Frequent Urination Causes : వాతావరణం చల్లగా ఉన్నప్పుడు, వాటర్ ఎక్కువగా తాగినప్పుడు ఎక్కువసార్లు టాయిలెట్‌కి వెళ్లాల్సి రావడం సహజం. కానీ, కొందరిలో అంతా బాగానే ఉన్నా కూడా.. తరచూ మూత్రవిసర్జన వెళ్లాల్సి వస్తుంది. అయితే, ఇలా ఎక్కువ సార్లు మూత్రవిసర్జనకు వెళ్లాల్సి రావడం.. కొన్ని అనారోగ్య సమస్యలకు సంకేతం కావచ్చని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఇలాంటి వారు వైద్యులను సంప్రదించడం మంచిదని సూచిస్తున్నారు. ఏ హెల్త్ ప్రాబ్లమ్స్ వల్ల ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందో మీకు తెలుసా ? ఇప్పుడు చూద్దాం.
షుగర్ ఉందేమో..!
సాధారణంగా కొంతమందిలో వాటర్ ఎక్కువగా తాగినా, తాగకపోయినా తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. ఇలాంటి వారు ఎప్పటికప్పుడు తమ ఆరోగ్య పరిస్థితుల్ని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఎందుకంటే.. పదేపదే ఇలా మూత్రానికి వెళ్లాల్సి రావడమనేది టైప్-1, టైప్-2 డయాబెటిస్‌కు ప్రారంభ సంకేతం కావచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. కాబట్టి, ఇలాంటి సంకేతాలు కనిపిస్తే నిర్లక్ష్యం వహించకుండా అసలు షుగర్ ఉందో, లేదో ఒకసారి పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు.
కిడ్నీలో, బ్లాడర్‌లో రాళ్లు ఉంటే కూడా..
సాధారణం కంటే ఎక్కువసార్లు టాయిలెట్‌కి వెళ్లాల్సి వస్తోందంటే.. మూత్ర పిండాల్లో, బ్లాడర్‌లో రాళ్లు ఏర్పడడం వల్ల కూడా కావచ్చంటున్నారు నిపుణులు. ఇదే విషయాన్ని NIH బృందం వెల్లడించింది. (National Library of Medicine రిపోర్ట్ కోసం ఈ లింక్ క్లిక్ చేయండి). కిడ్నీలో రాళ్లు ఉండడం వల్ల కొంతమందిలో తీవ్రమైన నొప్పి ఉంటుంది.
ఇన్ఫెక్షన్ ఉంటే..
మూత్ర వ్యవస్థలో ఏర్పడే ఇన్ఫెక్షన్లు కూడా.. తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడానికి ఓ కారణం. సాధారణంగా పురుషులతో పోల్చితే ఇలాంటి ఇన్ఫెక్షన్లు మహిళల్లోనే ఎక్కువగా కనిపిస్తాయట. అయితే.. దీంతో పాటు కొందరిలో యూరిన్‌లో మంట, రక్తస్రావం కావడం.. వంటివీ జరుగుతుంటాయి.
వీరిలో సహజమే..
ప్రెగ్నెన్సీ టైమ్‌లో పదేపదే మూత్ర విసర్జనకు వెళ్లాల్సి వస్తుంటుంది. ఈ పరిస్థితి గర్భిణుల్లో సహజమే. కడుపులో పాప ఎదుగుతున్న కొద్దీ గర్భాశయం పెరిగి మూత్రాశయంపై ఒత్తిడి పడుతుంది. దీంతో సాధారణం కంటే ఎక్కువసార్లు మూత్ర విసర్జన జరుగుతుంది. కొందరిలో ఈ సమస్య పెరుగుతుంది. గర్భిణుల్లో మూత్రంలో మంట, ఇతర అసౌకర్యాలేమైనా ఉన్నట్లయితే నిర్లక్ష్యం చేయకుండా తప్పనిసరిగా వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా..
- కెఫీన్ ఎక్కువగా ఉండే డ్రింక్స్, వివిధ అనారోగ్యాల్ని తగ్గించుకోవడానికి వాడే మెడిసిన్ కారణంగా కూడా మూత్రవిసర్జన ఎక్కువగా జరుగుతుంది.
- ఉద్రేకం, ఒత్తిడి కూడా కొందరిలో అతి మూత్ర విసర్జనకు కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.
- అయితే.. తరచూ మూత్ర విసర్జనకు వెళ్లాల్సి రావడంతో పాటు.. మూత్రంలో రక్తం కనిపించడం, దుర్వాసన, అలసటగా అనిపించడం, జ్వరం, వాంతులు, పొత్తి కడుపులో నొప్పి, ఆకలి/దాహం ఒక్కసారిగా పెరిగిపోవడం, ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం.. వంటి లక్షణాలు కనిపిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా సంబంధిత వైద్య నిపుణుల్ని సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.
NOTE : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
అలర్ట్ : మీ మూత్రం దుర్వాసన వస్తోందా? - కారణం ఏంటో మీకు తెలుసా?
నైట్ టైమ్ అధిక మూత్రవిసర్జన - అది షుగర్ లక్షణం మాత్రమే కాదు మరో ప్రమాదకరమైన జబ్బుకు సంకేతం!