Home Remedies For Removal Head Lice : తలలో పేలు.. ఇది చూడడానికి, వినడానికి చిన్న సమస్యే అయినా తెగ ఇబ్బంది పెడుతుంటుంది. పెద్దలు, చిన్న పిల్లలు అనే తేడా లేకుండా ఈ సమస్యను ఎదుర్కొంటుంటారు. ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తోంది. ఎందుకంటే.. వారు స్కూల్‌కి వెళ్లినప్పుడు, బయట ఆడుకుంటున్నప్పుడు స్నేహితులతో దగ్గరగా ఉంటారు కాబట్టి, ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాపిస్తాయి. ఇవి తలపై గాయం చేసి రక్తాన్ని ఆహారంగా తీసుకుంటాయి. దాంతో తలపై దురద సమస్య వేధిస్తోంది. కొన్ని సార్లు ఆ దురద ఎక్కువగా ఉన్నప్పుడు చాలా చికాకుగా అనిపిస్తోంది. అయితే.. మీరు, మీ పిల్లలు కూడా తలలో పేల సమస్యతో ఇబ్బందిపడుతున్నట్లయితే ఓసారి ఈ నేచురల్ హోమ్ రెమిడీస్ ట్రై చేసి చూడండి. వెంటనే ఆ సమస్య నుంచి బిగ్ రిలీఫ్ లభిస్తుందంటున్నారు నిపుణులు. మరి, అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
కొబ్బరినూనె, వేప గింజలు : తలలో పేల సమస్యను తగ్గించడంలో ఈ హోమ్ రెమిడీ చాలా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం.. ముందుగా కప్పు వేప గింజలు, పావు లీటరు కొబ్బరి నూనె(Coconut Oil) తీసుకోవాలి. ఆ తర్వాత ఒక బౌల్లో కొబ్బరినూనెను తీసుకొని స్టౌపై సన్నని మంట మీద 15 నుంచి 20 నిమిషాలు వేడి చేసుకోవాలి. ఆపై నూనెను దించి.. అది వేడిగా ఉన్నప్పుడే అందులో వేప గింజలు వేసి వారం రోజుల పాటు కదపకుండా అలాగే ఉంచుకోవాలి. ఇలా చేయడం వల్ల నూనె చేదెక్కుతుంది.
ఆ తర్వాత ఈ నూనెను తలకు అప్లై చేసి.. గంటసేపు ఉంచి ఆపై మామూలు షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికోసారి చేస్తుండాలి. ఫలితంగా నాలుగు నుంచి ఐదు వారాల్లోనే తలలో పేలు పూర్తిగా తగ్గుముఖం పడతాయని చెబుతున్నారు నిపుణులు. అయితే దీన్ని ఉపయోగించినన్ని రోజులు వేప గింజలను నూనెలో అలాగే ఉంచాలే తప్ప వడకట్టకూడదనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. తద్వారా వేప గింజల్లో ఉండే చేదు గుణం వల్ల పేలు పోవడంతో పాటు.. కుదుళ్లలో ఏవైనా ఇన్ఫెక్షన్లు ఉంటే అవి కూడా తగ్గుముఖం పడతాయని సూచిస్తున్నారు. ఈ నూనెను ఒకసారి తయారుచేసుకుంటే ఆరు నెలల వరకు ఉపయోగించుకోవచ్చు.
చుండ్రు సమస్య ఎంతకీ తగ్గట్లేదా? - బిర్యానీ ఆకులతో ఇలా చేస్తే మళ్లీ ఆ ప్రాబ్లమే ఉండదు!
2012లో 'Journal of Ethnopharmacology'లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. కొబ్బరి నూనె, వేప గింజల మిశ్రమాన్ని ఉపయోగించిన వారి తలలో పేల సంఖ్య గణనీయంగా తగ్గినట్లు కనుగొన్నారు. ఈ పరిశోధనలో చెన్నైలోని SRM మెడికల్ కళాశాలకు చెందిన డెర్మటాలజిస్ట్ డాక్టర్ K.R. రాజేంద్రన్ పాల్గొన్నారు. వేప గింజలు, కొబ్బరినూనె మిశ్రమం పేల సమస్యను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందని ఆయన పేర్కొన్నారు.
వాసెలిన్, కర్పూరం పొడి : ఇది కూడా పేల సమస్యను తగ్గించడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ఇందుకోసం ఒక బౌల్లో ఒక స్పూన్ వాసెలిన్, రెండు కర్పూరం బిళ్లల పొడి వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఆపై దాన్ని తలకు అప్లై చేసి.. 30 నిమిషాల తర్వాత తేలికపాటి షాంపూతో తలస్నానం చేయాలి. అలాగే ఆ తర్వాత చనిపోయిన పేలు, గుడ్లన్నింటినీ తొలగించడానికి పేల దువ్వెనతో దువ్వితే అవన్నీ బయటకు వచ్చేస్తాయంటున్నారు నిపుణులు. ఇలా వారానికోసారి చేస్తే కొద్ది రోజుల్లో ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందంటున్నారు. అంతేకాదు.. ఈ మిశ్రమాన్ని తలకు పట్టించడం వల్ల చుండ్రు, దురద వంటి సమస్యలు ఏమైనా ఉంటే అవి కూడా తొలగిపోతాయని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం.
జుట్టు బాగా రాలుతోందా? - ఎరువు వేయాల్సింది నెత్తిన కాదు - పొట్టలో!