Easy Methods To Find Out Adulterated Milk : మనం తాగే పాలు స్వచ్ఛమైనవేనా అనేది తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే, ప్రసుత్త రోజుల్లో కొందరు అడ్డదారుల్లో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో పాలను కల్తీ చేస్తున్నారు. యూరియా, కాస్టిక్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్, డిటర్జెంట్లు, బోరిక్ యాసిడ్, అమోనియం సల్ఫేట్, ఫార్మాలిన్ వంటి కెమికల్స్‌ను పాల కల్తీకి యూజ్ చేస్తుంటారు. అంతేకాదు.. పాలలో కార్బోహైడ్రేట్ కంటెంట్, సాంద్రత పెంచడానికి స్టార్చ్, టేబుల్ షుగర్ వంటివి కలుపుతుంటారు.
ఇలాంటి పాలను తీసుకోవడం ద్వారా ఫుడ్ పాయిజనింగ్, జీర్ణకోశ సమస్యలు, గుండె సమస్యలు, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీసే ఛాన్స్ ఉంటుందంటున్నారు నిపుణులు. కాబట్టి, మీరు వాడే పాలు(Milk) మంచివేనా? లేదా? అనేది ఓసారి పరిశీలించుకొని వాడుకోవడం మంచిదంటున్నారు. అయితే, అందుకోసం మీరు ఎక్కడికో వెళ్లాల్సిన పనిలేదు. ఇంట్లోనే ఈజీగా ఈ టిప్స్‌తో కల్తీ పాలను గుర్తించొచ్చు! అవేంటో ఈ స్టోరీలో తెలుసుకుందాం.
- మీరు తాగే పాలు కల్తీవా? స్వచ్ఛమైనవా? అనేది వేడి చేయడం ద్వారా సులువుగా తెలుసుకోవచ్చంటున్నారు బెంగళూరు ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు. పాలను వేడి చేస్తున్నప్పుడు అవి ఆవిరయ్యే తీరు ఆధారంగా వాటిలో ఎంతవరకు నీళ్లు లేదా యూరియా కలిసిందో ఈజీగా గుర్తించవచ్చని చెబుతున్నారు.
- అదెలాగంటే.. మీరు నాణ్యమైన పాలను వేడి చేస్తున్నట్లయితే పాల మధ్యలో బుడగలా వస్తుంది. అలాగే అక్కడే మరుగుతున్నట్లుగా కనిపిస్తుందంటున్నారు. అదే.. మీరు కల్తీ పాలను వేడి చేస్తున్నట్లయితే.. ఈ ప్రక్రియ అనేది స్థిరంగా ఉండదనే విషయాన్ని గమనించాలి. మిల్క్ హీట్ చేస్తున్న పాత్ర అంచుల వరకు పాలు మరుగుతాయి. అయితే, ఇది పాలల్లో వాటర్ ఎంత కలిపారనే దాన్ని బట్టి మారుతూ ఉంటుంది.
- మీరు తాగే పాలు యూరియాతో కల్తీ అయ్యి ఉంటే ఆ పాలు ఆవిరి కావంటున్నారు శాస్త్రవేత్తలు. అలాగే.. పాత్ర అంచుకు చుక్కల్లా అంటుకుంటుందనే విషయం గుర్తుంచుకోవాలని చెబుతున్నారు.
- ఈ ప్రక్రియ ద్వారా.. మీరు పాలల్లో 30 శాతం కంటే ఎక్కువ నీరు కలిపినా.. 0.4 శాతం యూరియా కలిసినా సులువుగా గుర్తించవచ్చంటున్నారు ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు.
అలర్ట్ : మీకు ఈ ఆరోగ్య సమస్యలుంటే - పాలు అస్సలు తాగొద్దు!
- పాలలో డిటర్జెంట్ కలిసిందో లేదో సింపుల్‌గా ఇలా తెలుసుకోవచ్చు. ఎలాగంటే.. ఒక బౌల్లో పాలను తీసుకొని బాగా అటూఇటూ కదిలించినప్పుడు నురగ వస్తే అందులో డిటర్జెంట్ కలిసి ఉన్నట్లు భావించాలంటున్నారు నిపుణులు.
- పాలలో గ్లూకోజ్ లేదా ఇన్వర్ట్ షుగర్ ఉంటే.. ఇలా ఈజీగా గుర్తించవచ్చంటున్నారు నిపుణులు. అందుకోసం డయాసెట్రిక్ స్ట్రిప్ తీసుకొని పాలలో ముంచి తీయండి. అప్పుడు అది రంగు మారితే ఆ మిల్క్‌లో గ్లూకోజ్ ఉందని అంచనా రావొచ్చంటున్నారు.
- పాలలో స్టార్చ్ కలిసిందో లేదో ఎలా తెలుసుకోవాలంటే.. ముందుగా కొన్ని పాలను తీసుకొని అందులో కొంత అయోడిన్ ద్రావణాన్ని కలపాలి. అప్పుడు అవి నీలి రంగులోకి మారితే ఆ పాలలో స్టార్చ్ ఉన్నట్లు భావించాలంటున్నారు నిపుణులు.
- అదే.. మీరు తాగే పాలలో సోడియం క్లోరైడ్ ఉందా లేదా? అన్నది గుర్తించాలంటే.. చిన్న బౌల్లో కొన్ని పాలను తీసుకొని దానిలో కొద్దిగా పొటాషియం క్రోమేట్, సిల్వర్ నైట్రేట్ కలపాలి. అప్పుడు పసుపు రంగు కనిపిస్తే.. అవి కల్తీ అయినట్టు గుర్తించాలని చెబుతున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఛాయ్ ఎంత సేపు మరిగిస్తున్నారు? - అంతకు మించితే ఆరోగ్యానికి ముప్పు తప్పదు!