లాలు మనకు బయటికి వచ్చినప్పుడు దాన్ని ఆసిడ్ రిఫ్లెక్స్ అంటారు. జీవన శైలిని, ఆహారపు అలవాట్లను మార్చుకోవడం వల్ల దీన్ని తగ్గించుకోవచ్చు. స్మోకింగ్, కాఫీ, చాక్లెట్స్ ఆసిడ్ రిఫ్లెక్ట్స్ అధికం చేస్తాయి. వీటిని తక్కువగా తినటం కానీ, పూర్తిగా మానేయడం కానీ చేయాలి. తక్కువ ఫ్యాట్ ఉండి, ఎక్కువ ఫైబర్ ఉన్న పదార్థాలు ఆసిడ్ రిఫ్లెక్ట్స్ను తగ్గిస్తాయి. ముఖ్యంగా పీచు పదార్థాలు ఎక్కువగా తీసుకున్నప్పుడు రిఫ్లెక్షన్ తగ్గుతుంది. ఆహారంలో వైట్ రైస్ బ్రౌన్ రైస్ తినొచ్చు. కూరగాయల్లో కాలిప్లవర్, బ్రకోలీ, దోసకాయ, ఆకు కూరలు ఆసిడ్ రిఫ్లెక్షన్ తగ్గిస్తాయి.
'ఆరోగ్యకర జీవన విధానం అలవర్చుకోవాలి'
'ఆహార అలవాట్లలో మార్పులు చేసుకోవాలనుకున్నప్పుడు రాత్రి తిన్న వెంటనే నిద్రకు ఉపక్రమించకూడదు. ఒకవేళ అలా చేస్తే తిన్న ఆహారం అలాగే ఉండి ఆసిడ్ రిఫ్లెక్ట్ అయ్యే అవకాశముంటుంది. మాంసాహారులైతే చికెన్, ఫిష్ లాంటి వాటిల్లో ఆయిల్స్ తక్కువగా ఉపయోగించాలి. మొత్తంగా ఇలాంటి ఆహార పదార్థాల్లో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం వల్ల మందుల జోలికి పోకుండా ఆసిడ్ రిఫ్లెక్ట్ను సహజంగా తగ్గించుకోవచ్చు.' అని సర్జికల్ గాస్ట్రో ఎంటరాలజిస్టు టి.లక్ష్మీ కాంత్ సూచించారు.