Childhood Habits Affect Adult Life : బాల్యం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఎంతో విలువైనది. అయితే.. చిన్నతనంలో చేసే కొన్ని చిన్న చిన్న తప్పులే.. మనకు భవిష్యత్తులోనూ సమస్యలు తీసుకువస్తాయని హెచ్చరిస్తున్నారు నిపుణులు! మరి.. పిల్లలు చాలా సాధారణంగా చేసే తప్పులు ఏవి? వాటి వల్ల ఫ్యూచర్‌లో ఎలాంటి ఇబ్బందులు కలుగుతాయి? అనే విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ముక్కులో వేలు పెట్టడం..
చిన్న పిల్లలు ముక్కులో వేలు పెట్టుకోవడం సహజం. కానీ.. ఇలా చేయడం వల్ల ముక్కులోని బ్యాక్టీరియా శరీరంలోకి చేరుతుంది. తద్వారా.. సాధారణ పిల్లలతో పోలిస్తే ముక్కులో వేలు పెట్టుకునే వారు 51 శాతం అస్వస్థతకు గురయ్యే ప్రమాదం ఉందట. 2006లో పరిశోధకులు ముక్కులో వేలు పెట్టుకునే అలవాటు ఉన్న 324 మంది పిల్లలపై పరిశోధన నిర్వహించారు. అప్పుడు ఈ లక్షణాలు కనిపించాయని వెల్లడించారు.
ఎక్కువగా టీవీ చూడటం..
సెరిబ్రల్ కార్టెక్స్ జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. ఎక్కువగా టీవీ చూసే పిల్లలు తక్కువ వెర్బల్ IQ స్కోర్‌లను కలిగి ఉంటారట.
చక్కెర ఎక్కువగా ఉండే జ్యూస్‌లు, కూల్ డ్రింక్స్‌తో..
చిన్నప్పుడు ఎక్కువగా షుగర్ ఉండే పండ్ల రసాలు, కూల్‌డ్రింక్స్ తాగడం వల్ల వారు భవిష్యత్తులో బరువు పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉందని నిపుణులు చెబుతున్నారు.
బొటనవేలు నోట్లో పెట్టుకోవడం..
చిన్నపిల్లలు తరచూ నోట్లో బొటనవేలును పెట్టుకోవడం వల్ల వారి దంతాల అమరిక, దవడలపై.. ఆ ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
గోళ్లు కొరకడం..
ఈ అలవాటు చిన్నపిల్లలతోపాటు పెద్ద వారిలో కూడా ఉంటుంది. దీనివల్ల దంతాలు దెబ్బతినడంతోపాటు, గోళ్ల చుట్టూ ఉండే కణజాలం డ్యామేజ్ అయి, ఇన్ఫెక్షన్లు ఏర్పడతాయట.
బొమ్మలు నమలడం..
సాధారణంగా చిన్నపిల్లలకు ఏదైనా బొమ్మను ఇస్తే వారు నోట్లో పెట్టుకుని చప్పరించడం వంటిది చేస్తారు. ఇలా చేయడం వల్ల బొమ్మల తయారీలో ఉపయోగించే ఎన్నో రకాల విషపదార్థాలు వారికి అనారోగ్యాన్ని కలుగజేస్తాయని అంటున్నారు. బొమ్మలను నోట్లో పెట్టుకోకుండా చూసుకోవాలని సూచిస్తున్నారు.
టూత్ పేస్టు మింగడం..
కొంత మంది పిల్లలు బ్రష్ చేసేటప్పుడు టూత్‌పేస్ట్‌ను మింగుతుంటారు. ఇందులో ఫ్లోరైడ్ ఉంటుంది. ఇది దీర్ఘకాలికంగా కొనసాగితే భవిష్యత్తులో వారి శరీరంలో మెగ్నీషియం, కాల్షియం స్థాయులు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.
ఎక్కువ బరువుండే బ్యాగుతో ఇబ్బందే..
చిన్నప్పుడు ఎక్కువ బరువుండే బ్యాగును దీర్ఘకాలికంగా మోసినవారిలో.. పెద్దైన తరవాత వెన్నునొప్పి రావడానికి ఎక్కువగా అవకాశం ఉందని 2004లో జరిగిన ఓ అధ్యయనం వెల్లడించింది. కాబట్టి, మీ పిల్లలు రైస్ బ్యాగ్ వంటి సంచిని మోస్తుంటే ఒకసారి ఆలోచించాల్సిందే అంటున్నారు నిపుణులు.
లైట్ ఆన్ చేసి నిద్రపోవడం..
కొంతమంది పిల్లలు చీకటిగా ఉండే గదిలో నిద్రపోవడానికి భయపడతారు. ఇలాంటి వారికి తల్లిదండ్రులు బెడ్‌లైట్ వంటిది ఏర్పాటు చేస్తారు. ఇది కొంత వయస్సు వచ్చే వరకు మంచిదే కానీ, పెద్దగా అయిన తరవాత కూడా బెడ్‌లైట్‌ను ఉపయోగిస్తున్న వారిలో డిప్రెషన్‌కు గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని 2018 అధ్యయనం తెలిపింది.
పిల్లలతో ఉన్నప్పుడు తల్లిదండ్రులు సిగరెట్ తాగడం..
మీరు పిల్లలతో కలిసున్నప్పుడు సిగరెట్ వంటివి తాగుతుంటే ఒకసారి ఆలోచించాల్సిందే అంటున్నారు నిపుణులు. లేకపోతే వారు కూడా మీలా సిగరెట్ తాగడానికి రెండు రెట్లు అవకాశాలు ఎక్కువగా ఉన్నాయట. ఇది 13 నుంచి 21 సంవత్సరాల మధ్య జరగవచ్చట.
కోపంతో గోడలను గుద్దుతూ, బ్లేడుతో చేతులు కట్ చేసుకుంటున్నారా?
అలర్ట్ : ఈ ఆహార పదార్థాలు తింటున్నారా? - అయితే స్ట్రెస్ పెరగడం ఖాయం!