Benefits Of Soaked Coriander Water : వంటకాల రుచిని పెంచడం కోసం అందరూ వివిధరకాల సుగంధ ద్రవ్యాలను వాడుతుంటారు. అందులో ధనియాలు ఒకటి. ఇక మాంసాహార వంటకాల్లో అయితే ధనియాల పొడి తప్పనిసరిగా ఉండాల్సిందే. అయితే, ధనియాలు వంటలకు మంచి రుచిని, సువాసనను అందించడం మాత్రమే కాదు.. అవి ఆరోగ్యానికీ ఎంతో మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. ముఖ్యంగా.. మీరు రోజూ ఒక కప్పు నానబెట్టిన ధనియాల వాటర్ తీసుకోవడం ద్వారా బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చంటున్నారు. ఇంతకీ, నానబెట్టిన ధనియాల(Coriander) నీరు తాగడం వల్ల ఎలాంటి హెల్త్ బెనిఫిట్స్ లభిస్తాయి? ఈ వాటర్‌ను ఎలా ప్రిపేర్ చేసుకోవాలి? అనే వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
రోగనిరోధక శక్తి బూస్టర్ : మీరు రోజూ నానబెట్టిన ధనియాల వాటర్ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తికి మంచి బూస్టర్‌లా పనిచేస్తుందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. ధనియాలలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో ఫ్రీ రాడికల్స్ కణాలను దెబ్బతినకుండా కాపాడడమే కాకుండా రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో సహాయపడుతాయంటున్నారు ఫలితంగా వివిధ ఇన్ఫెక్షన్లు, వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని చెబుతున్నారు.
జుట్టును బలపరుస్తుంది : ధనియాలలో విటమిన్ కె, సి, ఎ పుష్కలంగా ఉంటాయి. ఈ విటమిన్లు జుట్టును బలోపేతం చేయడానికి చాలా అవసరం. కాబట్టి, మీరు డైలీ ఒక గ్లాసు నానబెట్టిన ధనియాల వాటర్ తాగడం జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో చాలా బాగా సహాయపడుతుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. జుట్టు రాలడం, చిట్లడం వంటి సమస్యలను తగిస్తుందంటున్నారు.
కొత్తిమీరతో ప్రయోజనాలెన్నో.. తెలిస్తే తినకుండా అసలు వదలరు!
జీర్ణ వ్యవస్థకు మేలు : మీరు రోజూ ఉదయం ఒక గ్లాసు నానబెట్టిన ధనియాల నీళ్లు తాగడం వల్ల జీవక్రియ మెరుగుపడుతుంది. ఫలితంగా జీర్ణశక్తి పెరిగి జీర్ణవ్యవస్థకు మేలు జరుగుతుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. బరువు తగ్గడానికి కూడా సహాయపడుతుందని చెబుతున్నారు.
2018లో 'ఫుడ్ ఫంక్షన్' జర్నల్‌లో ప్రచురితమైన ఒక నివేదిక ప్రకారం.. నానబెట్టిన ధనియాల నీరు జీర్ణ రసాల ఉత్పత్తిని పెంచడంలో, జీర్ణ సమస్యల లక్షణాలను తగ్గించడంలో చాలా ప్రభావవంతంగా ఉంటుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో ఇరాన్‌లోని షిరాజ్ విశ్వవిద్యాలయానికి చెందిన ప్రముఖ పోషకాహార నిపుణుడు డాక్టర్ మెహ్ది అబ్బాసి పాల్గొన్నారు. రోజూ నానబెట్టిన ధనియాల వాటర్ తాగడం వల్ల ఉబ్బరం, మలబద్ధకం, అజీర్ణం వంటి జీర్ణ సమస్యలను చాలా వరకు తగ్గించుకోవచ్చని ఆయన పేర్కొన్నారు.
రక్తంలో చక్కెర నియంత్రణ : నానబెట్టిన ధనియాల నీటిని క్రమం తప్పకుండా తీసుకోవడం రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుందంటున్నారు నిపుణులు. ముఖ్యంగా ఇది డయాబెటిక్ పేషెంట్లు తమ బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను కంట్రోల్లో ఉంచుకోవడానికి చాలా బాగా యూజ్ అవుతుందని చెబుతున్నారు.
కిడ్నీల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది : రోజూ ఒక గ్లాస్ నానబెట్టిన ధనియాల వాటర్ తీసుకోవడం కిడ్నీల సామర్థ్యాన్ని మెరుగుపరుస్తుందంటున్నారు నిపుణులు. అంతేకాదు.. ఈ పానీయం మూత్ర నాళాల ఇన్ఫెక్షన్లకు వ్యతిరేకంగా పోరాడటానికి సహాయపడుతుందంటున్నారు.
ఇవే కాకుండా..
- ఈ పానీయం శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచి డీహైడ్రేషన్ ప్రాబ్లమ్ తలెత్తకుండా కాపాడుతుందని చెబుతున్నారు.
- శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపుతుందని సూచిస్తున్నారు. ధనియాలలో ఉండే ఐరన్ ఫంగస్‌తో పోరాడటానికి సహాయపడుతుంది.
- అదేవిధంగా ఈ పానీయంలో ఉండే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు.. మొటిమలను తగ్గించి, మృదువైన చర్మాన్ని సొంతం చేసుకోవడానికి ఉపయోగపడుతాయంటున్నారు నిపుణులు.
ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే? : ముందుగా ఒక టేబుల్ స్పూన్ ధనియాల గింజల తీసుకొని ఒక కప్పు తాగునీటిలో రాత్రి పడుకునే ముందు నానబెట్టుకోవాలి. నెక్ట్ డే మార్నింగ్ ధనియాల గింజలను వడకట్టుకొని ఆ వాటర్ తీసుకోవాలని చెబుతున్నారు నిపుణులు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
అలర్ట్: షుగర్ పేషెంట్స్ పైనాపిల్ తినొచ్చా? - నిపుణుల సమాధానమిదే!