Causes of Hungry Feeling After Eating : కొంతమంది తిన్న వెంటనే మళ్లీ ఆకలి అంటారు. మళ్లీ మళ్లీ తింటారు. ఇలా తినడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి. మరి.. ఈ పరిస్థితికి గల కారణాలేంటి? నిపుణులు ఏమంటున్నారు? అన్నది ఈ స్టోరీలో చూద్దాం.
ప్రొటీన్ తగినంత తీసుకోకపోవడం : మనం ఆరోగ్యంగా ఉండడానికి ఎక్కువ మొత్తంలో ప్రొటీన్, తక్కువ మొత్తంలో కొవ్వులు, కార్బోహైడ్రేట్స్ అవసరం అవుతాయని చెబుతున్నారు నిపుణులు. అందులో ప్రొటీన్ అనేది.. శరీరంలో గ్లూకగాన్ వంటి హార్మోన్స్ విడుదలకు కారణమవుతుంది. ఈ హార్మోన్ బాడీలో తగినంత రిలీజ్ అయితేనే కడుపు నిండినట్లుగా అనిపించి ఆకలి(Hunger) భావనను కలిగించదు. అది తగినంత పరిమాణంలో బాడీకి లభించకపోతే.. ఎంత తిన్నా మళ్లీ తినాలనే భావన కలిగిస్తుందంటున్నారు నిపుణులు. కాబట్టి, మీరు తినే ఆహారంలో ప్రొటీన్ తగినంత ఉండేలా చూసుకోవాలని చెబుతున్నారు.
ఫైబర్ తక్కువగా తీసుకోవడం : మీరు అతి ఆకలితో ఇబ్బందిపడడానికి పీచు పదార్థం తక్కువగా తీసుకోవడం మరొక కారణం కావొచ్చని చెబుతున్నారు నిపుణులు. ఎందుకంటే.. పీచు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటే అది జీర్ణమవ్వడానికి ఎక్కువ టైమ్ పడుతుంది. దాంతో చాలాసేపు కడుపు నిండిన భావన కలుగుతుంది. అదే.. తగినంత ఫైబర్ అందకపోతే ఆకలి అనిపిస్తుందంటున్నారు. అందుకే తినే ఆహారంలో ఫైబర్ ఎక్కువ మొత్తంలో ఉండేలా చూసుకోవాలంటున్నారు.
కడుపు నిండా తినకపోవడం : చాలా మంది డైట్ పేరుతో తక్కువ మోతాదులో ఆహారం తింటుంటారు. కానీ, బాడీలో ‘స్ట్రెచ్ రెసెప్టార్స్’ ఉంటాయి. ఇవి మీరు తీసుకున్న ఆహారం పరిమాణం బట్టే కడుపు నిండిందా లేదా అన్న అంచనాకి వస్తాయి. అదే.. కడుపు నిండినట్లు అనిపించకపోతే మెదడుకి ఆకలి సంకేతాలను పంపిస్తాయని చెబుతున్నారు నిపుణులు. కాబట్టి, కడుపు నిండా తినండి.. కాకపోతే కెలోరీలు తక్కువ ఉండేలా చూసుకుంటే సరిపోతుందంటున్నారు.
అలర్ట్- ఫాస్ట్‌గా భోజనం తింటున్నారా? అయితే ఈ అనారోగ్య సమస్యలు తప్పవు!
హార్మోన్ల అసమతుల్యత : మన శరీరంలో వివిధ రకాల హార్మోన్లు ఉంటాయి. అందులో ఒక ప్రధాన హార్మోన్.. లెప్టిన్. ఇది కడుపు నిండిందన్న సంకేతాన్ని బ్రెయిన్‌కు చేరవేస్తుంది. అదే.. ఈ హార్మోన్ సరిగా రిలీజ్ కాకపోతే.. ఎంత తిన్నా మళ్లీ తినాలనిపించే చేస్తుందంటున్నారు. అందుకే.. హార్మోన్ల అసమతుల్యత ఉందేమో చెక్ చేసుకోవాలని సూచిస్తున్నారు నిపుణులు. అంతేకాదు.. ఈ కారణంగా బరువు కూడా కంట్రోల్లో ఉండదంటున్నారు.
2004లో 'ది జర్నల్ ఆఫ్ క్లినికల్ ఇన్వెస్టిగేషన్' జర్నల్‌లో ప్రచురితమైన ఒక అధ్యయనం ప్రకారం.. లెప్టిన్ లోపం ఉన్న వ్యక్తులు సాధారణ లెప్టిన్ స్థాయిలు ఉన్న వ్యక్తుల కంటే ఎక్కువ ఆకలితో ఉంటారని, ఆహార పదార్థాలకు సంబంధించిన చిత్రాలు చూసినప్పుడు వారి మెదడు ప్రతిస్పందన భిన్నంగా ఉంటుందని కనుగొన్నారు. ఈ పరిశోధనలో న్యూయార్క్‌లోని మౌంట్ సినాయి స్కూల్ ఆఫ్ మెడిసిన్‌లో పనిచేసే న్యూరోసైన్స్ ప్రొఫెసర్ డాక్టర్ డేవిడ్ స్పీగెల్ పాల్గొన్నారు. లెప్టిన్ హార్మోన్ లోపం.. అతిగా తినడాన్ని ప్రేరేపిస్తుందని ఆయన పేర్కొన్నారు.
సరైన నిద్ర లేకపోవడం : ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్ర చాలా అవసరం. కానీ, ప్రస్తుత రోజుల్లో చాలా మంది పని ఒత్తిడి, వివిధ కారణాల వల్ల నిద్రలేమి సమస్యతో బాధపడుతున్నారు. అయితే.. తగినంత నిద్రలేకపోయినా హార్మోనుల్లో సమస్యలు ఏర్పడి అతిగా ఆకలేస్తుందంటున్నారు నిపుణులు. అందుకే.. రోజులో 7 గంటలు నిద్రకు కేటాయించేలా చూసుకోవడం తప్పనిసరి అంటున్నారు.
పై విషయాల్లో ఏ ఒక్కటి సరిగా లేకున్నా.. అతిగా తినేస్తారని, మానసిక ఒత్తిడి పెరిగిపోయి స్వీట్లు, జంక్ ఫుడ్ లాగిస్తారని నిపుణులు చెబుతున్నారు. అదే జరిగితే అధిక బరువు పెరగడం నుంచి పలు రకాల ఆరోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన ఆరోగ్య సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.
ఆకలి లేకున్నా భోజనం! - "చంద్రముఖి"లో రజనీకాంత్ డైలాగ్ గుర్తుందా?