Magnesium Deficiency Symptoms : మనం ఆరోగ్యంగా ఉండాలంటే సమతుల ఆహారంతో పాటు సరైన నిద్ర కూడా అవసరమే. అందుకే డైలీ రాత్రి కనీసం 7 నుంచి 9 గంటలు నిద్ర ఉండేలా చూసుకోమని చెప్తుంటారు. అయితే కొద్ది మందికి ఇలా పడుకోగానే అలా నిద్ర పట్టేస్తుంది. మరికొందరికి మాత్రం నిద్ర ఓ పట్టాన రాదు. పడుకుందామని ఎంత ట్రై చేసినా నిద్ర వాళ్ల నుంచి దూరం అవుతుంది. అయితే ఇలా నైట్ టైమ్ లో నిద్ర పట్టకపోవడానికి ఫోన్ ఎక్కువగా చూడటమో, ఒత్తిడి, ఆందోళన వంటి ఎన్నో కారణాలు ఉంటాయి. అయితే ఇవే కాకుండా రాత్రుళ్లు నిద్రపట్టకపోవడానికి మన శరీరంలో మెగ్నీషియం లోపించడం కూడా ఒక కారణమని మీకు తెలుసా ? అవును.. మెగ్నీషియం లోపంతో బాధపడే మెజారిటీ జనాలకు రాత్రి సరిగ్గా నిద్ర పట్టదని నిపుణులు చెబుతున్నారు. మరి ఈ లోపాన్ని అధిగమించడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం.
మెగ్నీషియం లోపం ఉన్నవారిలో కనిపించే లక్షణాలు :
- ఈ ఖనిజం లోపించిన వారిలో కండరాల తిమ్మిర్లు, నొప్పులు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరికి అలసటతో పాటు, బలహీనంగా ఉన్నట్లు అనిపిస్తుంది.
- మెగ్నీషియం లోపం ఉన్నవారు నిద్రలేమితో బాధపడే అవకాశం ఎక్కువగా ఉంది. 2018లో "PLOS One" జర్నల్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం.. మెగ్నీషియం లోపం ఉన్న వ్యక్తులు నిద్రలేమితో బాధపడే అవకాశం 56 శాతం ఎక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఈ పరిశోధనలో చైనాలోని షాంఘై జియాటాంగ్ విశ్వవిద్యాలయం డాక్టర్. Xian-Biao Li పాల్గొన్నారు. మెగ్నీషియం లోపం ఉన్న వారికి రాత్రిపూట నిద్ర సరిగ్గా పట్టదని ఆయన పేర్కొన్నారు.
- మెగ్నీషియం లోపం వల్ల మైగ్రేన్లు, తలనొప్పి వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు.
- మెగ్నీషియం లోపిస్తే హృదయ స్పందనలో తేడాలు వస్తాయి. గుండె సాధారణ వేగం కంటే ఎక్కువగా కొట్టుకుంటుందని నిపుణులు చెబుతున్నారు.
మెగ్నీషియం లోపాన్ని అధిగమించడానికి ఈ ఆహారం తీసుకోండి :
గింజలు : నట్స్‌లో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిల్లో ప్రొటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, పీచు పదార్థాలతో పాటు మెగ్నీషియం వంటి ఖనిజాలు దండిగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. దాదాపు 30 గ్రాముల బాదంలో 80 మి.గ్రా., జీడిపప్పులో 72 మి.గ్రా., వేరుశనగలలో 49 మి.గ్రా., గుమ్మడి గింజలలో 150 మి.గ్రా. మెగ్నీషియం లభిస్తుందని అంటున్నారు. చెంచాడు అవిసె గింజలు తీసుకుంటే 40 మి.గ్రా. మెగ్నీషియం అందినట్టేనని పేర్కొన్నారు. అరకప్పు మొక్కజొన్న గింజలు తింటే 27 మి.గ్రా. లభిస్తుందట.
నెలరోజుల పాటు డైలీ నట్స్ తింటే - మీ శరీరంలో జరిగే మార్పులివే! - Benefits of Eating Nuts Daily
పప్పులు : కంది, పెసర, శనగ, మినప వంటి పప్పు దినుసులలో మెగ్నీషియం అధికంగా ఉంటుంది. అరకప్పు ఉడికించిన శనగలతో 60 మి.గ్రా., అనపగింజలతో 40 మి.గ్రా. మెగ్నీషియం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పాలు, పెరుగు : పాలు, పెరుగులలో కాల్షియంతో పాటు, మెగ్నీషియం కూడా ఎక్కువగా ఉంటుంది. ఒక కప్పు పాలలో 27 మి.గ్రా., పావు కిలో పెరుగులో 42 మి.గ్రా. మెగ్నీషియం ఉంటుందని నిపుణులంటున్నారు.
కూరగాయలు, ఆకు కూరలు : ముదురు రంగు ఆకు కూరల్లో మెగ్నీషియం ఎక్కువగా ఉంటుంది. అరకప్పు ఉడికించిన పాలకూరలో 78 మి.గ్రా. మెగ్నీషియం లభిస్తుంది. ఇంకా కూరగాయల్లో చూస్తే అరకప్పు బఠానీల్లో 31 మి.గ్రా., బంగాళా దుంపల్లో 48 మి.గ్రా మెగ్నీషియం ఉంటుంది.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీకు పైనాపిల్ అంటే ఇష్టమా? వేసవి కాలంలో తింటే ఏం జరుగుతుందో తెలుసా ? - Health Benefits Of Pineapple