Benefits of Garlic Peel : లేత పసుపు రంగులో ఘాటుగా ఉండి వంటకాలకు మంచి రుచిని అందించే వెల్లుల్లితో ఎలాంటి ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయో మనందరికీ తెలిసిందే. అందుకే మనం డైలీ చేసుకునే ప్రతి వంటలో వెల్లుల్లిని(Garlic) ఉపయోగిస్తుంటాం. ఇక నాన్వెజ్ వంటకాలలో అయితే ఇది తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే, మెజార్టీ పీపుల్ వెల్లుల్లి రెబ్బలను మాత్రమే ఉపయోగిస్తూ వాటి పొట్టును బయట పారేస్తుంటారు. కానీ, చాలా మందికి తెలియని విషయమేమిటంటే.. ఆయుర్వేదం ప్రకారం వెల్లుల్లితో పాటు వెల్లుల్లి పొట్టులో కూడా ఆరోగ్యానికి మేలు చేసే అనేక రకాల ఔషధ గుణాలు ఉన్నాయట. అంతేకాదు.. దీని వల్ల కలిగే ఆరోగ్యప్రయోజనాలు తెలిస్తే మీరు ఇకపై వెల్లుల్లి పొట్టు అసలే పడేయరంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇంతకీ, వెల్లుల్లి పొట్టుతో ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి? దాన్ని ఎలా ఉపయోగించాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి పెరుగుదల: వెల్లుల్లి మాదిరిగానే వెల్లుల్లి పొట్టులోని పోషకాలు ఆరోగ్యపరంగా చాలా బాగా సహాయపడతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని.. ఇవి శరీరానికి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టాన్ని నివారించడంలో చాలా బాగా తోడ్పడతాయంటున్నారు. అలాగే.. వివిధ రకాల ఆరోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడతాయని చెబుతున్నారు.
2014లో 'ఫుడ్ సైన్స్' అనే జర్నల్లో ప్రచురితమైన నివేదిక ప్రకారం.. వెల్లుల్లి పొట్టులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయని ఫలితంగా దాన్ని తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరానికి మంచి రక్షణ లభిస్తుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలో జియాంగ్జీ వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ జియాంగ్ యు పాల్గొన్నారు.
జీర్ణ సమస్యలకు ఔషధం: వెల్లుల్లి పొట్టులో యాంటీ మైక్రోబయల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి, ఈ వెల్లుల్లి పొట్టును టీ రూపంలో తయారు చేసుకొని తీసుకుంటే గొంతు సమస్యలు, జలుబు, ఫ్లూ, ఇతర ఇన్ఫెక్షన్స్ తగ్గుతాయంటున్నారు నిపుణులు. అలాగే.. జీర్ణసమస్యలను తగ్గించడంలో ఈ టీ చాలా బాగా సహాయపడుతుందంటున్నారు. ఈ టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే.. వెల్లుల్లి పొట్టును నీటిలో బాగా మరిగించి వడకట్టుకుంటే చాలు. కావాలంటే రుచి కోసం కొద్దిగా తేనె కూడా యాడ్ చేసుకోవచ్చు.
బాదంపప్పును తింటున్నారా? - ఇలా తింటే ఎక్కువ ఆరోగ్యప్రయోజనాలు!
గాయాలకు దివ్య ఔషధం : వెల్లుల్లి పొట్టు గాయాలను నయం చేయడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు ఆయుర్వేద నిపుణులు. ఇందుకోసం వెల్లుల్లి పొట్టును కాల్చి దాని బూడిదను తేనెతో కలిపి గాయంపై అప్లై చేస్తే.. త్వరగా గాయం మానుతుందంటున్నారు.
జుట్టు ఆరోగ్యాన్ని కాపాడుతుంది : వెల్లుల్లి తొక్కలో ఉండే పోషకాలు జుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయంటున్నారు. ఇందుకోసం వెల్లుల్లి తొక్కలతో పొడిని తయారుచేసుకొని దాన్ని నూనెతో కలిపి జుట్టుకు అప్లై చేయాలి. అలా కాసేపు ఉంచి తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేయడం వల్ల జుట్టు రాలడం తగ్గడమే కాకుండా వెంట్రుకల పెరుగుదలకు సహాయపడుతుందంటున్నారు. అలాగే వెల్లుల్లి పొట్టులో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు శరీర వాపులను తగ్గించడంలో సహాయపడతాయని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.