Does Wearing Glasses Worsen Eyesight: మానవ జీవితంలో కళ్లు చాలా ప్రధానమైనవి. మనం ఏ పని చేయాలన్నా కంటి చూపు చాలా కీలకం. మరి ఇంతటి ముఖ్యమైన చూపును ప్రసాదించే కళ్లను సరిగా కాపాడుకుంటున్నారా? ముఖ్యంగా కళ్ల గురించి, కంటి చూపును దెబ్బతీసే అంశాల గురించి చాలామందికి సరైన అవగాహనే ఉండటం లేదని నిపుణులు ఆవేదన్ వ్యక్తం చేస్తున్నారు. కళ్లద్దాలు వాడితే అలవాటు అవుతుందని.. వాడకపోతే చూపు తగ్గిపోతుందని అనుకుంటారు. ఇలా చాలా మంది రకరకాల అపోహలు నమ్ముతున్నారు. ఈ నేపథ్యంలోనే అసలు వీటిల్లో నిజమెంతో ఓసారి ఇప్పుడు తెలుసుకుందాం.
- కళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో క్యారెట్లు మంచిగా ఉపయోగపడతాయని ప్రముఖ పోషకాహార నిపుణులు డాక్టర్ శ్రీలత చెబుతున్నారు. ఇందులోని విటమిన్ ఎ కంటి ఆరోగ్యానికి తోడ్పడుతుందని తెలిపారు. ఒక్క క్యారెట్‌లోనే కాకుండా.. పాలు, ఛీజ్, గుడ్డులోని పచ్చసొన వంటి వాటిల్లోనూ విటమిన్ ఎ ఉంటుందని వివరించారు. అలాగే తాజా పండ్లు, ఆకుకూరల్లోనూ విటమిన్ ఏ పుష్కలంగా ఉంటుందని.. విటమిన్ సి, విటమిన్ ఇ వంటి యాంటీఆక్సిడెంట్లు సైతం పెద్దమొత్తంలో ఉంటాయన్నారు. ఇవి వయసుతో పాటు దాడిచేసే శుక్లాలు, రెటీనా మధ్యభాగం క్షీణించటం (మాక్యులర్ డీజెనరేషన్) వంటి సమస్యల బారినపడకుండానూ రక్షిస్తాయని అంటున్నారు.
- మనలో చాలా మంది తక్కువ వెలుతురులో చదువుకుంటే చూపు తగ్గిపోతుందని అనుకుంటుంటారు. అయితే, ఇది నిజం కాదని.. మసక వెలుతురులో చదివితే కళ్లు చాలా త్వరగా అలసిసోతాయని నిపుణులు వివరించారు. కాబట్టి పుస్తకం మీద నేరుగా వెలుతురు పడేలా లైటును పెట్టుకొని చదువుకోవటం మంచి పద్ధతని చెబుతున్నారు.
- కళ్లద్దాలు లేదా కాంటాక్ట్ లెన్సులను రోజంతా పెట్టుకోవటం ఆరోగ్యానికి మంచిది కాదని.. తద్వారా కళ్లు వాటికి అలవాటు పడిపోతాయని చాలా మంది అనుకుంటారు. అయితే, ఇందులో ఏమాత్రం నిజం లేదని నిపుణులు తేల్చి చెప్పారు. హ్రస్వ దృష్టి లేదా దూర దృష్టి.. సమస్య ఏదైనా డాక్టర్లు సిఫారసు చేసిన కళ్లద్దాలు లేదా లెన్సులు తప్పకుండా వాడుకోవాలని సూచిస్తున్నారు. సాధారణంగా వయసు మీద పడటం, జబ్బుల మూలంగానో కంటి అద్దాల పవర్ మారుతుంటుందని.. అప్పుడు కొత్త అద్దాలు తీసుకోవాల్సి వస్తుందన్నారు. అంతే తప్ప కళ్లద్దాలు, లెన్సులతో చూపు తగ్గటం, కళ్లు దెబ్బతినటం వంటి ముప్పులేవీ ఉండవని వివరించారు. పైగా అద్దాలు పెట్టుకోకపోతే కళ్లు ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందని అంటున్నారు.
- అదేపనిగా కంప్యూటర్ వైపు చూడటం కళ్లకు హానికరమని కొందరు అనుకుంటారు. ఫలితంగా కళ్లు అలసిపోవటం, ఒత్తిడికి లోనవటం సహజమే గానీ.. చూపేమీ దెబ్బతినదని నిపుణులు చెబుతున్నారు. అయితే ఎక్కువసేపు కంప్యూటర్ ముందు కూర్చోవాల్సి వస్తే మాత్రం.. మధ్య మధ్యలో కాసేపు విరామం తీసుకోవటం మంచిదని సూచిస్తున్నారు. అలాగే తరచుగా కంటి రెప్పలను ఆడిస్తుండడం వల్ల కళ్లు పొడిబారకుండా చూసుకోవచ్చని సలహా ఇస్తున్నారు.
- కంటి వ్యాయామాలు చేస్తే చాలు.. కళ్లద్దాలు ధరించాల్సిన అవసరం తప్పుతుందని కొందరు భావిస్తుంటుంటారు. ఈ కంటి వ్యాయామాలతో కంటి కండరాలు బలోపేతం కావొచ్చేమో గానీ తగ్గిపోయిన చూపు తిరిగి మామూలు స్థితికి రాదని చెబుతున్నారు. కంటి ఆకృతి, కంటి కణజాలం వంటివి కంటి వ్యాయామాలతో మారిపోవని వివరించారు.
- ఒకసారి సైట్ వస్తే ఇక చూపు తగ్గటాన్ని ఆపలేమని మరికొందరు చెబుతుంటారు. చూపు మసకబారటం, కంటి నొప్పి, మిరుమిట్లు గొలిపే కాంతులు మెరవటం వంటి లక్షణాలు కనబడితే వెంటనే డాక్టర్üను సంప్రదించడం మంచిదని నిపుణులు అంటున్నారు. అందుకు ముందుగా కారణాన్ని గుర్తిస్తే తగు చికిత్సలతో సరి చేయొచ్చని.. ఫలితంగా కనీసం చూపు తగ్గటాన్నయినా నెమ్మదింపజేయొచ్చని వివరించారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
మీ కంటి చూపు తగ్గిపోతుందా? ఇలా చేస్తే సైట్ ఈజీగా పోతుందట! మీరు ట్రై చేయండి
షుగర్ పేషెంట్స్ రోజు ఎంత నీరు తాగితే మంచిది? తలనొప్పికి వాటర్‌తో చెక్!