Chest Pain While Walking: ప్రస్తుతం మారుతున్న జీవనశైలి వల్ల అధిక రక్త పోటు సమస్య ఎక్కువగా ప్రబలుతోంది. దీనిని అదుపులో పెట్టుకునేందుకు అనేక రకాల మందులు వాడుతుంటారు. కానీ, కొంతమందికి బీపీ నార్మల్గానే ఉన్నా.. నడుస్తుంటే గుండె వద్ద ఒత్తిడి పెరిగి, ఛాతీ బరువుగా ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంకా కొందరిలో తల తిరిగినట్లుగా కూడా ఉంటుంది. ఫలితంగా ఎక్కువ వ్యాయామాలు చేయలేక బరువు పెరుగుతుంటారు. మరి ఇలాంటి సమస్యకు కారణాలు ఏంటి? దీని పరిష్కారానికి ఎలాంటి చికిత్స మార్గాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం.
"రక్తపోటు నియంత్రణలోనే ఉంటూ నడుస్తున్నప్పుడు తల తిరగటమనేది పెద్ద సమస్య కాకపోవచ్చు. వయసు పెరిగే కొద్దీ ఇలాంటి మార్పులు కనిపిస్తుంటాయి. అయితే, ఇది మందులతో తేలికగానే తగ్గుతుంది. కానీ గుండె వద్ద ఒత్తిడి ఏర్పడటాన్ని తేలికగా తీసుకోకూడదు. గుండె రక్తనాళాల్లో పూడికలు ఉన్న సమయంలోనే గుండెపై ఒత్తిడి పడినట్టు, ఛాతీ బరువుగా ఉన్నట్టు అనిపిస్తుంటుంది. కాబట్టి ఇలాంటి లక్షణాలు గమనిస్తే వెంటనే గుండె నిపుణులను సంప్రదించటం మంచిది. వైద్యులు నిశితంగా పరిశీలించి, అవసరమైతే యాంజియోగ్రామ్ పరీక్ష చేస్తారు. ఈ పరీక్షతో పూడికలు ఉన్నవీ, లేనిదీ తెలుస్తుంది. దీంతో పాటు ఇంకా మధుమేహం, కొలెస్ట్రాల్ మోతాదులనూ పరీక్షించుకోవాలి. పూడికలు లేవని తెలిస్తే మామూలుగా వేసుకునే రక్త పోటు మందులు వాడితే సరిపోతుంది. దీని గురించి పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు. ఒకవేళ పూడికలు ఉన్నట్టయితే మాత్రం చికిత్సలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. పూడికలు చిన్నగానే ఉంటే వైద్యులు ఇచ్చే మందులు వేసుకోవాల్సి ఉంటుంది. పూడికలు మరీ పెద్దగా ఉంటే స్టెంట్.. కొన్నిసార్లు బైపాస్ సర్జరీ అవసరం ఉంటుంది."
--డాక్టర్ ఎ.వి.ఆంజనేయులు, సీనియర్ కార్డియాలజిస్ట్
గుండెకు రక్తాన్ని తీసుకెళ్లే నాళాల్లో వంద శాతం రక్తం గడ్డకట్టడం వల్ల గుండెపోటు వస్తుందని నిపుణులు చెబుతున్నారు. మూడోవంతు మందిలో 80-90 శాతం పూడికలే ప్రమాదానికి దారితీయవచ్చని వివరించారు. 30-40 శాతం మాత్రమే పూడుకుపోయిన రక్తనాళాలు వ్యాయామం చేసేటప్పుడు పూర్తిగా మూసుకుపోయి సమస్యను తెస్తాయని అంటున్నారు. కాబట్టి ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
గర్భిణీలకు డయాబెటిస్తో ప్రమాదం! తల్లితో పాటు బిడ్డ ఆరోగ్యానికి ముప్పు!!
ఈ డ్రింక్స్ తాగితే వింటర్లో ఫుల్ ఇమ్యూనిటీ మీ సొంతం! రోగాలు రావట! అవేంటో మీకు తెలుసా?