Treatment For Dementia : చాలా ఇళ్లలో పెద్దవాళ్లు.. చెప్పిన విషయమే మళ్లీ మళ్లీ చెప్తారు. చేసిన పనే ఇంకోసారి చేస్తుంటారు. భోజనం చేసిన కాసేపటి తర్వాత.. తిన్న సంగతే మర్చిపోతారు. గతానికి సంబంధించిన చాలా విషయాలు గుర్తు చేసుకోలేరు. మతిమరుపుతో ఇబ్బంది పడతారు.. పక్కవాళ్లనూ ఇబ్బంది పెడతారు. ఇది చూసిన వాళ్లు "చాదస్తం" పెరిగిపోయిందని విసుక్కుంటారు. ఇదంతా వయసుతోపాటు వచ్చే ప్రవర్తనగా భావిస్తారు. క్రమంగా వారిని పట్టించుకోవడం మానేస్తారు. కానీ.. నిజం ఏమంటే అది మానసికంగా తలెత్తే ఓ సమస్య. వైద్య పరిభాషలో దాన్ని "డిమెన్షియా" అంటారు. ఈ విషయాన్ని సాధ్యమైనంత త్వరగా గుర్తించి.. చికిత్స అందిస్తే పూర్తిగా కోలుకొని, మామూలు మనిషులు అయ్యే అవకాశం ఉందని చెబుతున్నారు వైద్యులు. చెప్పడమే కాదు.. 73 ఏళ్ల వృద్ధుడికి చికిత్స అందించి డిమెన్షియా నుంచి విముక్తి కల్పించారు హైదరాబాద్ కామినేని ఆసుపత్రి డాక్టర్లు!
డిమెన్షియా లక్షణాలు..
డిమెన్షియా చాలా రకాలుగా ఉంటుంది. కొందరిలో మతిమరుపు సమస్య మాత్రమే ఉంటే.. ఇంకొందరిలో మూత్రంపై నియంతణ ఉండదు. మరికొందరు మామూలు కన్నా చాలా వేగంగా నడుస్తుంటారు. ఇంకొందరు చాలా స్లోగా నడుస్తారు. దూర ప్రాంతాల్లో ఉన్న తమవారితోపాటు వారి ఊరు, పేరు గుర్తుండవు. ఇలా రకరకాల సమస్యలతో బాధపడుతుంటారు. ఈ విషయాన్ని వారసులు త్వరగా గుర్తించి, వెంటనే సరైన చికిత్స అందించాలని నిపుణులు సూచిస్తున్నారు.
విశాఖ వాసికి చికిత్స...
ఏపీలోని విశాఖపట్నానికి చెందిన శంకర్రావు వయసు 73 ఏళ్లు. గత ఆర్నెల్లుగా ఆయన డిమెన్షియాతో అవస్థలు పడుతున్నారు. ఆయనకు మూత్రంపై నియంత్రణ లేదు. మామూలుగా నడిచేదాని కంటే చాలా నెమ్మదిగా నడుస్తున్నారు. అంతేకాకుండా.. రోజూ చేసే పనుల్లో చాలా వరకు ఆయనకు గుర్తుండేవి కావు. దీంతో వారసులు హైదరాబాద్ ఎల్బీనగర్ లోని కామినేని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన పరిస్థితిని గుర్తించి.. తగిన చికిత్స అందించడంతో మళ్లీ సాధారణ వైద్యం గడుపుతున్నారని వైద్యులు తెలిపారు.
"విశాఖపట్నానికి చెందిన శంకర్రావును పరీక్షిస్తే.. మెదడులో నీరు చేరినట్లు తేలింది. ఇలా చేరిన నీరు మెదడుపై ఒత్తిడి పెంచుతుంది. దీనివల్ల డిమెన్షియా వస్తుంది. ఇలాంటి డిమెన్షియాను చిన్న ఆపరేషన్ పద్ధతులతో నయం చేయవచ్చు. శంకర్రావుకు వరుసగా 3 రోజులపాటు వెన్నెముక నుంచి నీరు తొలగించాం. దానివల్ల మెదడులో చేరిన నీరు తగ్గిపోయింది. ఆ తర్వాత బ్రెయిన్లో ఒక స్టెంట్ వేశాం. దాన్నుంచి మెదడులోని నీరు క్రమంగా పొట్టలోకి వచ్చి బయటకు వెళ్లిపోతుంది. ఇలా నీరు తీసిన నిమిషం నుంచే శంకర్రావు పరిస్థితి పూర్తిగా మారింది. ఆయన మళ్లీ సాధారణ జీవితం గడుపుతున్నారు." - రమేష్, కన్సల్టెంట్ న్యూరో సర్జన్, కామినేని ఆసుపత్రి
అబ్జర్వ్ చేయండి..
ఒక వయసు దాటిన తర్వాత దాదాపుగా అందరిలోనూ ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి. అయితే.. శారీరక సమస్యలు వేరు, మానసిక సమస్యలు వేరు. ఇలా.. డిమెన్షియా లక్షణాలతో బాధపడేవారిని వెంటనే గుర్తించాల్సిన అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. వారికి సకాలంలో తగిన చికిత్స అందిస్తే.. మళ్లీ మన మధ్య మామూలుగా జీవనం సాగిస్తారని, ఈ విషయం కుటుంబ సభ్యులు గుర్తించాలని వైద్యులు సూచిస్తున్నారు.