Dos And Don'ts For A Good Sleep : ఈ రోజుల్లో వయస్సుతో సంబంధం లేకుండా, చాలా మంది ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య నిద్రలేమి. అందుకే చాలా మంది రాత్రిపూట నిద్ర మాత్రలు తీసుకుంటూ ఉంటారు. కానీ ఇది ఏ మాత్రం మంచిది కాదు. వాస్తవానికి కంటికి కునుకు లేకుంటే శారీరకంగా, మానసికంగా చాలా ఇబ్బందులు తలెత్తుతాయి. ఈ సమస్యను అధిగమించాలంటే, మన జీవన శైలి, ఆహారపు అలవాట్లలో కొన్ని కీలక మార్పులు చేసుకోవాలి. వీటితోపాటు పడుకునే సమయంలో కొన్ని ప్రత్యేకమైన జాగ్రత్తలు పాటించాలి. అప్పుడే నిద్రలేమి సమస్యలను పూర్తిగా అధిగమించవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అందుకే ఈ ఆర్టికల్లో నిద్రలేమి సమస్యను పరిష్కరించే, మంచి చిట్కాలను తెలుసుకుందాం.
- సరైన సమయానికి నిద్రపోవాలి:
రోజూ ఒకే సమయానికి పడుకోవటం అలవాటు చేసుకోవాలి. దీని మన శరీరంలోని నిద్ర, మెలకువ చక్రం సర్దుకుంటుంది. నిద్రపోయే సమయం కాగానే, శరీరం విశ్రాంతి కోరుతుంది. - ఆహారపు అలవాట్లు కడుపు నిండా తిన్న తర్వాత గానీ, ఆకలితో ఉన్నప్పుడు గానీ పడుకోకూడదు. దీని వల్ల సరిగా నిద్రపట్టదు. అదే విధంగా పడుకునే ముందు నీరు ఎక్కువగా తాగినా, నిద్ర మధ్యలో లేవాల్సి వస్తుంది. అంతేకాకుండా నిద్రకు ముందు సిగరెట్లు, కాఫీ, టీ జోలికి అసలే వెళ్లకూడదు.
- నిద్రకు సన్నద్ధం కావాలి. రోజు పడుకునే ముందు పుస్తకం చదవటం, పాటలు వినటం, స్నానం చేయటం లాంటి అలవాట్లను చేసుకుంటే, శరీరం త్వరగా నిద్రలోకి జారుకుంటుంది. పడుకునే ముందు సెల్ ఫోన్, టీవీ చూడటం లాంటివి మానేయాలి.
- పడక గదిని శుభ్రంగా ఉంచుకోవాలి. మంచి సౌకర్యవంతమైన మంచం, పరుపు ఏర్పాటు చేసుకోవాలి. అప్పుడే ప్రశాంతంగా నిద్ర పడుతుంది.
- పగటి నిద్ర వద్దు. పగటిపూట పడుకోవటం వల్ల రాత్రి పూట నిద్రపట్టదు. ఒకవేళ పగటిపూట విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చినా, కేవలం 10-30 నిమిషాలకంటే ఎక్కువ సేపు నిద్రపోకూడదు.
- రోజూ వ్యాయామం చేయటం వల్ల సమయానికి నిద్రపడుతుంది. అయితే పడుకునే ముందు మాత్రం వ్యాయామం చేయకూడదు.
- పని ఒత్తిడి, మానసిక ఒత్తిడిలు ఉంటే సరిగ్గా నిద్రపట్టదు. కనుక వీలైనంత వరకు మీపై ఉన్న ఒత్తిడిలను తగ్గించుకునే ప్రయత్నం చేయాలి. అప్పుడే మంచి నిద్ర పడుతుంది. చూశారుగా! ఈ చిట్కాలను పాటించడం ద్వారా నిద్రలేమి సమస్యను జయించి మంచి ఆరోగ్యాన్ని మీ సొంతం చేసుకోండి.
ఉపవాసంతో ముసలితనం వెనకడుగు - ఈ లింక్ మీకు తెలుసా!
చల్లటి పాలు- ఎసిడిటీకి తిరుగులేని మందు! ఇలాంటి మరో 6 చిట్కాలు మీకోసం!