Foods To Avoid Gas Trouble : మధ్యాహ్నం భోజనం సమయానికి చెయ్యలేదా ఇక అంతే పొట్టలో గ్యాస్ తన్నుకు వస్తుంటుంది కొంతమందికి. దీని వల్ల వేరే ఏ పని మీద దృష్టిసారించలేకపోవడం మాత్రమే కాదు రకరకాల ఇబ్బందులు తలెత్తుతుంటాయి. ఆఫీసులో పని చేసే వాళ్ల దగ్గరి నుంచి ఖాళీగా ఇంట్లో కూర్చునే వాళ్ల వరకు చాలా మందికి ఇలాంటి గ్యాస్ సమస్య తలెత్తుతూ ఉంటుంది. అసలు గ్యాస్ సమస్య ఎందుకు వస్తుంది? దానిని ఎలా నియంత్రించాలో ఇక్కడ తెలుసుకుందాం.
గ్యాస్ సమస్యకు కారణాలు ఏంటి?
పొట్టలో గ్యాస్ సమస్యకు అనేక కారణాలు ఉన్నట్లు ప్రముఖ డైటీషియన్ డాక్టర్ శ్రీలత వెల్లడించారు. చాలామంది వేగంగా తినడం వల్ల ఇలాంటి సమస్య ఏర్పడే అవకాశం ఉందని వివరిస్తున్నారు. వేగంగా నమలడం వల్ల ఆహారం నోటిలో సరిగ్గా ముక్కలు కాదు, ఫలితంగా జీర్ణాశయంలోకి ఆహారం చేరిన తర్వాత గ్యాస్ సమస్య తలెత్తుతుందని అంటున్నారు. అలాగే కొంతమంది ఆహారాన్ని పెద్ద పెద్ద ముద్దలుగా తింటూ ఉండటాన్ని మనం గమనించవచ్చు. ఇలా తినే వారిలో కూడా గ్యాస్ సమస్య తలెత్తుతుంది. నోటిని ఎక్కువగా తెరిచి పెద్ద ముద్దలను నోట్లోకి తోసే క్రమంలో గ్యాస్ బయట నుంచి లోపలకు వెళుతుందని, ఫలితంగా గ్యాస్ సమస్య తలెత్తుతుందని అంటున్నారు. దీనిని వైద్యపరంగా ఎరోఫీజియా అని పిలుస్తారని డాక్టర్ శ్రీలత వివరించారు.
కొంతమందికి ఏదైనా ద్రవ పదార్థాన్ని తీసుకోవాలంటే స్ట్రా వేసుకొని తాగుతుంటారు. దీని వల్ల కూడా పొట్టలోకి గ్యాస్ చేరి, సమస్యకు కారణం అవుతుంది. ఇక మనలో చాలామందికి బిర్యానీ లాంటి హెవీ ఫుడ్స్ తీసుకున్న తర్వాత కార్బోనేటెడ్ బెవరేజెస్ అయిన కూల్ డ్రింక్స్ తాగడం అలవాటుగా ఉంటుంది. దీని వల్ల కూడా పొట్టలో గ్యాస్ సమస్య తలెత్తుతుందని వైద్యులు చెబుతున్నారు.
అలాగే చాలామంది సమయానికి తినకుండా తాత్సారం చేస్తుంటారు. జీర్ణాశయంలో విడుదల అవ్వాల్సిన వివిధ రకాల రసాయనాలు ఆహారం లేకపోయినా విడుదల అవడం వల్ల గ్యాస్ ఏర్పడుతుందని వైద్యులు వివరిస్తున్నారు. ఇక కొంతమందికి చింతపండు లాంటి పులపు పదార్థాలు తింటే గ్యాస్ ఉత్పన్నమవుతుంటుంది. అలాగే కందిపప్పు, శనగ పప్పు, పెసరపప్పు లాంటివి తింటే కూడా పొట్టలో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది.
కేవలం మనం తినే ఆహారం వల్లే కాదు, కొన్నిసార్లు ఎక్కువ ఒత్తిడికి లోనైతే కూడా పొట్టలో గ్యాస్ ఉత్పత్తి అవుతుంది. అలాగే ప్రాసెస్ చేసిన ఆహారాలు ఎక్కువగా తిన్నా, నమలకుండా ఆహారాన్ని తీసుకున్నా ఈ సమస్య తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఆహారాన్ని 16 నుంచి 32 సార్లు నమిలి తినడం ఉత్తమం అని, భోజనానికి అరగంట సమయాన్ని కేటాయించి, బాగా నమిలి తినడం మంచిదని వైద్యులు సలహా ఇస్తున్నారు.
పొట్టలో గ్యాస్ ని ఎలా నియంత్రించాలంటే
ఆహారాన్ని సరైన సమయంలో తీసుకోవడం వల్ల చాలా వరకు పొట్టలో గ్యాస్ సమస్యకు చెక్ పెడుతుంది. అలాగే ఆహారాన్ని బాగా నమిలి తినడం వల్ల కూడా మంచి మేలు కలుగుతుంది. ప్రాసెస్ చేసిన ఆహారాలను తగ్గించడం, పుల్లటి ఆహారాలను, ఎక్కువ మసాలాలు కలిగిన వాటిని, ఎక్కువ ఫ్రై చేసిన ఆహారాలను తినడం మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అలాగే పప్పులను నేరుగా కాకుండా ఇతర ఆహార పదార్థాలతో కలిపి తీసుకుంటే ఒంటికి మంచిది అంటున్నారు. అలాగే పప్పుల్లో వెల్లుల్లి లేదా ఇంగువ వాడటం వల్ల మండే స్వభావం చాలా వరకు తగ్గుతుందని అంటున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ముఖ్య గమనిక : ఈ వెబ్సైట్లో మీకు అందించిన ఆరోగ్య సమాచారం, వైద్య చిట్కాలు, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.