Milk And Ghee Mix Benefits : నెయ్యి అనగానే అమ్మో కొవ్వు పెరిగి లావు అవుతామని కొందరు.. గుండె సమస్యతో పాటు ఇతర హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయని మరికొందరు భయపడుతుంటారు. తినాలని అనిపించినా సరే.. నోరును కట్టేసుకుంటారు. కానీ, నెయ్యిని మితంగా తీసుకోవడం వల్ల అనేక రకాల ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా పాలలో కలిపి తీసుకోవడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని వివరిస్తున్నారు. మరి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
నెయ్యిలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయని ప్రముఖ ఆయుర్వేద నిపుణులు డాక్టర్ గాయత్రీ దేవి చెప్పారు. నెయ్యి.. మెదడు చురుకుగా పనిచేసేలా చేస్తుందని తెలిపారు. కంటి చూపు మెరుగపడడానికి, కంటి ఆరోగ్యానికి నెయ్యి మంచి ఔషధంగా పనిచేస్తుందని చెప్పారు. శరీరంలోని మలినాలను పొగొట్టడానికి కూడా నెయ్యి బాగా ఉపయోగపడుతుందన్నారు. అలాగే శరీరానికి బలానిచ్చి.. రోగ నిరోధక శక్తిని పెంచేందుకు సాయ పడుతుందని పేర్కొన్నారు. దీంతో పాటు పుండ్లు, గాయాలను తగ్గిస్తుందని వివరించారు.
ఎముకలు బలంగా ఉండటానికి నెయ్యి ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. నెయ్యిలో ఉండే విటమిన్ ఎ, విటమిన్ డి, విటమిన్ ఇ, విటమిన్ కె ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలను చేకూరుస్తుందన్నారు. ముఖ్యంగా దేశీ నెయ్యి తినడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు. నెయ్యి తీసుకోవడం వల్ల శరీరంలో మంట సమస్య తొలగిపోతుందని తెలిపారు. ఇందులోని ఆరోగ్యకరమైన కొవ్వులు.. రోజంతా శరీరాన్ని శక్తిమంతంగా ఉంచేలా చేస్తాయని వివరించారు.
ఇవే కాకుండా గోరువెచ్చని పాలలో ఒక చెంచా నెయ్యి కలిపి తాగడం వల్ల 7 రోజుల్లో శరీరానికి అద్భుతమైన ప్రయోజనాలు చేకూరుతాయట. పాలు, నెయ్యి తాగడం వల్ల కూడా కొన్ని రకాల ఆరోగ్య సమస్యలు నయమవుతాయని చెబుతున్నారు. నెయ్యి, పాలు కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి కాల్షియం, విటమిన్ డి లభిస్తుందని.. ఫలితంగా ఎముకల ఆరోగ్యం కూడా మెరుగుపడుతుందన్నారు. దీంతో పాటు కీళ్ల నొప్పులతో బాధపడేవారు పాలలో నెయ్యి కలిపి తీసుకోవటం వల్ల ఉపశమనం లభిస్తుందని చెప్పారు. ఇదే కాకుండా శరీరానికి ఫ్లెక్సిబిలిటీ పెరిగి కీళ్ల నొప్పులు, కీళ్ల వాపు వంటి సమస్యల నుంచి ఉపశమనం పొందుతారట.
పాలు, నెయ్యి కలిపి తీసుకోవటం వల్ల చర్మం తళతళ మెరిసేలా చేస్తుందని ఆయుర్వేద నిపుణులు అంటున్నారు. కడుపులో ఆమ్లం తగ్గి.. జీర్ణవ్యవస్థ ఆరోగ్యంగా పని చేస్తుందని చెప్పారు. పాలతో నెయ్యి కలిపి తీసుకోవడం వల్ల జీవక్రియ పెరిగి.. ఫలితంగా బరువు అదుపులో ఉంటుందని పేర్కొన్నారు. నిద్ర సమస్య ఉన్నవారు రాత్రిపూట పడుకునే ముందు గోరువెచ్చని పాలలో నెయ్యి కలుపుకుని తీసుకుంటే నిద్ర బాగా పడుతుందని వివరించారు.
NOTE : ఇక్కడ మీకు అందించిన సమాచారం, సూచనలు అన్నీ మీ అవగాహన కోసం మాత్రమే. శాస్త్ర పరిశోధనలు, అధ్యయనాలు, వైద్య, ఆరోగ్య నిపుణుల సూచనల ప్రకారమే మేము ఈ సమాచారాన్ని అందిస్తున్నాం. కానీ, వీటిని పాటించే ముందు కచ్చితంగా మీ వ్యక్తిగత వైద్యుల సలహాలు తీసుకోవడమే మంచిది.