Bone Density Exercises : రోజూ అరగంట వ్యాయామం చేయడం వల్ల ఆరోగ్యంగా, చురుకుగా ఉండవచ్చని నిపుణులు చెబుతుంటారు. అలాగే ఎక్సర్సైజ్లు చేయడం వల్ల అధిక రక్తపోటు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు రాకుండా జాగ్రత్త పడవచ్చని తెలిపారు. దీంతోపాటు వ్యాయామం చేయడం వల్ల ఎముకలకు సంబంధించిన వ్యాధులు కూడా రాకుండా చూసుకోవచ్చని వెల్లడించారు. ఎముకలు బలహీనంగా ఉంటే వయసుపైబడిన తర్వాత వచ్చే బోలు ఎముకల వ్యాధి (ఆస్టియోపోరోసిస్) (National Library of Medicine రిపోర్ట్) ప్రమాదం కూడా తగ్గుతుందట. ఈ వ్యాధి వల్ల ఎముకలు పెళుసుగా మారి విరిగిపోతాయని నిపుణులు చెబుతున్నారు. అయితే, పిల్లలు, పెద్దలు ఇలా ఏ వయసు వారైనా సరే వ్యాయామం చేయడం వల్ల ఎముకలను ఆరోగ్యంగా, బలంగా ఉంచుకోవచ్చని సూచిస్తున్నారు.
వ్యాయామం చేయడం వల్ల కలిగే లాభాలు
- కండరాలు ఆరోగ్యంగా ఉంటాయి.
- పిల్లల్లో ఎముకలు బలంగా తయారవుతాయి.
- ఎముకలు విరిగిపోకుండా కాపాడుకోవచ్చు.
- బోలు ఎముకల వ్యాధిని నివారించవచ్చు.
2019లో 'జర్నల్ ఆఫ్ ఆర్థోపెడిక్ రీసెర్చ్'లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. వేగంగా నడవడం వల్ల మెనోపాజ్ దాటిన మహిళల్లో ఎముకల సాంద్రత పెరిగినట్లు గుర్తించారు. దీంతోపాటు తుంటి ఎముక విరిగే ప్రమాదం కూడా తక్కువగా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో షాంఘై యూనివర్సిటీ ఆఫ్ స్పోర్ట్‌లోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్పోర్ట్స్ మెడిసిన్‌కు చెందిన 'డాక్టర్ Zhao R' పాల్గొన్నారు.
ఎముకలు ఆరోగ్యంగా ఉండటానికి ఏ వ్యాయామాలు చేస్తే మంచిది ?
- చిన్న బరువులు ఎత్తడం
- వేగంగా నడవడం (గంటకు 5 నుంచి 7 కిలోమీటర్లు)
- జాగింగ్ లేదా రన్నింగ్
- టెన్నిస్, బ్యాడ్మింటన్, పింగ్ పాంగ్, పికిల్‌బాల్ వంటి ఆటలు.
- మెట్లు ఎక్కడం
- డాన్స్
- పుషప్స్ లేదా పుల్అప్స్
ఎముకలు ఆరోగ్యంగా ఉండాలంటే ఎంతసేపు వ్యాయామం చేయాలి?
- U.S. డిపార్ట్‌మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ హ్యూమన్ సర్వీసెస్ ప్రకారం, పెద్దలు వారానికి కనీసం 150 నిమిషాలు (2.5 గంటలు) చెమట వచ్చేలా మితమైన వ్యాయామం చేయాలి. లేదా వారానికి కనీసం 75 నిమిషాలు తీవ్రమైన వ్యాయామం చేస్తే మంచిదని సూచిస్తున్నారు.
- వృద్ధులు వారానికి 150 నిమిషాలు వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే ఆరోగ్యంగా ఉండవచ్చు.
- గర్భిణీలు, ప్రసవానంతరం మహిళలు వారానికి 150 నిమిషాలు మితమైన వ్యాయామం చేయాలి. ఇలా వ్యాయామం చేసే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.
- దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు వారానికి కనీసం 150-300 నిమిషాలు మితమైన వ్యాయామం చేయాలి. లేదా వారానికి 75 నుంచి 150 నిమిషాలు తీవ్రమైన వ్యాయామం చేయాలి.
- చిన్న పిల్లలు (3 నుంచి 5 సంవత్సరాల వయస్సు) శారీరకంగా ఆరోగ్యంగా ఉండడానికి ఆటలు ఆడుకునేలా ప్రోత్సహించాలి.
- పిల్లల (6 నుంచి 17 సంవత్సరాల వయస్సు) ఎముకలు ఆరోగ్యంగా ఉండడానికి డైలీ కనీసం గంట సేపు వ్యాయామం చేయాలి. లేదా వారానికి 3 రోజులు ఎముకలను దృఢంగా మార్చే వ్యాయామాలు చేయాలి.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఇవి కూడా చదవండి :
ఈ ఆహార పదార్థాలను ఎక్కువగా తింటున్నారా? - మీ ఎముకలు బలహీనంగా మారడం పక్కా!