Electronic Toys Affect Childrens Health : ఆటబొమ్మలు.. చిన్నారుల నేస్తాలు అని చెప్పుకోవచ్చు. వారి ముందు బొమ్మలు ఉన్నాయంటే చాలు.. గంటల తరబడి వాటితో కాలక్షేపం చేస్తూ గడిపేస్తుంటారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులూ ఏదైనా పుణ్యక్షేత్రానికి, జాతరకు వెళ్లినప్పుడు వారికి నచ్చిన బొమ్మలనూ ఇప్పిస్తుంటారు. అందులోనూ బ్యాటరీతో నడిచే బొమ్మలంటే ఇంకెంతో ఇష్టపడతారు బుజ్జాయిలు. దాంతో పేరెంట్స్ కూడా వాటిని ఇప్పిస్తుంటారు. మీరూ పిల్లలకు బయటకు వెళ్లినప్పుడు ఎలక్ట్రానిక్ బొమ్మలను(Toys) కొనిస్తున్నారా? అయితే, మీ చేజేతులా వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నట్లే అని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకో తెలియాలంటే మీరు ఈ స్టోరీ చదవాల్సిందే.
బ్యాటరీలతో ముప్పు : సాధారణంగా ఎలక్ట్రానిక్ బొమ్మలు తయారుచేసేటప్పుడు వాటిల్లో బ్యాటరీలు అమర్చుతుంటారు. అయితే, చిన్నారులకు వాళ్లు ఆడుకునే బొమ్మలను నోట్లో పెట్టుకునే అలవాటు ఎక్కువగా ఉంటుంది. అదే టైమ్‌లో బ్యాటరీలు నోట్లో పెట్టుకుంటే ఆరోగ్యానికి హాని కలిగిస్తాయంటున్నారు నిపుణులు. ఎందుకంటే వాటిలో కెమికల్స్ ఉంటాయి. కాబట్టి, పిల్లలకు వీలైనంత వరకు ఎలక్ట్రానిక్ బొమ్మలు కొనిపించకపోవడం మంచిది అంటున్నారు.
క్రియేటివిటీని దెబ్బతీస్తాయి : ఎలక్ట్రానిక్ బొమ్మలు చిన్నారుల ఆలోచనా శక్తిని దెబ్బతీస్తుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఇలాంటి బొమ్మలు నార్మల్‌గా రిమోట్, బటన్ సాయంతో పనిచేస్తాయి. ప్రెస్ చేయగానే ఆ బొమ్మలు వాటంతట అవే ముందుకు(ఉదాహరణకు రిమోట్ కారు) కదులుతుంటాయి. అదే నార్మల్ కారు బొమ్మను ఇప్పించినట్లయితే దానిని వారే నేలపై తోసుకుంటూ ఆడుకుంటారు. దాంతో వారి ఆలోచనా శక్తి పెరుగుతుందంటున్నారు.
మీ పిల్లలు కార్టూన్లు చూస్తున్నారా? పేరెంట్స్‌గా మీరు ఈ విషయాలు తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్!
బిహేవియర్లో ఇబ్బంది : మామూలు బొమ్మల కంటే పిల్లలు ఎలక్ట్రానికి బొమ్మలను ఎక్కువగా ఇష్టపడతారు. అదే.. చిన్నారులకు ఏదైనా ఎలక్ట్రానిక్ బొమ్మ గనుక నచ్చితే దానితోనే ఎక్కువ కాలక్షేపం చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. దాంతో ఇంట్లో వారితో మాట్లాడడం, గడపడం మానేస్తారంటున్నారు నిపుణులు. దీని కారణంగా పిల్లల బిహేవియర్లో ఇబ్బందులు తలెత్తుతాయని సూచిస్తున్నారు.
నాణ్యతలేని వస్తువులు : కొన్ని రకాల ఎలక్ట్రానిక్ టాయ్స్ తయారీలో నాణ్యత లేని వస్తువులు ఉపయోగిస్తుంటారు. అంతేకాకుండా అధిక స్థాయిలో రసాయనాలు, భారీ మెటల్‌ను యూజ్ చేస్తుంటారు. ఈ కారణంగా వాటిపై రసాయనాలు శరీరంలోకి వెళ్లి చిన్నారుల పాలిట శాపంగా మారే ప్రమాదముందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చర్మ వ్యాధుల ముప్పు : ఎలక్ట్రానిక్ బొమ్మల తయారీలో వాడే పదార్థాలు పిల్లల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వాటిలో వాడే కొన్ని లోహాల కారణంగా కొంతమంది చిన్నారుల్లో చర్మ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉందని సూచిస్తున్నారు.
2022లో 'ఎన్విరాన్‌మెంటల్ హెల్త్ పర్‌స్పెక్టివ్స్ జర్నల్'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. ఎలక్ట్రానిక్ బొమ్మలలో ఉపయోగించే కొన్ని రకాల లోహాలు పిల్లల్లో చర్మం చికాకు, అలర్జీ ప్రతిచర్యలకు కారణమవుతాయని కనుగొన్నారు. ఈ పరిశోధనలో కెనడాలోని పబ్లిక్ హెల్త్ స్కూల్‌కు చెందిన ప్రముఖ పర్యావరణ ఆరోగ్య శాస్త్రవేత్త అండ్ టాక్సికాలజిస్ట్ డాక్టర్ డేవిడ్ డోర్న్ పాల్గొన్నారు. ఎలక్ట్రానిక్ టాయ్స్‌లో ఉండే కొన్ని లోహాలు పిల్లల్లో చర్మ సమస్యలను కలిగించే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు.
కంటి ఆరోగ్యంపై ప్రభావం : ఈరోజుల్లో చాలా మంది పిల్లలు ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్‌కు బాగా అలవాటు పడిపోయారు. అయితే, చిన్న పిల్లలు వీడియో గేమ్స్ వంటి స్క్రీన్ డిస్ప్లే ఉన్న వాటిని వాడడం చాలా ప్రమాదకరమంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ఎక్కువ సమయం స్క్రీన్ చూడడం వల్ల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని సూచిస్తున్నారు.
చూశారుగా.. ఎలక్ట్రానిక్ బొమ్మలతో ఎన్ని అనర్థాలో! కాబట్టి, వీలైనంత వరకు పిల్లలకు ఎలక్ట్రానిక్ టాయ్స్ కొనిపించకపోవడం మంచిది అంటున్నారు నిపుణులు. వాటికి బదులుగా చెక్క బొమ్మలు ఇప్పించడం బెటర్. అలాగే.. పజిల్ బొమ్మలు, జ్ఞాపక శక్తి పెంచే మెమొరీ టాయ్స్ వంటివి చిన్నారులకు ఇవ్వడం ఉత్తమమని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ పిల్లలు చీటికి మాటికి ఏడుస్తున్నారా? పేరెంట్స్‌గా మీరు ఈ పనులు చేయాల్సిందే!